జ‌గ‌న్ కేసు మోడీకి చుట్టుకుంటుందా?

జ‌గ‌న్ కేసు మోడీకి చుట్టుకుంటుందా?
x
Highlights

అక్రమాస్తుల కేసు జగన్ మెడకు చుట్టుకుంటుందా? మోడీ మెడకు బిగుసుకుంటుందా? జగన్ కంపెనీల్లోకి విదేశీ కంపెనీల నుంచి భారీగా నిధులు వచ్చాయన్న ఆరోపణలతో పాటు...

అక్రమాస్తుల కేసు జగన్ మెడకు చుట్టుకుంటుందా? మోడీ మెడకు బిగుసుకుంటుందా? జగన్ కంపెనీల్లోకి విదేశీ కంపెనీల నుంచి భారీగా నిధులు వచ్చాయన్న ఆరోపణలతో పాటు ఇందూ టెక్‌ బాగోతంపై అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధానికి నోటీసులు పంపించింది. అసలేంటి? మారిషస్‌ సర్కార్‌ ఏకంగా ప్రధానికే నోటీసులు ఎందుకు ఇచ్చింది? జగన్‌ కేసుకు, మోడీకి లింకేంటి? జగన్‌, మోడీ మధ్యలో మారిషస్‌ అసలు కథేంటి?

అంతర్జాతీయ కోర్టుకెక్కిన మారిషస్‌ సర్కారు మోడీకి లీగల్‌ నోటీసులు పంపించింది. మారిషస్‌కు చెందిన తమ కంపెనీ మోసపోయిందనీ, మధ్యవర్తిత్వం నెరపి తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించడంతో భారత్‌ పరువు ప్రతిష్ఠల అంశం చర్చనీయాంశమైంది.

ఏకంగా దేశ ప్రధానినే అంతర్జాతీయ కోర్టుకు ఈడ్చటంలాంటి పరిణామాలపై రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇందూ టెక్‌ జోన్‌ పెట్టుబడుల వ్యవహారంలో భాగస్వామ్య సంస్థ కారిస్సా ఇన్వెస్ట్ మెంట్స్‌ ఎల్‌ఎల్‌సీని మోసం చేశారంటూ మారిషస్‌ ప్రభుత్వం భారతదేశ ప్రధాన మంత్రికి లీగల్‌ నోటీసు పంపింది. ఆయనతోపాటు కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులతోపాటు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కూడా నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసుల్లో జగన్‌పై దాఖలైన చార్జిషీట్‌ను ప్రస్తావించింది. తమ దేశానికి చెందిన కంపెనీకి నష్టం జరిగిందంటూ మారిషస్‌ ప్రభుత్వం భారత్‌పై నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కారిస్సా ఎల్‌ఎల్‌సీ 350 కోట్లకుపైగా నష్ట పరిహారం కోరుతోందంటూ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆర్బిట్రేటర్‌ నియామకానికి భారత ప్రభుత్వానికి నోటీసు పంపింది.

అసలేం జరిగింది? వైఎస్‌ హయాంలో జరిగిన భూపందేరం తెలుగు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటి మారిషస్‌కు ఎలా వెళ్లింది? ఆదాయానికి మించిన ఆస్తుల జగన్‌ కేసుకు మారిషస్‌కు లింకేంటి? దీనికి పీఎం ఎలా బాధ్యడవుతారు?

2004లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడప్పుడే హైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌ ఓ రేంజ్‌కి చేరుకుంది. అదే సమయంలో శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో ఉన్న మామిడిపల్లిలో ఉన్న భూమికి విపరీతమైన డిమాండ్‌ ఉండేది. ఎకరా కోటి రూపాయలు పలుకుతున్న ఈ భూములను నాటి వైఎస్‌ ప్రభుత్వం ఎకరా 20 లక్షల రూపాయల చొప్పున 250 ఎకరాలను ఇందూ టెక్‌ జోన్‌కు కట్టబెట్టింది.

ఇందులో 150 ఎకరాలు ఐటీ సెజ్, మరో 100 ఎకరాల్లో హౌజింగ్‌, ఇతర మౌలిక వసతులకు కేటాయించారు. ఇందూ సంస్థ అక్కడ స్పెషల్‌ ఐటీ సెజ్‌ ఏర్పాటు చేసింది. మారిషస్‌ దేశానికి చెందిన కారిస్సా ఎల్‌ఎల్‌సీకి ఇందులో 49 శాతం వాటా ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద ఈ సంస్థ 100 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేసింది. ఒప్పందం ప్రకారం ప్రమోటర్లు దీనిని 2012లోపు డెవలప్‌ చేయలేదు.

అయితే ఒప్పందం ప్రకారం, సెజ్‌ను ఇందూ టెక్‌ డెవలప్‌ చేయకపోవడంతో 2015లో తెలంగాణ ప్రభుత్వం భూముల కేటాయింపు ఒప్పందాలను రద్దు చేసింది. భూములను మాత్రం టీఎస్‌ఐఐసీ స్వాధీనం చేసుకోలేకపోయింది. వైఎస్‌ జగన్‌పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన అవినీతి కేసుల్లో ఈ భూమి వ్యవహారం కూడా ఉంది. అత్యంత తక్కువ ధరకు ఏపీఐఐసీ ఈ భూములను కట్టబెట్టడంపై అప్పట్లోనే కాగ్‌ తప్పుబట్టింది. అదే సమయంలో భూముల కేటాయింపును టీఎస్ఐఐసీ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఇందూ టెక్‌ జోన్‌ గత ఏడాది హైకోర్టును ఆశ్రయించింది.

అక్కడే అసలు కథ మొదలైంది. తాము పెట్టుబడులు పెట్టిన సెజ్‌ న్యాయ వివాదాల్లో చిక్కుకోవడంతో తాను మోసపోయానని కారిస్సా ఎల్‌ఎల్‌సీ భావించింది. భారత్‌-మారిష్‌స మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం భారత్‌లో మారిషస్‌ కంపెనీలు పెట్టే పెట్టుబడులకు రక్షణ కల్పించాలి. పెట్టుబడులు పెట్టి దాదాపుగా పదేళ్లు అవుతున్నా అతీగతీ లేదు. దాంతో కారిస్సా ఎల్‌ఎల్‌సీ మారిషస్‌ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని కోరింది.

దీంతో మారిషస్‌ ప్రభుత్వం భారత ప్రధానికి లీగల్‌ నోటీసులు పంపింది. మారిషస్‌ కంపెనీలు భారత్‌లో పెట్టే పెట్టుబడులకు రక్షణ కల్పించేందుకు ఇరు దేశాల మధ్య ఇన్వెస్ట్ మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ అగ్రిమెంట్‌ ఉంది. ఇందులో భాగంగా మారిషస్‌ కంపెనీలు నష్టపోయినా, మోసపోయినా ఆ దేశ ప్రభుత్వం వాటి తరఫున బాధ్యత తీసుకుంటుంది. ఆ క్రమంలోనే మారిషస్‌ ప్రభుత్వం భారత సర్కారుకు ప్రాతినిధ్యంవహిస్తున్న ప్రధానికి నోటీసులు జారీ చేసింది.

కారిస్సా సంస్థ మోసపోయిందని, అది 50 మిలియన్‌ డాలర్ల పరిహారం కోరుతోందని, మధ్యవర్తిత్వ పరిష్కారం చేయాలని మారిషస్‌ ప్రభుత్వం అందులో కోరింది. నోటీస్‌ రావడంతో అప్రమత్తమైన ప్రధాని కార్యాలయం మారిషస్‌ ప్రభుత్వం కోరిన విధంగా మధ్యవర్తి నియామకానికి సంబంధిత మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ఏర్పాటు చేసిందని ప్రసార సాధనాల్లో వార్తలు వచ్చాయి. ఏకంగా ప్రధానమంత్రికే నోటీస్‌ రావడంతో ఈ కేసు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories