రూ.5 కోట్లిస్తా.. రేప్‌ చేశానని చెప్పొద్దు...కలకలం రేపుతున్న...

Submitted by arun on Thu, 09/13/2018 - 14:57
Kerala nun rape case

కేరళలో నన్ రేప్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. క్రైస్తవ సన్యాసినిని బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ అత్యాచారం చేసిన వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నన్‌ల ఆందోళనతో కేసు విచారణ వేగంవంతం అయ్యింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలంటూ బిషప్ఫ్రాంకో ములక్కల్‌కు పోలీసులు సమన్లు పంపారు. మరోవైపు బాధిత నన్ వాటికన్‌ కు లేఖ రాయడంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. 

రూ.5 కోట్లిస్తా.. రేప్‌ చేశానని చెప్పొద్దు..మీరు నన్ను ఏం చేయలేరు..కేసు విత్‌డ్రా చేసుకుంటే మంచిది...ఇది అత్యాచారానికి గురైన ఓ క్రైస్తవ సన్యాసినితో ఓ బిషప్ చేసిన బేరం. బెదిరింపులు. అయితే ఆ బేరాన్ని బాధితురాలు తిరస్కరించింది. రేప్‌ కు గురైన నన్‌తో బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ జరిపిన రాజీ వ్యవహారం కలకలం రేపుతోంది.

జలంధర్‌ బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ తనను అత్యాచారం చేసినట్లు ఓ నన్‌ చర్చికి ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత ఆ కథ కోర్టుకి చేరడం సంచలనం రేపుతోంది. 2014-16 మధ్య బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ తనను పలుసార్లు రేప్ చేశాడని ఆరోపిస్తున్న నన్ మొదట చర్చి ఉన్నతస్థాయి వర్గాలకు ఫిర్యాదు చేశారు. చర్చి నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అక్కడా ఆమెకు న్యాయం జరక్కపోవడంతో కోర్టుల మెట్లెక్కారు. అసలు కేరళలో ఏం జరుగుతోందంటూ సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టు కొరడా ఝళిపించడంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు.
 
కోర్టుల ఆదేశాలతో విచారణ జరిపిన పోలీసులు నన్‌ ఆరోపణలు కొంత వరకు నిజమేనని ధ్రువీకరించారు. కురవిలాంగద్‌ అనే ఊళ్లోని చర్చిలో క్రైస్తవ సన్యాసిని 20వ నెంబరు రూములో బంధించి, ఆమె అనుమతి లేకుండా బిషప్ ఫ్రాంకో అసహజ లైంగిక దాడికి, అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించారు. దీంతో ఆ బిషప్ కాళ్ళ బేరానికి వచ్చాడు. ఆ నన్‌కు ఏకంగా 5 కోట్ల రూపాయల ఆఫర్ చేశాడు. ఈ మేరకు మధ్యవర్తి ద్వారా రాయబేరం నడిపాడు. రేప్‌ కేసు ఉపసంహరించుకుంటే ఐదు కోట్ల రూపాయలివ్వడంతో పాటు చర్చిలో జీవితం సాఫీగా సాగేట్లు చేస్తానని ఫ్రాంకో ములక్కల్‌ తరఫున మధ్యవర్తి తమను సంప్రదించారని బాధితురాలి సోదరుడు తెలిపారు. అంతేకాదు మీరు నన్ను ఏం చేయలేరంటూ బెదిరించారని వివరించారు. అయితే నన్‌ తనపై చేసిన ఆరోపణలను బిషప్ ఫ్రాంకో కొట్టిపారేశారు. చర్చ ప్రతిఫ్టను దెబ్బతీయడానికి క్రైస్తవ వ్యతిరేకులు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.

ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నా బాధిత నన్ కీచక బిషప్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల కిందట క్యాధిలిక్ కేంద్ర కార్యాలయమైన వాటికన్ కు లేఖ రాశారు. తన మాటలు ఎందుకు నమ్మడం లేదని పోప్ ఫ్రాన్సిస్ ప్రతినిధిని ఆమె ప్రశ్నించారు ఫ్రాంకో ములక్కల్‌పై కేసు పెట్టిన దగ్గర్నుంచి తనను చర్చి ఎందుకు పక్కనపెట్టిందని నిలదీశారు. నాకు జరిగిన నష్టాన్ని చర్చి తిరిగివ్వగలదా అని ప్రశ్నించిన నన్ చర్చి ఎందుకు కళ్లు మూసుకుందని లేఖ రాశారు.  

వాటికన్‌కు నన్ రాసిన లేఖ కేరళ పోలీసు యంత్రాంగాన్ని కుదిపేసింది. పోలీసు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమైన ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఫ్రాంకో ములక్కల్‌కు సమన్లు పంపారు. మరోవైపు బిష్‌పపై చర్య తీసుకోవడంలో తాత్సారాన్ని నిరసిస్తూ వారం రోజులుగా నన్‌లు కేరళలోని వివిధ ప్రాంతాల్లోనూ హైకోర్టు దగ్గర ధర్నా చేస్తున్నారు. చర్చిపై తమకు నమ్మకం పోయిందని వారంటున్నారు. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తీరుగుతుందో చూడాలి.
 

English Title
Kerala nun rape case: Police summon accused bishop Franco Mulakkal on 19 Sep

MORE FROM AUTHOR

RELATED ARTICLES