మద్యం ప్రియులకు సూపర్ న్యూస్

Submitted by arun on Mon, 10/15/2018 - 10:17
Maharashtra

ఎన్ని అనర్థాలు జరుగుతున్నా ఎన్ని విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ప్రభుత్వాలెన్ని మారినా మద్యపానాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నాయి. ఖజానాను నింపే మద్యం మాలక్ష్మీని వదిలిపెట్టేందుకు సర్కారు ససేమీరా అంటోంది. అంతేకాదు అదే మద్యంపై వచ్చే రాబడిని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనల్ని అన్వేషిస్తున్నాయి. అందులో భాగంగానే ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలకు మహారాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

విపరీతమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే లిక్కర్‌ బిజినెస్‌ను మరింత పెంచేందుకు సరికొత్త ఐడియా వేసింది మహా సర్కార్‌. ఆన్‌లైన్‌లో లిక్కర్‌ సేల్స్‌ ఇంటికే మద్యం అనే థాట్‌ను అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతకాలంలో ఈ కామర్స్‌ విస్తృతి పెరగడంతో ప్రతీ వస్తువు నేరుగా ఇంటికే చేరుతోంది. రోజూ ఉపయోగపడే కూరగాయల నుంచి ఖరీదైన వస్తువుల వరకు ఏదైనా అడుగు కూడా బయటపెట్టకుండా ముంగిళ్లలోకి వస్తున్నాయి. దీంతో లిక్కర్‌ను కూడా ఆన్‌లైన్‌లో సప్లై చేస్తే రెండు విధాలా లాభాలున్నట్లు చెబుతున్నారు. 

రోజురోజుకు పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులతో పాటు విలువైన ప్రాణాలు పోతున్న సమయంలో నేరుగా ఇంటికే మద్యం వస్తే బయటకు వెళ్లడం తగ్గుతుందనే భావన వస్తుంది. ఇక రెండో విషయం ఆదాయం. ఇప్పటికే ఇబ్బడిముబ్బడి వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచుకునే లక్ష్యంగా మహారాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి చంద్రశేఖర్‌ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో లిక్కర్‌ అమ్మకాలకు పర్మీషన్‌ ఇస్తామని అందువల్ల ఆల్కాహాల్‌ పరిశ్రమల భవిష్యత్తే మారిపోతుందని వ్యాఖ్యానించారు. అలాగే లిక్కర్‌ ఆర్డర్‌ చేసేవారు తప్పకుండా ఆధార్‌ కార్డు సమర్పించాలని స్పష్టం చేశారు. దీంతో మద్య అక్రమ రవాణాను అరికట్టవచ్చని చెప్పుకొచ్చారు. 

అయితే మంత్రి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మద్యపాన నిషేదంపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అమ్మకాలను పెంచడమే లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గిన సదరు మంత్రిగారు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రస్తావనేదీ లేదని చల్లగా చెప్పుకొచ్చారు. 

English Title
You can soon order liquor online and get it home delivered in Maharashtra

MORE FROM AUTHOR

RELATED ARTICLES