కుదేలైన కూటమి.. కకావికలం అయిన కాంగ్రెస్‌

కుదేలైన కూటమి.. కకావికలం అయిన కాంగ్రెస్‌
x
Highlights

కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమన్నారు ఆయన్ని ఫామ్‌ హౌజ్‌కే పరిమితం చేయడమే టార్గెట్‌ అన్నారు అందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అన్నారు. నాలుగు పార్టీలు...

కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమన్నారు ఆయన్ని ఫామ్‌ హౌజ్‌కే పరిమితం చేయడమే టార్గెట్‌ అన్నారు అందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అన్నారు. నాలుగు పార్టీలు కలిసి కూటమి కట్టారు. ముమ్మర ప్రచారం చేశారు కానీ ఫలితాల్లో ఆ కూటమి కుదేలయ్యింది. కనీసం చాలాచోట్ల పోటీ ఇవ్వలేక కకావికలం అయ్యింది. కారు జోరుకు కూటమి కూకటి వేళ్లతో సహా కూలిపోయింది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్‌ తిరుగులేని పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్‌, టీడీపీ, జనసమితి, సీపీఐ కలిసి ఏర్పడిన మహాకూటమికి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. 80 కి పైగా స్థానాల్లో గెలుపు ఖాయం అనుకున్నా కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు. రెండు పార్టీలు ఖాతాలు తెరవనే లేదు. టీడీపీ రెండింట్లో బోణీ కొట్టగా కాంగ్రెస్‌ మాత్రం 19 స్థానాలకే పరిమితం అయ్యింది.

సెప్టెంబర్‌ 6 న అసెంబ్లీ రద్దు కాగా నవంబర్‌ మొదటి వారానికి కానీ కూటమిలో సీట్ల పంపకం పూర్తికాలేదు. మొత్తం 119 స్థానాలకు గానూ 99 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయగా టీడీపీ 13 స్థానాలు, సీపీఐ 3, టీజేఎస్‌ 8 స్థానాలుగా లెక్కలు వేసుకుని పంచుకున్నాయి. పైకి కనబడిన లెక్కలెలా ఉన్నా లోన మాత్రం కూటమి పార్టీల మధ్య ఫ్రెండ్లీ పోటీ అంటూ కొత్తగా అభ్యర్థులను నిలబెట్టారు. 99 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ ఫలితాల్లో మాత్రం 19 స్థానాలకే పరిమితం అయ్యింది. మహామహులంతా మట్టికరిచారు. సీఎం అభ్యర్థులుగా ప్రచారం చేసుకున్న వారందరికీ పరాజయమే ఎదురైంది. బరిలో నిల్చిన ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఇంటిముఖం పట్టారు.

విజయం సాధించిన 19 స్థానాల్లో టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌లో విజయం సాధించగా మధిరలో మల్లు భట్టి విక్రమార్క, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సంగారెడ్డిలో తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. అలాగే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, ఎల్‌బీ నగర్‌ నుంచి సుధీర్‌రెడ్డి, నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కు, కొల్లాపూర్‌ నుంచి హర్షవర్ధన్‌రెడ్డి, పాలేరులో ఉపేందర్‌రెడ్డి, తాండూరులో పైలెట్‌ రోహిత్‌రెడ్డి విజయం దక్కించుకున్నారు. భద్రాచలంలో పాడెం వీరయ్య విజయం సాధించగా ములుగు నుంచి సీతక్క, ఇల్లందు నుంచి హరిప్రియ, పినపాక నుంచి రేగ కాంతారావు, ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్‌ గెలుపొందారు. ఏదేమైనా ఆశించిన స్థానాల్లో బోర్లాపడ్డ కాంగ్రెస్‌ అంతర్మథనంలో పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories