తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

x
Highlights

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్. నిన్నటి నుంచే ఎన్నిక మోడల్ కోడ్ కిందికి వస్తుందన్నారు....

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్. నిన్నటి నుంచే ఎన్నిక మోడల్ కోడ్ కిందికి వస్తుందన్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వాలున్నచోట్ల ఎలాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టకూడదని చెప్పారు. ఇప్పటివరకూ 15లక్షల45వేల 520 ఓట్ల అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 15రోజుల్లో 13లక్షల 15వేల 234 కొత్త అభ్యంతరాలు వచ్చినట్టు తెలిపారు. బతుకమ్మ చీరలు, రైతు బంధు వంటివి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు రజత్‌కుమార్.

తెలంగాణలో గురువారం నుంచి మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. అసెంబ్లీ రద్దైనప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండటంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా కొత్త పథకాలు, నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అమలవుతున్న పథకాలను మాత్రం కొనసాగించొచ్చని ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ చెప్పారు. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బతుకమ్మ చీరలు, రైతు బంధు లాంటి పథకాల గురించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామన్నారు.

ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తి కాగా, 2లక్షల 50 మంది ఓటర్ల వెరిఫికేషన్ జరుగుతోందన్నారు రజత్‌కుమార్. డీలిమిటేషన్‌కి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం భద్రాచలం జిల్లాలో కొన్ని మండలాలు ఏపీలోకి వెళ్లాయని, 2015లో ఇక్కడి నుంచి విడిపోయిన మండలాలను ఏపీలో కలపాలని నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. 2014లో కొన్ని చోట్ల జనాభా కంటే ఓటర్ల సంఖ్య అధికంగా ఉందని, 2015లో 24 లక్షల బోగస్ ఓట్లు గుర్తించి తొలగించామని చెప్పారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి రావాల్సిన పరికరాల గురించి అదనపు ఎన్నికల అధికారి బుద్ధప్రకాశ్ ఎం.జ్యోతి వివరించారు.

మొత్తానికి 2018 ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు షెడ్యూల్‌ను ప్రకటించామని, ఇంకా తేదీలు ప్రకటించాల్సి ఉందని చెప్పారు. అప్పుడే తేదీలు ప్రకటించి ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories