దేశాన్ని కుదిపేస్తున్న రెండు అత్యాచార ఘటనలు

దేశాన్ని కుదిపేస్తున్న రెండు అత్యాచార ఘటనలు
x
Highlights

బేటీ బచావో...బేటి పడావో అంటూ పాలకులు చాలా గొప్ప నినాదాలిచ్చారు బాలికలను రక్షించడానికి. కానీ దీనికిప్పుడు రివర్స్‌గా జరుగుతున్న పరిణామాలు. బేటి...

బేటీ బచావో...బేటి పడావో అంటూ పాలకులు చాలా గొప్ప నినాదాలిచ్చారు బాలికలను రక్షించడానికి. కానీ దీనికిప్పుడు రివర్స్‌గా జరుగుతున్న పరిణామాలు. బేటి బచావో..బేటి డరావో అన్నట్టుగా, ఆడపిల్లలకు రక్షణలేకుండాపోయింది. జమ్మూకాశ్మీర్‌ కతువాలోని ఓ గుడిలో, కొందరు కిరాతకులు, ఎనిమిదేళ్ల బాలికపై సామాహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అటు యూపీలో ఓ ఎమ్మెల్యే అతని అనుచరణ గణం యువతిని రేప్‌ చేయడమే కాదు, తండ్రినీ పొట్టనపెట్టుకున్నారు. దోషులను బోనెక్కించాల్సిందిపోయి, వారిని రక్షించాలని పాలకులు, కంకణం కట్టుకోవడమే అంతకుమించిన విషాదం. కులం మతం రంగు పులుమూతూ, అత్యాచారబాధితులకు మరింత శోకం మిగులుస్తున్నారు.

ఢిల్లీ నిర్భయ ఘటన దేశాన్ని ఎలా కుదిపేసిందో, చూశాం. అయ్యో అనుకున్నాం. చట్టం తెచ్చుకున్నాం. కానీ నిర్భయ చట్టం, అమ్మాయిలకు అభయం ఇవ్వలేదని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇదిగో నిర్భయను మించిన రెండు దారుణ ఘటనలు. దాని చుట్టూ, రాజకీయపార్టీల ఊసరవెల్లి రంగులు. ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు, అసిఫా. వయస్సు ఎనిమిదేళ్లు. తన ఇంటికి సమీపంలో గుర్రాలు కాస్తున్న ఈ మైనర్‌ను, రిటైర్డ్‌ రెవెన్యూ అధికారి సాంజీ రామ్‌ను కిడ్నాప్ చేశాడు. పక్కనే ఉన్న గుడిలో బంధించి మత్తు మందు ఇచ్చాడు. ఆమెపై అత్యాచారం చేయాల్సిందిగా తన మేనల్లుడిని ఉసిగొల్పాడు. అతడు, అతని స్నేహితుడు బాలికను రేప్ చేశారు. వీరేకాదు, తర్వాత మీరట్‌ నుంచి వచ్చిన సాంజీరామ్‌ కుమారుడు విశాల్‌, పోలీసు అధికారి దీపక్‌ ఖజూరియా కూడా చిన్నారిపై అత్యాచారానికి తెగబడ్డారు. 4 రోజులపాటు ఒకరి తర్వాత మరొకరు అనేకసార్లు, బాలికను రేప్ చేశారు. జనవరి 14న సాంజీ మేనల్లుడు చిన్నారిని, కర్రతో బాది చంపేశాడు.

అసిఫా డెడ్‌బాడీని గుడికి సమీపంలోని అడవుల్లో పడేశారు. ఈ అమానుషాన్ని కప్పిపుచ్చుకునేందుకు, సాంజీ రామ్‌ స్థానిక పోలీసులకు రూ.3 లక్షలు లంచం ఇచ్చాడు. లంచం మేసిన విశ్వాసానికి రేపిస్టులను రక్షించేందుకు పోలీసులు చాలా ప్రయత్నం చేశారు. బాధితులతో పాటు జమ్మూకాశ్మీర్‌ బార్‌ అసోసియేషన్‌ లాయర్లు ఆందోళన చేశారు. పోరాటం ఉధృతం కావడంతో, ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈనెల 16న స్థానిక న్యాయస్థానం ఈ కేసును విచారించనుంది.

కానీ బాధితులకే కాదు దేశం గుండె తరుక్కుపోయే దారుణం ఏంటంటే, అసిఫా చుట్టూ మతరాజకీయాలు రగులుకోవడం. నిందితులకు మద్దతుగా కొందరు నిర్వహంచిన ర్యాలీలో, ఇద్దరు బీజేపీ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రేపిస్టులకు అనుకూలంగా మాట్లాడారు.

అంతేకాదు, బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రేపిస్టులను వెనకేసుకురావడం మరింత దారుణం. బాధితి కుటుంబానికి మద్దతుగా ర్యాలీ చేసిన కాశ్మీర్‌ బార్‌ అసోసియేషన్‌‌ అధ్యక్షుడు కాంగ్రెస్‌ వాది అంటూ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మీనాక్షిలేఖి వ్యాఖ్యానించారు. యూపీ ఉన్నావ్‌ కేసులోనూ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌నూ మీనాక్షి వెనకేసుకురావడం దారుణం. అతని పేరును, మొదట కంప్లైంట్‌లో చేర్చలేదని, వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు కాశ్మీర్‌, అసిఫా అత్యాచార ఘటనను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఖండించారు. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న రాహుల్, ఈ ఘటనలో నిందితులకు రక్షణ కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రేపిస్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. దోషులను ఉరిశిక్ష వేయాలని, మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు, బాలీవుడ్ ప్రముఖులు డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు నిందితులను వెనకేసుకురావడం ఏంటని, బేటి బచావో, బేటి పడావో స్ఫూర్తి ఇదేనా అని, బీజేపీపై విపక్షాలు మండిపడ్డాయి.

దేశాన్ని కుదిపేస్తున్న మరో అత్యాచార ఘటన, ఉత్తరప్రదేశ్‌‌ ఉన్నావ్‌లో అత్యాచార ఘటన, యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతేడాది జూన్‌లో ఓ యువతిపై ఎమ్మెల్యే, అతని అనుచరుల రేప్, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, అతని అనుచరులు కలిసి గత ఏడాది జూన్‌లో తనపై అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు మాత్రం, కేసు ఫైల్‌ చేయలేదు. దాంతో యువతి కుటుంబ సభ్యులు న్యాయస్థానం మెట్లెక్కారు.

అయితే, కేసు వెనక్కుతీసుకోవాలంటూ, ఏడాదిగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బాధితులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్యే సోదరుడూ, అనుచరులు కలిసి బాధితురాలి తండ్రిని, కుటుంబ సభ్యులనూ తీవ్రంగా కొట్టారు. వేధింపులు తీవ్రం కావడంతో, న్యాయం చేయాలంటూ, సీఎం యోగి నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది బాధితురాలు. ఎమ్మెల్యేపై కేసు ఫైల్ చేయాలని ఎంత చెబుతున్నా, వినని పోలీసులు, బాధితురాలి తండ్రిని అరెస్టు చేశారు. తీవ్రంగా కొట్టారు. లాకప్‌లోనే అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు. దీంతో ఉన్నావ్‌ రేప్ కేసు, జాతీయస్థాయిలో సంచలనమైంది.

యూపీలో జంగిల్‌ రాజ్‌కు పాతరేస్తాను, శాంతిభద్రతలను కట్టుదిట్టం చేస్తానని హామినిచ్చిన సీఎం యోగి, తన ఎమ్మెల్యేపై మాత్రం ఈగవాలనివ్వలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. కుల్దీప్ సింగ్‌ను రక్షించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు మిన్నంటాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై అలహాబాద్‌ హైకోర్టు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నకు.. సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఇంతకుముందు కేసులన్నింటిల్లోనూ సాక్ష్యాలు లేకుండా ఎవరినీ అరెస్ట్ చేయలేదా? అని మండిపడింది.

ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు పెరగడంతో, ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటైంది. ఈ కేసును సిట్‌ నుంచి సీబీఐకి బదలాయించారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను అదుపులోకి తీసుకుంది సీబీఐ. అటు కాశ్మీర్‌ కతువా, ఇటు యూపీ ఉన్నావ్‌. రెండు అత్యాచార ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ రెండు కేసులకూ, రాజకీయ, మతం రంగు పులమడమే విషాదం. బీజేపీ, కాంగ్రెస్‌లు పొలిటికల్‌ ప్రయోజనాలు పక్కనపెట్టి, బాధితులకు న్యాయం చేయాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. స్త్రీలు స్వేచ్చగా తిరిగే పరిస్థితులు కల్పించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories