రాఫెల్‌పై కేంద్రానికి సుప్రీం షాక్.. పదిరోజుల్లోగా..

రాఫెల్‌పై కేంద్రానికి సుప్రీం షాక్.. పదిరోజుల్లోగా..
x
Highlights

వివాదాస్పద రాఫెల్ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ధరలు, వ్యూహాత్మక వివరాలు వెల్లడించాలంటూ...

వివాదాస్పద రాఫెల్ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ధరలు, వ్యూహాత్మక వివరాలు వెల్లడించాలంటూ ఆదేశించింది. పదిరోజుల్లోగా సీల్డ్ కవర్‌లో వివరాలు సమర్పించాలంటూ గడువు విధించింది. ఈ ఒప్పందంలో ఆఫ్‌సెట్ భాగస్వాముల వివరాలు కూడా చెప్పాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

రాఫెల్ ఒప్పందంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయవాదులు మనోహర్ లాల్ శర్మ, వినీత్ ధండా దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ‌పై భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. యుద్ధ విమానాల ధరలను రహస్యంగా ఉంచాల్సినందున వీటిని వెల్లడించడం సాధ్యం కాదంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాలన్ కోర్టుకు నివేదించారు. దీంతో రాఫెల్ ధరల వివరాలు రహస్యమనీ, వాటిని వెల్లడించడం కుదరదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి కోర్టు సూచించింది. తాము సాంకేతిక వివరాలు వెల్లడించాలని కోరడం లేదనీ.. బహిర్గతం చేయకూడని కీలక సమాచారం ఏదైనా ఉంటే కేంద్రం గోప్యంగా ఉంచవచ్చునని వివరణ ఇచ్చింది.

ధరలు, సాంకేతిక వివరాలు మినహా రాఫెల్ ఒప్పందం సందర్భంగా జరిగిన నిర్ణయాల ప్రక్రియపై సీల్డ్ కవర్‌లో వివరాలు సమర్పించాలంటూ ఈ నెల 10 సుప్రీంకోర్టు కేంద్రాన్ని గతంలోనే కోరింది. తాజాగా ధరలు, సాంకేతిక వివరాలు కూడా సమర్పించాలని ధర్మాసనం కోరడం గమనార్హం. మరోవైపు రాఫెల్ ఒప్పందంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. అయితే ప్రస్తుతం సీబీఐలోనే పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయనీ అవన్నీ చక్కబడిన తర్వాత దీనిని పరిశీలించవచ్చునని కోర్టు పేర్కొంది. ఫ్రాన్స్ యుద్ధ విమానాల సంస్థ డసాల్ట్‌తో భారత్ తరపున ఎంపికైన ఆఫ్‌సెట్ భాగస్వాముల్లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కూడా ఉంది. అనిల్ అంబానీకి చెందిన డిఫెన్స్ సంస్థ‌కు ఈ కాంట్రాక్టును ఎలా అందించారో చెప్పాల‌ని కూడా అత్యున్నత న్యాయస్థానం కోరింది. ఒక్కొక్క రాఫెల్‌ను ఎంత ధ‌ర పెట్టి కొన్నారో స్పష్టం చేయాలని సుప్రీం కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories