కేజ్రీవాల్‌కు గట్టి దెబ్బ.. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

కేజ్రీవాల్‌కు గట్టి దెబ్బ.. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
x
Highlights

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. లాభదాయక పదవుల వ్యవహారంలో 20మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని ఈసీ సిఫార్సు చేసింది....

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. లాభదాయక పదవుల వ్యవహారంలో 20మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని ఈసీ సిఫార్సు చేసింది. 20 మందిని అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి సిఫారసు చేసింది. 20 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శుల పేరుతో లాభదాయక పదవులను నిర్వహిస్తున్నట్లు నిర్థారించిన ఈసీ ఈ మేరకు... రాష్ట్రపతి కోవింద్ కు సిఫార్సు చేసింది. ఈసీ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన వెంటనే ఢిల్లీలో 20 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల నగారా మోగనుంది.

ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల వ్యవహారం 15 నెలలుగా కొనసాగుతోంది. గతేడాది మార్చి 13న 21 మంది ఎమ్మెల్యేల్ని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది కేజ్రీవాల్ సర్కార్. వీరికి ఎలాంటి అదనపు చెల్లింపులు ఉండబోవని మొదట కేజ్రీవాల్ చెప్పినా..తర్వాత వారికి కారు, ఆఫీసు, ఇతర వసతులు కల్పించారు. క్యాబినెట్ కార్యదర్శులకు కేబినెట్ హోదా ఇవ్వడంపై కొన్న స్వచ్ఛంద సంస్థలు కోర్టుకెళ్లాయి. అలాగే రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించి 21 మంది ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్ని చేపట్టారనీ… వారిని అనర్హులుగా గుర్తించాలని రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి. దీంతో అలర్టైయిన కేజ్రీవాల్ ప్రభుత్వం అనర్హత వేటు నుంచి తప్పించడానికి ఓ బిల్లును రూపొందించి కేంద్రానికి పంపింది. రాష్ట్రపతి ఈ అంశాన్ని ఎన్నికల సంఘానికి నివేదించారు. అసెంబ్లీ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయరాదో తెలపాల్సిందిగా ఎమ్మెల్యేలకు ఈసీ షోకాజ్ నోటీసులిచ్చింది. ఈ పదవులు ఎలాంటి అధికారం, పారితోషికం లేనివని వారంతా ఎన్నికల సంఘానికి తెలిపారు. బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ రిజెక్ట్ చేశారు.

ఈసీ నిర్ణయంపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా ఉన్నవారికి ఎలాంటి లాభదాయక సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. ఒకరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు...వారి వాదన వినాల్సి ఉంటుందనీ, కానీ ఎన్నికల సంఘం తమ ఎమ్మెల్యేల వాదన వినలేదని ఆరోపించారు. గుజరాత్ కు చెందిన వ్యక్తి ఏకే. జ్యోతి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా ఉండడం వల్లే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈసీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేస్తామన్నారు...ఆప్ నేతలు. అటు కేజ్రీవాల్ రాజీనామాకు బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. ప్రభుత్వంలో కొనసాగే నైతికత కేజ్రీవాల్ కోల్పోయారని అంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories