పవన్‌‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జగన్‌...పవన్‌కి నలుగురు భార్యలు

x
Highlights

జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పవన్‌‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు....

జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పవన్‌‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. జగన్‌ అసెంబ్లీ నుంచి పారిపోయారన్న పవన్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో రియాక్టయిన వైసీపీ అధినేత కార్లు మార్చినంత ఈజీగా పెళ్లాలను మార్చేస్తారంటూ జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లకో ఐదేళ్లకో పెళ్లాలను మార్చేసే పవన్‌ గురించి మాట్లాడుకోవడం మన ఖర్మ అన్నారు. పవన్ కల్యాణ్‌‌లా మరొకరు ఇలా పెళ్లిళ్లు చేసుకొని ఉండుంటే... నిత్య పెళ్లికొడుకు అంటూ బొక్కలో వేసేవారన్నారు. ఇలాంటి వ్యక్తి నైతిక విలువలు నిజాయితీ గురించి మాట్లాడటం మనం వినాల్సి రావడం మన ఖర్మ అంటూ జగన్‌ ఎద్దేవా చేశారు.

నాలుగేళ్లకో ఐదేళ్లకో పెళ్లాల్ని మారుస్తాడు ఇలాంటి పని నేనో నువ్వో మరొకరో చేసుంటే ఏమంటారు? నిత్య పెళ్లికొడుకంటూ జైల్లో వేసేవారు కాదా అంటూ జగన్ ప్రశ్నించారు. ఇది బహు భార్యత్వం కాదా అన్నారు. ఇలాంటోళ్లు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు బయటికొచ్చి తానేదో సచ్చీలుడినంటూ మాట్లాడుతుంటే మనం వినాలా అన్నారు. మన ఖర్మకొద్దీ పవన్‌లాంటోళ్లు మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తోందన్నారు. నాలుగేళ్లపాటు టీడీపీ, బీజేపీతో కాపురం చేసి ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అంటూ జగన్‌ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కూడా టైమ్‌ వేస్ట్‌ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాలుగేళ్లు అన్యాయం చేసినా పవన్‌ ఏనాడూ నోరు విప్పలేదన్న జగన్‌ ఆరునెలలకో, ఏడాదికో ఒకసారి బయటికి వచ్చి ఒక ట్వీటో, ఒక ఇంటర్వ్యూ ఇచ్చి పోతాడంటూ ఎద్దేవా చేశారు. ఈ నాలుగేళ్లలో పవన్‌ చేసిందేమైనా ఉందంటే అది చంద్రబాబును కాపాడటానికి అప్పుడప్పుడూ బయటికి రావడమే అన్నారు. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాలు మాట్లాడితే దాన్ని గురించి మనం సమాధానం చెప్పాలా అంటూ ప్రశ్నించారు. అసలు పవన్‌‌కు నైతిక విలువలు ఎక్కడున్నాయి? ఇలాంటి వ్యక్తి మాట్లాడటం మనం చర్చించుకోవడం మన ఖర్మ అన్నారు.

చంద్రబాబు, మోడీ, పవన్‌ ముగ్గురూ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను ఖూనీ చేశారని జగన్‌ అన్నారు. ముగ్గురు కలిసి కాపురం చేసి ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని జగన్‌ మండిపడ్డారు. ఒకరేమో తాను తప్పు చేశానంటాడు. మరొకరేమో నేను తప్పు చేయలేదు మిగతా ఇద్దరు నన్ను మోసం చేశారంటాడు. ఇంకో ఆయనేమో ఆ ఇద్దరూ ఒప్పుకున్న తర్వాతే చంపేశాను అంటాడు. ఇలాంటి వాళ్లు నీతి నిజాయితీ గురించి మాట్లాడటం మన ఖర్మ అన్నారు. పవన్‌ అయితే తానేదో పతివ్రతను అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని జగన్ సెటైర్లు వేశారు.

జనసేనాని పవన్ కల్యాణ్‌పై జగన్మోహన్‌రెడ్డి ఈ స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ పవన్‌‌పై వ్యక్తిగత విమర్శలకు దిగని జగన్‌ ఈసారి మాత్రం ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. జగన్‌ అసెంబ్లీ నుంచి పారిపోయారన్న పవన్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో రియాక్టయ్యారు. కార్లు మార్చినంత ఈజీగా పెళ్లాలను మార్చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను జగన్ కావాలనే చేశారా? లేక నోరు జారారా? ఇక జగన్‌ వ్యాఖ్యలు వైసీపీకి మేలు చేస్తుందా? రివర్స్‌ అవుతుందా చూడాలి. ఓవరాల్‌గా ఇది ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

పవన్‌పై జగన్‌ వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రంగా ఖండించారు. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు అన్నారు. పవన్‌పై జగన్‌ నీచమైన భాష వాడారని, సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారంటూ బుద్దా వెంకన్న మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories