డిగ్రీ విద్యార్థి ఉసురు తీసిన సర్వే

Submitted by arun on Sat, 01/20/2018 - 12:01

నేరస్తుల వివరాలు సమగ్రంగా సేకరించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన సర్వే ఓ డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్యకు కారణమైంది. ఎప్పుడో ఎనిమిదో తరగతిలో బైక్ దొంగతనం కేసులో నిందితుడైన పాపానికి.. పోలీసులు వచ్చి ఆధార్ కార్డు, ఫోటో ఇతర వివరాలు తీసుకోవడాన్ని అవమానంగా భావించిన ప్రసాద్ అనే విద్యార్థి రైలు కిందపడి ప్రాణాలు తీసుకోవడం నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది.

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లికి చెందిన వేముల ప్రసాద్.. నల్గొండ రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో అతనిపై మోటార్ వైర్ దొంగతనం కేసు నమోదైంది. సకల నేరస్థుల సర్వేలో భాగంగా పోలీసులు గురువారం అతని ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకున్నారు. దీనిని అవమానంగా భావించిన ప్రసాద్..ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చేతికి అందివస్తున్న చెట్టంత కొడుకు బలవంతంగా ప్రాణాలు తీసుకోడానికి పోలీసులే కారణమంటున్నారు.

ముందస్తుగా కనీస సమాచారం ఇవ్వకుండా పోలీసులు.. సర్వే పేరుతో రాత్రి రావడం ప్రసాద్ జీర్ణించుకోలేకపోయాడని.. ఎంతగానో కలత చెందినట్టు అనిపించిందని అతని బాబాయ్ చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు తనకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలే అందుకు సాక్ష్యం అని చెప్పారు. నేరాల కట్టడి కోసం పోలీసులు చేపట్టిన సకల నేరస్ధుల సర్వే.. ఎంతో భవిష్యత్తున్న ఓ డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్యకు కారణమైంది. మరోవైపు దీనిపై పోలీసు శాఖ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
 

English Title
youngster suicide

MORE FROM AUTHOR

RELATED ARTICLES