గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి

Submitted by chandram on Mon, 11/12/2018 - 18:02

ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం రణక్షేత్రంలా మారింది. ప్రతిపక్ష పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడంతో సీట్ల సర్దుబాట్లు, చర్చలు జరుగుతున్న సమయంలోనే పార్టీ ఆఫీస్‌ దగ్గర మాత్రం సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ను తలపిస్తోంది. నినాదాలు, గొడవలతో దద్దరిల్లుతోంది. దీంతో వరుసగా ఐదో రోజు కూడా గాంధీభవన్‌కు తాళాలు వేయాల్సి వచ్చింది. గాంధీభవన్‌ దద్దరిల్లుతోంది. ఆశావహుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. టిక్కెట్ల కోసం జరుగుతున్న నిరసనలతో హోరెత్తుతోంది. గత ఐదు రోజుల నుంచి గాంధీభవన్‌ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. కూటమి పొత్తులతో తమ సీటు ఎక్కడ గల్లంతవుతుందో అని ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అంతేకాకుండా తమకే టిక్కెట్‌ కెటాయించాలంటూ ఆశావహులు గాంధీభవన్‌కు చేరుకుని తమ నిరసనలు తెలుపుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికిస్తున్నారు. 

కూటమి పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గం ఏ పార్టీకి వెళ్తుందో తెలియని పరిస్థితుల్లో లోకల్‌ లీడర్ల గుండె గుభేల్‌ మంటోంది. ఇన్నాళ్లూ పార్టీని, తమ పరపతిని కాపాడుకుంటూ వచ్చిన ఆయా నాయకులు ఎక్కడ తమకు టిక్కెట్‌ రాదో అనే ఉత్కంఠలో ఆందోళనకు సిద్దమవుతున్నారు. మల్కాజ్‌గిరి స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించొద్దని, టిక్కెట్‌ను నందికంటి శ్రీధర్‌కే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆయన మద్దతుదారులు చేస్తున్న రిలే దీక్షలు కొనసాగతుండగా ఖానాపూర్‌ టిక్కెట్‌ విషయమై జరుగుతున్న దీక్షలతో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వారికి అక్కడే వైద్య సహాయం అందించాల్సి వచ్చింది. పటాన్‌చెరు టికెట్‌ను వడ్డెరల సంఘం అధ్యక్షుడు రాములుకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆయన అనుచరులు నిరసన చేపట్టారు. వేములవాడ టికెట్‌ను ఏనుగు మనోహర్‌రెడ్డికే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. 

మరోవైపు మంగళవారం అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉండటంతో గాంధీభవన్ దగ్గర సెక్యూరిటీ పెంచారు. గాంధీభవన్ లోపలకు వచ్చే రెండు గేట్లను ముందు జాగ్రత్తగా మూసివేశారు. మీడియా, గాంధీభవన్ సిబ్బందిని మాత్రమే లోపలకు అనుమతి ఇస్తున్నారు. నిరసనలు ముందే ఊహించిన టీ పీసీసీ గాంధీభవన్‌ దగ్గర ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేసింది. బౌన్సర్లను కూడా రంగంలోకి దింపింది. 

English Title
Congress Leaders Protest Continues at Gandhi Bhavan

MORE FROM AUTHOR

RELATED ARTICLES