జయశంకర్ జిల్లా వాసులను వణికిస్తున్న కాళేశ్వరం పనులు

x
Highlights

నిత్యం బాంబుల మోత ఎప్పుడు ఏ బండరాయి వచ్చిపడుతుందోనన్న భయం. అక్కడున్న ఇంటి పైకప్పులు కూలిపోతున్నాయి. గోడలు బీటలు వారుతున్నాయి. ఇంటి నుంచి జనం భయటకు...

నిత్యం బాంబుల మోత ఎప్పుడు ఏ బండరాయి వచ్చిపడుతుందోనన్న భయం. అక్కడున్న ఇంటి పైకప్పులు కూలిపోతున్నాయి. గోడలు బీటలు వారుతున్నాయి. ఇంటి నుంచి జనం భయటకు వెళ్లలేని పరిస్థితి. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు అక్కడి ప్రజలు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న పనులు అక్కడి జనాన్ని వణికిస్తున్నాయి. మహదేవపూర్ మండలం అన్నారం గ్రామ శివారులోని దుబ్బపల్లి పక్కనుంచి కాల్వ పనులు సాగుతుండటంతో పెద్ద పెద్ద యంత్రాలు, బాంబుల సాయంతో బండరాయిని పగలగొడుతున్నారు. బండరాళ్లు వచ్చి ఇళ్లపై పడుతుండటంతో ధ్వంసమవుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో సుమారు 60 కుటుంబాలు నివాసముంటున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజ్‌కి నీటిని తరలించేందుకు 12కిలోమీటర్ల వరకూ కాలువను నిర్మిస్తున్నారు. ఈ కాలువ అన్నారం, దుబ్బపల్లి గ్రామాల గుండా వెళ్తుంది. అయితే, కాల్వలో వచ్చిన బండరాళ్లను తొలగించేందుకు పేలుడు పదార్ధాలను ఉపయోగిస్తున్నారు. ఆ బాంబుల మోతకు జనం ఇళ్లల్లోనే ఉంటున్నా బండరాళ్లు వచ్చి ఇళ్లపై పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

పేలుళ్ల శబ్దాలు తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుండటంతో గ్రామస్తులంతా ఏకమై ఆ పనులు నిలిపివేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ప్రాజెక్టు పనుల కారణంగా గ్రామంలో ఉండలేకపోతున్నామంటున్నారు. కాలువ కోసం తమ పొలాలను కూడా కోల్పోయామని, ఇప్పుడు గ్రామానికే ముప్పు వాటిల్లుతుందని స్థానికులు చెబుతున్నారు. దుబ్బపల్లి, అన్నారం మధ్య కాలువ నిర్మాణంతో తమకు రాకపోకలు ఇబ్బందిగా మారాయంటున్నారు స్థానికులు. ఆ పనులు జరగాలంటే తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు.

Show Full Article
Print Article
Next Story
More Stories