మన టెకీలంటే అంత భయమెందుకు?

x
Highlights

విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న లక్షలాది భారతీయుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రపంచ దేశాలు ఒక్కొక్కటే భారతీయ వృత్తి నిపుణులను తమ దేశంలోకి ప్రవేశించనీయకుండా...

విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న లక్షలాది భారతీయుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రపంచ దేశాలు ఒక్కొక్కటే భారతీయ వృత్తి నిపుణులను తమ దేశంలోకి ప్రవేశించనీయకుండా కఠినమైన చట్టాలు చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలకు భారతీయ నిపుణులంటే ఎందుకు కడుపు మంట?

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ప్రపంచీకరణ స్ఫూర్తికి గండి కొడుతూ ఆత్మరక్షణ ధోరణిలో పడ్డాయి. భారతీయ వృత్తినిపుణులు తమ దేశంలో ప్రవేశించకుండా అమెరికా, ఇతర ప్రపంచ దేశాలు తలుపులు మూసేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ నిపుణుల రాకని అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే వృత్తినిపుణులకు ఇచ్చే హెచ్‌1-బీ వీసాల ప్రక్రియను అమెరికా కఠినతరం చేసింది. మార్చి ప్రారంభంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ హెచ్1బీ వీసా ప్రీమియమ్ ప్రాసెసింగ్‌ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా జారీని కఠినతరం చేయనున్నట్టు తెలిపింది.

వృత్తినిపుణులకిచ్చే హెచ్1బీ వీసాల కారణంగనే భారతదేశ ఐటీ రంగం రెండు దశాబ్దాలుగా దూసుకుపోతోంది. ఇప్పుడు భారత్‌ నుంచి వచ్చే ఐటీ నిపుణులకు ఇచ్చే వీసాలను తగ్గించేందుకు అమెరికా అనేక పద్దతులు ప్రవేశపెట్టింది. మునుపెన్నడూ లేని విధంగా క్షుణ్ణమైన పరిశీలన, చిన్నచిన్న పొరపాట్లను కూడా అంగీకరించకపోవడం, వీసా కోసం దరఖాస్తు చేసినవారి సోషల్‌ మీడియా ఖాతాలను సమూలంగా పరిశీలించడం వంటి కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇది అత్యంత నైపుణ్యం ఉన్న భారతీయుల అవకాశాలను దెబ్బ తీస్తోంది. భవిష్యత్తులో ఈ పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు దాదాపుగా లేనట్టేనంటున్నారు నిపుణులు.

ఇండియన్ టెకీల ప్రవేశాన్ని అమెరికా ఒక్కటే అడ్డుకోవడం లేదు. యూకే కూడా తన ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేసింది. 2016, నవంబర్‌లో ప్రకటించిన కొత్త వీసా నిబంధనల ప్రకారం టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్ కింద దరఖాస్తు చేసుకొన్నవారికి అధిక వేతనం ఉండాలనే మెలిక పెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన వీసా నిబంధనలకు నిరసనగా భారత్ నుంచి వచ్చి ఇంగ్లాండ్‌లో ఉద్యోగాలు చేస్తున్న వైద్యులు, ఇంజినీర్లు, ఐటీ నిపుణులు ఆందోళన నిర్వహించారు. గతంలో ఇంగ్లాండ్‌లో ఉన్నత విద్యభ్యాసం చేసేందుకు వేల మంది భారతీయ విద్యార్థులు వెళ్లేవారు. అయితే బ్రెగ్జిట్‌, యూకే సంరక్షణ విధానాలతో అనేకమంది ఇంగ్లాండ్‌కు వెళ్లడం మానేశారు. 2017 డిసెంబర్ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో దాదాపు 44 శాతం భారతీయ విద్యార్థులు యూకేకు వెళ్లకుండా ఇతర దేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది.

అమెరికా, యూకేల తరువాత భారతీయ విద్యార్థులను ఎక్కువగా ఆకర్షించేది ఆస్ట్రేలియా. వీసాల జారీలో అనేకమైన నిబంధనలు తీసుకురావడంతో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది. ముఖ్యంగా భారతీయులను ఆకర్షించే సబ్‌క్లాస్ 457 వీసా కేటగిరీ స్థానంలో తాత్కాలిక నిపుణుల కొరత వీసాను గత మార్చిలో ప్రవేశపెట్టింది. పాత వీసాపై 90 వేల మందికి పైగా విదేశీయులు ఉండగా వారిలో 22% భారతీయులే. న్యూజిలాండ్‌, సింగపూర్‌ కూడా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టడంతో ఆ దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.

ఒకానొక సమయంలో విదేశాల్లో చదువుకోవడం సమాజంలో గౌరవంగా భావించేవారు. కానీ మధ్యతరగతి వర్గంలో పెరుగుదల కారణంగా అది సాధారణ విషయంగా మారింది. తమ పిల్లలు విదేశాల్లో చదవాలని కోరుకొనే తల్లిదండ్రుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2016లో 47% ఉండగా 2017లో ఇది 62%కి పెరిగినట్టు ఓ నివేదిక చెబుతోంది. అయితే ప్రపంచదేశాలు భారతీయుల ప్రవేశాన్ని అడ్డుకుంటుండటంతో వారి అవకాశాలు సన్నగిల్లబోతున్నాయి.

ప్రపంచ దేశాలు భారతీయుల ప్రవేశాన్ని అడ్డుకోవడానికి స్థానిక ఆర్థిక ఒత్తిళ్లు, నిరుద్యోగిత, సాంస్క ృతిక అంశాలుగా చెబుతున్నారు. అయితే అసలు సంగతేంటంటే భారతీయ నిపుణులు తక్కువ జీతానికి అప్పగించిన ఏ పనైనా చిత్తశుద్ధితో కష్టపడి విజయవంతంగా పూర్తి చేస్తారనే పేరు సంపాదించారు. దీంతో స్థానికులకు అవకాశాలు రావడం కష్టమైంది. భారతీయుల రాకతో తమ ఉద్యోగాలు దక్కవని ఆయా దేశాల్లోని స్థానికుల ఆందోళనలు పెరిగాయి.

దాదాపు శతాబ్దం క్రితం భారత్‌ వలసవాద పాలనలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్‌లో ఏర్పడిన పారిశ్రామిక విప్లవంతో అక్కడి నుంచి దిగుమతైన పారిశ్రామిక ఉత్పత్తులు భారత్‌ను ముంచెత్తాయి. ఫలితంగా దేశంలో హస్త కళలు, కుటీర పరిశ్రమలు దెబ్బతినడంతో గ్రామీణరంగం నష్టపోయింది. అయితే ఆ సమయంలో వలసవాద పాలనలో వారికి ఎటువంటి అడ్డంకులు ఏర్పడలేదన్నది చరిత్ర. ఇప్పుడు ఇండియన్ టెక్ కంపెనీలు మాంచెస్టర్, లాంకషైర్‌లోని కొత్త టెక్స్‌టైల్ మిల్లులుగా మారాయి. అమెరికాలోని ఐటీ రంగం భారతీయ సంస్థలు అందించే నాణ్యత, చౌక ఉత్పత్తులతో పోటీ పడలేక పోతున్నాయి. దీంతో అక్కడి సంస్థలను, ఉపాధి రంగాన్ని కాపాడుకొనేందుకు అమెరికా, ఇతర దేశాలు రక్షణ విధానాలు అవలంబిస్తున్నాయి.

వీసా సమస్యలను ఎదుర్కొనేందుకు భారతీయ ఐటీ కంపెనీలు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాయి. భారతీయ ఐటీ ఉత్పత్తుల్లో 60% దిగుమతి చేసుకొంటున్న అమెరికాలోనే ఐటీ కేంద్రాలను స్థాపించాలని నిర్ణయించాయి. ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ సంస్థలు వీలైనంత మంది అమెరికన్‌ యువతను ఉద్యోగాల్లో తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories