యడ్యూరప్ప భవితవ్యం సుప్రీం ఏం తేల్చబోతోంది?

యడ్యూరప్ప భవితవ్యం సుప్రీం ఏం తేల్చబోతోంది?
x
Highlights

కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్ప భవితవ్యం కాసేపట్లో తేలబోతోంది. అసెంబ్లీలో మెజార్టీ మార్కు లేకుండానే గవర్నర్ యడ్యూరప్పను సీఎం చేయడంపై దాఖలైన పిటిషన్‌‌పై...

కర్ణాటక కొత్త సీఎం యడ్యూరప్ప భవితవ్యం కాసేపట్లో తేలబోతోంది. అసెంబ్లీలో మెజార్టీ మార్కు లేకుండానే గవర్నర్ యడ్యూరప్పను సీఎం చేయడంపై దాఖలైన పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వబోతోంది. కర్ణాటక బీజేపీ సర్కారు విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? బల నిరూపణకు యడ్యూరప్పకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును కోర్టు తగ్గిస్తుందా..? సుప్రీంకోర్టుకు యడ్యూరప్ప ఇచ్చే ఎమ్మెల్యేల జాబితాలో కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఉత్కంఠ రేపుతోంది.

రంజుగా మారిన కర్ణాటక రాజకీయం ఇవాళ మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీలో మెజార్టీ లేని బీజేపీ నేత యడ్యూరప్పను సీఎంగా ప్రమాణస్వీకారం చేయించడంపై కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. అలాగే కర్ణాటక గవర్నర్‌ తనకు సంక్రమించిన రాజ్యాంగాధికారాలను దుర్వినియోగపర్చారంటూ సీనియర్‌ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యక్తిగతంగా వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీం ధర్మాసనం ముందుకు రాబోతోంది. దీంతో అందరి చూపూ సర్వోన్నత న్యాయంస్థానం నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపైనే ఉంది.

నిజానికి యడ్యూరప్పను ప్రమాణ స్వీకారానికి గవర్నర్ వాజూభాయ్ అహ్వానించిన వెంటనే బుధవారం అర్ధరాత్రి కాంగ్రె‌స్-జేడీఎస్‌ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. కాంగ్రె‌స్-జేడీఎస్‌ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను విచారించడానికి అప్పటికప్పుడు జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు. అయితే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే విధించలేమన్న బెంచ్..ఈ కేసులో వెలువరించే తుది తీర్పుకు లోబడే ప్రమాణస్వీకారమైనా, ప్రభుత్వ ఏర్పాటైనా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే యడ్యూరప్ప 15, 16 తేదీల్లో గవర్నర్‌కిచ్చిన లేఖలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తుది తీర్పు శుక్రవారం ఇస్తామని ప్రకటించింది. దీంతో న్యాయస్థానం ఇవాళ ఏ నిర్ణయం వెలువరిస్తుందనేది సస్పెన్స్‌గామారింది.

కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందనే ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. కోర్టు తీర్పు యడ్యూరప్పలో టెన్షన్ పుట్టిస్తుండగా..కాంగ్రెస్‌ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కుమారస్వామికి తప్పకుండా వస్తోందని కోటి ఆశలు పెట్టుకుంది. అంతేకాదు..యడ్యూరప్పకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును తగ్గించాలని కాంగ్రెస్ వాదించబోతోంది. మరోవైపు కర్ణాటకలో గవర్నర్‌ కోటాలో ఓ ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా నియమించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను కూడా కాంగ్రెస్‌ అడ్డుకొంది. బల పరీక్ష ముగిసే దాకా ఎవరినీ నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమించవద్దని కోరుతూ నిన్న సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. సంఖ్యాబలం పెంచుకోడానికే బీజేపీ ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యే నియామక ప్రతిపాదన తెచ్చిందని, ఇది చట్టవిరుద్ధమని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ పిటిషన్ను కూడా కర్ణాటక కేసును విచారిస్తున్న ధర్మాసనానికే కేటాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories