పొలిటికల్‌ హీట్‌ పెంచిన రేవంత్‌రెడ్డి అరెస్ట్ వ్యవహారం

పొలిటికల్‌ హీట్‌ పెంచిన రేవంత్‌రెడ్డి అరెస్ట్ వ్యవహారం
x
Highlights

సరిగ్గా 12 గంటల హైడ్రామా తర్వాత టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విడుదలయ్యారు. ఈసీ ఆదేశాలతో జడ్చర్ల పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నుంచి...

సరిగ్గా 12 గంటల హైడ్రామా తర్వాత టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విడుదలయ్యారు. ఈసీ ఆదేశాలతో జడ్చర్ల పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నుంచి రేవంత్‌ను ప్రత్యేక వాహనాల్లో కొడంగల్‌కు తరలించారు. అంతకుముందు రేవంత్‌ ఆచూకీ తెలపాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అర్ధరాత్రి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించింది. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ వ్యవహారం పొలిటికల్‌ హీట్‌ పెంచింది. రేవంత్‌ అరెస్ట్‌పై కాంగ్రెస్‌ నాయకుడు వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఏ ఆధారాలతో రేవంత్‌ను అరెస్ట్ చేశారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రేవంత్‌ వల్ల అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్‌ నివేదిక ఆధారంగానే అరెస్ట్‌ చేసినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ధర్మాసనానికి తెలిపారు. దీంతో ఆ నివేదికను 10 నిముషాల్లో తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశిస్తూ తొలుత 10 నిముషాల పాటు వాయిదా వేసింది. అయితే 10 నిముషాల్లో ఇంటెలిజెన్స్‌ నివేదికను సమర్పించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు బుధవారం సమర్పిస్తామన్న ప్రభుత్వం తరపు న్యాయవాదిపై హైకోర్టు అసంతృఫ్తి వ్యక్తం చేసింది. ఏజీ స్వయంగా తమ ముందు హాజరుకావాలంటూ విచారణను మరోసారి వాయిదా వేసింది. ఆ తర్వాత ఏజీ వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేసిన హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఎస్పీ అన్నపూర్ణను కలిసిన రేవంత్‌రెడ్డి భార్య అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలకు రావడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ఈ తరహాలో అరెస్ట్ చేశారంటూ నిలదీశారు. అయితే రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై వివరణ ఇచ్చిన ఎస్పీ అన్నపూర్ణ ఈసీ ఆదేశం మేరకే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేశారు. అరెస్ట్ సమయంలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఇదే సమయంలో ఈసీకి కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. రేవంత్‌ తమ స్టార్‌ క్యాంపేయినర్‌ అని ఎక్కడైనా ప్రచారంలో పాల్గొనే హక్కు ఉందని అతన్ని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రజత్‌కుమార్‌ రేవంత్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ డీజీపీని ఆదేశించారు. ఈసీ ఆదేశాలు అందుకున్న పోలీసులు రేవంత్‌ను జడ్చర్ల పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నుంచి కొడంగల్‌లోని ఆయన నివాసం ముందు వదిలిపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories