విపక్షాల గురి కుదురుతుందా? తప్పుతుందా?

Submitted by santosh on Thu, 10/11/2018 - 18:18
telanagana elections

తెలంగాణలో రాజకీయం రసపట్టుకు చేరుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వేడి పెంచుతోంది. కాక పుట్టిస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలే తమకు అస్త్రాలవుతాయంటూ విపక్షం... ప్రతిపక్షాల కూటమి కొలిమే తమకు కలసి వస్తుందంటూ పాలకపక్షం... ఇలా ఎవరికి వారు పట్టు సాధించేందుకు ఎంత ప్రయత్నించాలో అంతా చేస్తున్నారు. కానీ కేసీఆర్‌ ఒక్కడు ఒకవైపు... కూటమి అంతా మరోవైపు. ఇలా ఆసక్తికరంగా, ఓటరు ప్రసన్నతే ధ్యేయంగా సాగుతున్న తెలంగాణ రాజకీయం ఏం చెబుతోంది? అన్నీ తానై ముందుకు నడుస్తూ నడిపిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్‌ని ఢీకొట్టే అస్త్రాలు ప్రతిపక్షాల దగ్గర ఏమున్నాయ్‌. 

తెలంగాణ ఏర్పడిందే సెంటిమెంట్ మీద. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందీ సెంటిమెంట్ మీదే. రాజకీయాలను కాపుకాసే కులం, మతం, ప్రాంతం అన్నీ సెంటిమెంట్లమయమే. మరిప్పుడు టైమ్‌ వచ్చింది. తెలంగాణలో పట్టాభిషేకమే పరమావధిగా పావులు కదుపుతున్నా పార్టీలు. ఇదే సమయంలో గులాబీ దళాధినేత.... సెంటిమెంట్ పండించే పనిలో పడ్డారు. పనిలో పనిగా సెంటిమెంట్‌కు అయింట్‌మెంట్‌ పూస్తూనే... అధికారపక్షాన్ని ఢీకొట్టే అస్త్రాలకు పదును పెడుతున్నాయి కూటమిపార్టీలు.

ఎన్నికలకు సమయం ఎంతో లేదు. మహా అయితే రెండునెలలు. చూస్తుండగానే వచ్చేస్తుంది. కనుతెరిచి మూసే లోగా కాలం కరిగిపోతోంది. ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా మాట్లాడే ప్రతిమాట విలువైనదే. ప్రతీ హామీ ఒక అస్త్రమే. అధికార పార్టీ వైఫల్యాలను భూతద్దంలో చూపించడం ప్రతిపక్షం పనైతే... విపక్షాలవి అలవికానీ హామీలంటూ పాలకపక్షం ప్రజల్లోకి వెళ్తోంది. అందుకు అనుగుణంగానే పార్టీలన్నీ జోరు పెంచుతూపోతున్నాయి. తిప్పికొట్టే కూటమి పార్టీలు.. ఎవరికి వారే హంగామా చేస్తున్నారు. 

తెలంగాణ వెలిగిపోతోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు. మళ్లీ అధికారపీఠం కోసం ఆరాటపడుతున్నారు. అసలు తెలంగాణను ఇచ్చింది మేమేనంటూ కూటమి కేంద్రంగా కాంగ్రెస్‌ కదంతొక్కుతుంది. మోగుతున్న ఎన్నికల శంఖారావంలో కేసీఆర్ వైఫల్యాలనే అస్త్రాలుగా సిద్ధం చేసుకుంటుంది. కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ సహా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కేసీఆర్‌ ప్రభుత్వంలో పది వైఫల్యాలంటూ పది అస్త్రాలు సంధిస్తున్నాయ్. 

English Title
telanagana elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES