వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం...ఆసక్తికరంగా మారిన ఉపఎన్నికల అంశం

వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం...ఆసక్తికరంగా మారిన ఉపఎన్నికల అంశం
x
Highlights

ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. గత ఎప్రిల్‌లో చేసిన రాజీనామాలకు.. ఇప్పుడు రాజముద్ర పడింది. దీనికి సంబంధించిన బులిటెన్‌ను.. లోక్‌సభ...

ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. గత ఎప్రిల్‌లో చేసిన రాజీనామాలకు.. ఇప్పుడు రాజముద్ర పడింది. దీనికి సంబంధించిన బులిటెన్‌ను.. లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. మరి వీరి రాజీనామాలతో ఖాళీ అయిన 5 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలకు అవకాశం ఉందా..? అసలు ప్రజా ప్రాతినిద్య చట్టం ఏం చెబుతోంది..?

ప్రత్యేక హోదా లక్ష్యంగా సాగుతున్న ఏపీ రాజకీయాలు.. మరో మలుపు తీసుకున్నాయి. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో మొదలైన హోదా రాజకీయాలు.. వైసీపీ ఎంపీ రాజీనామాలు ఆమోదింపజేసుకోవడం వరకు కొనసాగాయి. గత ఎప్రీల్‌ 6 న పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ముగిసిన రోజున.. వైసీపీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు.. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖలను స్పీకర్‌కు అందజేశారు.

తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడమే లక్ష్యంగా.. వైసీపీ ఎంపీలు రెండుసార్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిశారు. తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దీంతో ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలు.. జూన్ 20 నుంచే అమల్లోకి వస్తున్నట్లు.. స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. హోదాకోసం చిత్తశుద్దితో తాము రాజీనామా చేశామని.. ఇక ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తామని.. వైసీపీ ఎంపీలు ప్రకటించారు.

అయితే వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన 5 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణ ఎన్నికలకు మరో 10 నెలల సమయం ఉన్న తరుణంలో రాజీనామాలు ఆమోదం పొందితే.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అనేది తేలాల్సిన అంశంగా మారింది. అయితే ఉప ఎన్నికలు వస్తాయని.. రాజీనామా చేసిన వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు.

అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం- 1951 ప్రకారం.. సాధారణ ఎన్నికలకు యేడాది ముందు.. రాజీనామాలు లేదా ఇతర కారణాలతో ఏవైనా స్థానాలు ఖాళీ అయితే.. వాటికి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కేంద్రం తన విశేషాధికారాలు ఉపయోగిస్తే తప్ప.. బై ఎలక్షన్స్ రావని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయం తెలుసుకునే వైసీపీ నాయకులు.. రాజీనామా పేరుతో డ్రామాలాడుతున్నారని.. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాజీనామాలతో పార్లమెంట్‌లో వైసీపీ తమ వాయిస్ పోగొట్టుకున్నట్లైందని.. టీడీపీ ఎంపీ శివప్రసాద్.. చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికలు రావని తెలుస్తున్నా.. రాష్ట్రంలో ఒక్కసారిగా.. రాజకీయాలు ఊపందుకున్నాయి. ఐదు స్థానాల్లో తమదంటే తమదే విజయం అని అధికార ప్రతిపక్ష నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories