తెలంగాణ ఎన్నికల సంఘం ఊహించని షాక్

Submitted by arun on Thu, 06/14/2018 - 13:29

పంచాయతీ ఎన్నికల ముందుకు...రాజకీయ నేతలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల్లో వేలం ద్వారా ఎన్నికయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ నూతన పంచాయతీ రాజ్‌ చట్టంలోని అంశాల ఆధారంగా...రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను వెల్లడించింది.

పంచాయతీ ఎన్నికల్లో వేలం ద్వారా ఎన్నికయ్యే సర్పంచ్‌లకు...తెలంగాణ ఎన్నికల సంఘం ఊహించని షాకిచ్చింది. వేలం ద్వారా ఎన్నికయ్యే వారు పదవులను కోల్పోవడం పాటు ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆరేళ్ల పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించనుంది. తెలంగాణ నూతన పంచాయతీ రాజ్‌చట్టంలోని అంశాల ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను తెలిపింది.

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఎక్కువగా జరుగుతాయ్. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం నగదు పురష్కారాలను అందజేస్తూ వస్తోంది. అయితే ఏకగ్రీవాలన్ని నిజమైనవి కాదని...కొన్ని చోట్ల వేలం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో పంచాయతీ రాజ్‌ నూతన చట్టంలో వేలం పాటలకు కొత్త నిర్వచనం చెప్పింది. వేలం పాటలకు బాధ్యులైన వారికి ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని ప్రభుత్వం పంచాయతీరాజ్‌ నూతన చట్టంలో పొందుపర్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా కొన్ని నిబంధనలను వెలువరించింది. అభ్యర్థులను ఎత్తుకుపోవటం, వారిపై దౌర్జన్యం చేయటం, నిర్బంధించడం, ఓటర్లకు నోట్లు ఎరవేయటం వంటి చర్యలకు ఇకపై ఒక సంవత్సరం జైలు, జరిమానా విధించవచ్చని ఈసీ వెల్లడించింది.

పదవులకు వేలం నిర్వహించారన్న సమాచారం అందితే...జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఏకగ్రీవ ఎన్నికను రిటర్నింగ్ అధికారి ప్రకటించకూడదు. ఏకగ్రీవమైన వాటిపై కలెక్టర్‌ లేదా జిల్లా రిటర్నింగ్ అధికారి విచారణ జరిపి...చర్యల కోసం నివేదికలు పంపాలని తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్టుగా తేలితే వారి ఎన్నికను పంచాయతీరాజ్‌ ట్రైబ్యునల్‌ విచారించి రద్దు చేయవచ్చు.

English Title
EC Shocks Political Leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES