రాహుల్ గాంధీ రాజకీయం మొదలు పెట్టారు

రాహుల్ గాంధీ రాజకీయం మొదలు పెట్టారు
x
Highlights

రాహుల్‌ గాంధీ ముందున్న అతిపెద్ద సవాలు నరేంద్ర మోదీ-అమిత్‌ షాలను ఎదుర్కోవడం. ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటూ పిలుపునిచ్చి, నిజంగానే శతాధిక...

రాహుల్‌ గాంధీ ముందున్న అతిపెద్ద సవాలు నరేంద్ర మోదీ-అమిత్‌ షాలను ఎదుర్కోవడం. ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటూ పిలుపునిచ్చి, నిజంగానే శతాధిక పార్టీని తుడిచిపెట్టేస్తున్నారు. తనదైన వాక్చాతుర్యం, ప్రచారం, ఆన్‌లైన్‌ దూకుడుతో నరేంద్ర మోదీ దూసుకుపోతుంటే, బూత్‌లెవల్లో కాంగ్రెస్ వేళ్లను పెకలిస్తూ, బీజేపీ వృక్షాన్ని నాటేస్తున్నాడు అమిత్‌ షా. ఈ ఇద్దరి రాజకీయ చాణక్యాన్ని ఎదుర్కోవాలంటే, రాహుల్‌ మరింతగా శ‌్రమటోడ్చకతప్పదు. ఎత్తులకు పైఎత్తులు వేయాలి. ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి. అందుకు అన్ని విధాలా తనను తాను సానపెట్టుకోవాలి. కార్యకర్తల సేనను పదునుపెట్టాలి. వ్యూహాలను రాటుదేల్చాలి.
గుజరాత్‌, హిమాచల్‌ గెలుపుతో 2018లోనే నరేంద్ర మోదీ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా వెళ్లొచ్చు. అంటే రాహుల్‌ ముందు ఏడాది సహయం కూడా లేదు. ఈ తక్కువ టైంలోనే రాహుల్‌ పార్టీని, వ్యూహాలను, ఎన్నికల సైన్యాన్ని సిద్దం చేసుకోవాలి.
రాహుల్‌ ముందున్న మరో ఛాలెంజ్ యూపీఏ. మరి రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగానే ఉండి, యూపీఏ బాధ్యతలు సోనియానే అట్టిపెట్టుకుంటారా అన్నది తేలకపోయినా, పెద్ద పార్టీ నాయకుడిగా యూపీఏను లీడ్ చేయాల్సింది రాహులే. అయితే యూపీఏ పక్షాలు రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తాయా, వారి నమ్మకాన్ని రాహుల్‌ పొందగలడా అన్నది కాలమే నిర్ణయించాలి.
బీజేపీకి హిందూత్వ ప్రాణవాయువైతే, కాంగ్రెస్‌కు ప్రాణప్రదం లౌకికత్వం. అయితే ఇటీవల గుజరాత్‌ ఎన్నికల్లో హిందూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఆ స్ఫూర్తికి విరుద్దంగా రాహుల్ వ్యవహరించారన్న విమర్శలున్నాయి. హిందూ ఓట్ల కోసం అభివృద్ది అజెండాను బీజేపీ తొంగలో తొక్కిందని విమర్శించిన రాహుల్, అదే పంథా కొనసాగించి ద్వంద్వ ప్రమాణాలు పాటించాడని స్వంత పార్టీ నేతలే సణుక్కున్నారు. మరి ఈ తీరును రాహుల్ ఎలా నిర్వచించుకుంటారో, లేదంటే సరిదిద్దుకుంటారో చూడాలి.
అయితే తన పట్టాభిషేక వేడుకలో చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్. బీజేపీ అంటే శత్రుత్వమేమీలేదన్న రాహుల్, దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే కానీ, బీజేపీ నమ్మే విలువలతో తాను ఏకీభవించలేనన్నారు. వాళ్లు కూల్చేస్తారు...మేం నిర్మిస్తాం. వాళ్లు దాడులు చేస్తారు...మేం ప్రేమిస్తామంటూ, పట్టాభిషేక ప్రసంగంలో కాషాయదళంపై యుద్ధం ప్రకటించారు.
మొత్తానికి మొన్నటివరకు రాజకీయాలంటే విముఖత ఉన్నట్టు కనిపించిన రాహుల్, పట్టాభిషేక సంబరంలో సమరనాదం వినిపించారు. అసహన రాజకీయాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. యువకుడిగా ఉండటం, అతిపెద్ద పార్టీ అండ, యువసైన్యం అండ రాహుల్‌కు ఉన్నాయి. కానీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు పార్టీని పటిష్టం చేయడం, యువరక్తంతో నింపడం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, రాహుల్‌ గాంధీకి అగ్నీ పరీక్ష కానున్నాయి. మరి ఈ ఆరు సవాళ్లను రాహుల్‌ గాంధీ ఎలా ఎదుర్కొంటారో...కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories