తెరపైకి వచ్చిన బాలీవుడ్‌ చీకటి కోణం...బీటౌన్‌ను షేక్‌ చేస్తోన్న తనుశ్రీ దత్తా కామెంట్స్‌

Submitted by arun on Mon, 10/08/2018 - 14:32
Tanushree DuttaNana Patekar

బాలీవుడ్‌ వెలుగుజిలుగుల వెనుక ఉన్న చీకటివ్యవహారాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. చీకటి తెరపై  కొన్ని నెలల క్రితం  రాధికా ఆప్టే, ఉషాఝాదవ్‌ తదితరులు ఈ తేనెతుట్టెను కదిలించారు. అది  కాస్త గడ్డిమంటలా ఉవ్వెత్తున ఎగసి.. అంతలోనే చల్లారిపోయింది. మంటలు ఆరిపోయాయిగానీ నిజమనే నిప్పు మాత్రం నివురుగప్పి అలాగే ఉండిపోగా ఆశిక్‌ బనాయా అంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న తనుశ్రీ దత్తా ఆ నిప్పును మరోసారి రగిలించారు. అందరూ పెద్దమనిషిగా భావించే నానాపాటేకర్‌ తనపై  లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణ చేయడం హాట్‌టాపిక్‌గా మారడంతో పాటు పలు ప్రకంపనాలు సృష్టిస్తోంది.

బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ పదేళ్ల క్రితం తనను లైంగికంగా వేధించాడని  బ్యూటీ తనుశ్రీ చేసిన ఆరోపణలు  బాలీవుడ్‌నూ షేక్‌ చేస్తోంది.  డ్యాన్స్‌  నేర్పుతానని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని  చేసిన సంచలన ఆరోపణలు ఇండస్ట్రీని ఊపేస్తోంది. హర్న్‌ ఓకే ప్లీజ్‌ సినిమా టైంలో  నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బ్యూటీ బాంబ్‌ పేల్చడంతో బాలీవుడ్‌ నివ్వెర పోవడంతో పాటు రోజుకో మలుపు తిరుగుతుంది.

గత కొన్ని రోజులుగా హాట్‌ బ్యూటీ తనుశ్రీ- నానా పాటేకర్‌ల వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. దీనిపై పలువురు నటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే  ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా , కంగనా రనౌత్‌, సోనమ్‌కపూర్లు  సపోర్ట్‌గా నిలవగా  తాజాగా  కేంద్రమంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు. వేధింపులను ఉపేక్షించేది లేదన్న ఆమె బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై ఎప్పుడు బయటకు వచ్చారనేది విషయం ముఖ్యం కాదన్నారు. మన దేశంలో కూడా 'మీటూ' ఉద్యమం ప్రారంభం కావాలన్నారు. దీని ద్వారా ఏ మహిళ అయినా సరే తనకు ఎదురైన వేధింపుల గురించి మాకు ఫిర్యాదు చేయవచ్చునని మేం దానిపై విచారణ జరుపుతామన్నారు.

నానా పటేకర్‌పై తను శ్రీ చేస్తున్న ఆరోపణలకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇన్నాళ్లూ మచ్చలేని వ్యక్తిగా పరిశ్రమలో గొప్పస్థానం సంపాదించుకున్న నానాపటేకర్‌పై విమర్శలు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నానాపటేకర్ అలాంటి వ్యక్తి కాదని అలాంటిదేమైనా ఉంటే అప్పుడే ప్రస్తావించి ఉండాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

English Title
Tanushree Dutta, Nana Patekar row

MORE FROM AUTHOR

RELATED ARTICLES