14 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించని కేసీఆర్‌...తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఆశావహులు

Submitted by arun on Fri, 10/12/2018 - 09:56
kcr

కేసీఆర్‌ పెండింగ్‌లో పెట్టిన పద్నాలుగు సీట్లపై టీఆర్ఎస్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. టికెట్లు ఆశిస్తున్న నేతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తమకే టికెట్‌ గ్యారంటీ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాఅభ్యర్ధుల్ని ఎప్పుడు ప్రకటిస్తారోనని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే తమ బంధువులకు, అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు మంత్రులు, సీనియర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కేసీఆర్‌ను ఇటు కేటీఆర్‌‌ను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు.

105మంది అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించి ఎన్నికల కదనరంగంలోకి దూకిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ 14 సీట్లను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. దాంతో ఆ పద్నాలుగు నియోజకవర్గాల్లో ఆశావహులంతా టెన్షన్‌కు గురవుతున్నారు. ఆ సీట్లకు అభ్యర్ధులను ఎప్పుడు ప్రకటిస్తారోనని ఎదురుచూస్తున్నారు. కొందరైతే తమకే టికెట్‌ గ్యారంటీ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో ప్రధానంగా హుజూర్‌నగర్‌, కోదాడ అభ్యర్ధులు ఎవరనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునేందుకు మంత్రి జగదీష్‌‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌‌నగర్‌ నుంచి శంకరమ్మ టికెట్‌ ఆశిస్తోంది. అయితే తనకు ఇవ్వనిపక్షంలో ఎన్నారై అప్పిరెడ్డికి ఇవ్వాలని కోరుతోంది. కానీ హుజూర్‌నగర్‌ టికెట్‌‌ను తన అనుచరుడు సైదిరెడ్డికి ఇప్పించుకునేందుకు మంత్రి జగదీష్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. అలాగే కోదాడ టికెట్‌ శశిధర్‌‌రెడ్డికి కేటాయించాలని కేసీఆర్‌‌ను కోరుతున్నారు.

రాజకీయాల్లో తలపండిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి కూడా టికెట్ గోల తప్పడం లేదు. నాయిని గతంలో ఎన్నోసార్లు ప్రాతినిథ్యం వహించిన ముషీరాబాద్‌ను కూడా కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచి పోటీచేసి ఓడిపోయిన ముఠా గోపాల్‌ మళ్లీ తనకే టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. దాంతో అలర్ట్‌ అయిన నాయిని తన అల్లుడు, రాంనగర్‌ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ తన అల్లుడికి ఇవ్వకపోతే తనకే ఇవ్వాలని పట్టుపడుతున్నారు. తన అభీష్టాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన నాయిని మంత్రి కేటీఆర్‌తోనూ చర్చించారు.

105మంది అభ్యర్ధుల ప్రకటన తర్వాత అత్యంత వివాదాస్పదమైన చెన్నూరుపై ఇంకా పోరు నడుస్తోంది. ఎంపీ బాల్క సుమన్‌‌కు టికెట్‌ కేటాయిండంతో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అనుచరుడు ఆత్మహత్య సైతం చేసుకున్నాడు. అయితే కేసీఆర్‌ బుజ్జగింపులతో ఓదేలు మెత్తబడ్డా ఇప్పుడు మరో డిమాండ్‌ బయటికొచ్చింది. తన సోదరుడు వినోద్‌కు చెన్నూరు టికెట్ ఇవ్వాలని మాజీ ఎంపీ వివేక్‌ పట్టుబడుతున్నారు. ఇలా సీనియర్‌ నేతలంతా తమ బంధువులకు, అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నంలో పడ్డారు. మరి గులాబీ బాస్‌ మదిలో ఏముందో ఎవరికి టికెట్లు కేటాయిస్తారో చూడాలి.

English Title
KCR not announced 14 Constituency Seats

MORE FROM AUTHOR

RELATED ARTICLES