రోడ్డు ప్రమాదంలో చిన్నారి భూమిక మృతి

Submitted by arun on Wed, 12/20/2017 - 13:00
road accident

మరో ఐదు నిమిషాలయితే అమ్మకు బై చెప్పి స్కూల్‌లోకి అడుగుపెట్టేంది. క్లాస్‌ రూంలో సందడి చేసేంది. స్కూల్‌‌లో హాయిగా ఫ్రెండ్స్‌తో ఆడుకునేది. స్నేహితులతో కలిసి క్లాస్‌ రూంలో కూర్చోని టీచర్‌ చెప్పిన పాఠాలు వినేది. అందుకేనేమో పసిపాపపై దేవుడికి కన్నుకుట్టింది. చిన్నారి చేసే సందడిని దేవుడు సహించలేకపోయాడు. చిన్నచూపు చూసిన భగవంతుడు లారీ రూపంలో చిన్నారిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లాడు. మృత్యువు లారీ రూపంలో వస్తుందని చిన్నారి ఊహించలేదు. 

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం నగరవాసులను కలచి వేస్తోంది. చిన్నారి భూమికారెడ్డి మృతి వారి కుటుంబంతోపాటు స్కూల్‌లోనూ విషాదాన్ని నింపింది. ఉప్పల్‌ సౌత్‌ స్వరూప్‌నగర్‌‌కు చెందిన కులదీప్‌కుమార్‌రెడ్డి, శోభలకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు నాచారంలోని జాన్సన్ గ్రామర్‌ స్కూల్‌లో చదువుకుంటున్నారు. రితిక 8వ తరగతి, భూమిక రెండో తరగతి చదువుతున్నారు. 

ప్రతి రోజులాగే  స్కూల్ టైం కావడంతో తల్లి శోభ హోండా యాక్టివ్‌పై రితిక, భూమికలను తీసుకొని ఇంటి నుంచి బయలుదేరింది. చిల్కానగర్‌ రోడ్డు మీదుగా జాన్సన్‌ స్కూల్‌కు వెళ్తున్నారు తల్లీకూతుళ్లు. వారి బైక్‌ ఆదర్శనగర్‌‌లోని పెట్రోల్‌ బంక్‌ దగ్గరకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీ కొంది. తల్లి శోభతో పాటు పెద్ద కూతురు రితిక ఒక వైపు పడిపోయారు. మరోవైపు పడిపోయిన చిన్నారి భూమికపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. భూమికను ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపే మృతి చెందింది. 

తల్లి శోభ చూస్తుండగానే చిన్నకూతురు భూమిక చనిపోయింది. మృత్యువు రూపంలో వచ్చిన లారీ తల్లిబిడ్డ, అక్కాచెల్లెళ్ల బంధాన్ని తుంచేసింది. గాయాల పాలయిన భూమిక తల్లి శోభ, అక్క రితికలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నకూతురు భూమిక ఇక లేదన్న వార్తను తల్లిదండ్రులు శోభ, కులదీప్‌కుమార్‌రెడ్డిలు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నారి భూమికను గుర్తు చేసుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. 

English Title
8-year-old girl dies on the spot in road accident

MORE FROM AUTHOR

RELATED ARTICLES