కాక‌పుట్టిస్తున్న చంద్ర‌బాబుపై ల‌క్ష‌కోట్ల అవినీతి ఆరోప‌ణ

కాక‌పుట్టిస్తున్న చంద్ర‌బాబుపై ల‌క్ష‌కోట్ల అవినీతి ఆరోప‌ణ
x
Highlights

ఆంధ్ర ప్రదేశ్‌లోనూ, ఢిల్లీలోనూ ప్రత్యేక హోదా అంశం ఒకవైపు సెగలు రేపుతుంటే మరోవైపు సీఎం చంద్రబాబు , వైసీపీ ఎంపీ విజయసాయి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కాక...

ఆంధ్ర ప్రదేశ్‌లోనూ, ఢిల్లీలోనూ ప్రత్యేక హోదా అంశం ఒకవైపు సెగలు రేపుతుంటే మరోవైపు సీఎం చంద్రబాబు , వైసీపీ ఎంపీ విజయసాయి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కాక పుట్టిస్తోంది. చంద్రబాబు లక్ష కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని విజయసాయి ఆరోపణలు చేయడం సీబీఐ దర్యాప్తు కోరడం ఇప్పటికే కలకలం రేపితే తాజాగా సీఎంపై పార్లమెంటులో ప్రివిలైజ్ మోషన్ ఇచ్చే దిశగా వైసీపీ అడుగులు వేయడం మరో ట్విస్ట్.

చంద్రబాబుపై వైసీపీ ముప్పేట దాడి.. ఎన్నికల హామీలు మరిచారని ఓవైపు..హోదాపై యూటర్న్ తీసుకున్నారని మరోవైపు..భారీగా అవినీతికి పాల్పడ్డారని ఇంకోవైపు..

టీడీపీ, బీజేపీ బంధం తెగాక వైసీపీ దూకుడు మరింత పెంచింది. ఇంతకాలం టీడీపీ ప్రభుత్వంపై అనేక అంశాల్లో విమర్శలు గుప్పించిన వైసీపీ ఇప్పుడు ఏకంగా చంద్రబాబునే టార్గెట్ చేస్తోంది. గతంలో జగన్‌పై టీడీపీ నేతలు ఎలా లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేశారో ఇప్పుడు వైపీపీ కూడా అదే పల్లవి అందుకుంటోంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వ పథకాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ విమర్శలు సంధిస్తోంది. లక్ష కోట్లకుపైగా అవినీతి సొమ్మును విదేశాలకు తరలించారన్న వైసీపీ ఎంపీ విజయసాయి ఆయా కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయడం విశేషం.

విజయసాయి ఆరోపణలకు చంద్రబాబు కూడా దీటుగానే జవాబిస్తున్నారు. అవినీతి కేసుల్లో నిందితుడైన విజయసాయికి ప్రధాని కార్యాలయంలో ఏం పనని ప్రశ్నించారు. ఓ నేరస్తుడిని పీఎంవోలోకి ఎలా అనుమతిస్తున్నారని అసెంబ్లీ వేదికగా నిలదీశారు. చంద్రబాబు విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. పీఎంవో గురించి అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామనడమే ఇందుకు నిదర్శనం. ప్రజా సమస్యలతో పాటు చంద్రబాబు అవినీతిని బయటపెట్టడానికి మోడీని కలిస్తే తప్పేంటని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

మొత్తానికి తాజా రాజకీయ పరిణామాల్ని తనకు అనుకూలంగా మలచుకుని టీడీపీని ఇరుకున పెట్టడానికి వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లే కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories