బిట్ కాయిన్ వల్ల లాభమా..? నష్టమా

బిట్ కాయిన్ వల్ల లాభమా..? నష్టమా
x
Highlights

బిట్ కాయిన్ అనేది ఈ దేశానికి చెందిన కరెన్సీ కాదు. ఏ దేశ చట్టాలు, ప్రభుత్వాల హామీలు దానికి లేవు. ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి సెంట్రల్ బ్యాంకుల ద్వారా...

బిట్ కాయిన్ అనేది ఈ దేశానికి చెందిన కరెన్సీ కాదు. ఏ దేశ చట్టాలు, ప్రభుత్వాల హామీలు దానికి లేవు. ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి సెంట్రల్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పూచీగా ఉంటాయి. బిట్ కాయిన్ కు అలాంటి పూచీ యేమీ లేదు. బిట్ కాయిన్ వర్చువల్ కరెన్సీ మాత్రమే. అంటే ఇంటర్నెట్ లో ఉపయోగించే కరెన్సీ మాత్రమే. బిట్ కాయిన్‌ విలువ స్థిరంగా ఉండదు.

బిట్‌కాయిన్లను నియంత్రించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థేమీ లేదు. యూజర్ల బ్లాక్‌చెయినే దీని వ్యవస్థ. ప్రతి యూజరుకు ఆన్‌లైన్ కోడ్‌తో నిర్దిష్టమైన అడ్రెస్ ఉంటుంది. వారి లావాదేవీలన్నీ ఇలాంటి అడ్రెస్‌తోనే జరుగుతాయి. ఒక లావాదేవీ జరిగినపుడు... ఒక అడ్రస్ నుంచి బిట్‌కాయిన్లు మరో అడ్రస్‌కు బదిలీ అవుతాయి. కేవలం అడ్రస్ తప్ప... ఈ లావాదేవీ చేసినవారి వ్యక్తిగత వివరాలేవీ బయటకు రావు. అందుకే బిట్‌కాయిన్ల ద్వారా ఆన్‌లైన్లో పెద్ద ఎత్తున అక్రమాయుధాలు, మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

బిట్‌కాయిన్‌ లావాదేవీల్లో సెక్యూరిటీ అన్నిటికన్నా ప్రధానమైన ప్రశ్న. హ్యాకర్లు దాడిచేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో బిట్‌కాయిన్‌ ఎక్స్చేంజీలపై హ్యాకర్ల దాడులు జరిగాయి. లక్షల కొద్దీ బిట్‌కాయిన్లను దోచేశారు. సెక్యూరిటీ పరమైన ఇష్యూతో బిట్‌కాయిన్ అభిమానుల కలలు చెదిరిపోయాయి. బిట్‌కాయిన్ల విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఆన్‌లైన్ భద్రతే. ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఎన్ని బిట్‌కాయిన్లున్నాయో అప్‌డేట్ అవుతుంటుందని చెప్పే వ్యవస్థలో హ్యాకర్లను చొరబడకుండా ఉంటారా...ఎవరు నమ్ముతారు ఇలాంటి కరెన్సీని...? ఇలా వెయ్యి బిట్‌ కాయిన్ల ప్రశ్నలు దూసుకొస్తున్నాయి.

బిట్ కాయిన్ ను కొన్ని ప్రముఖ ఐ.టి కంపెనీలు కూడా వినియోగిస్తున్నాయి. ఈ కరెన్సీ విలువలో బబుల్ వృద్ధి చెందుతోందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే వాస్తవ మార్కెట్, విలువల కంటే ఎక్కువ ధర పలకడం. నెట్ వర్క్ లో అనుకోని ఆటంకాలు ఏర్పడితే బిట్ కాయిన్ ట్రేడింగ్, స్పెక్యులేషన్ లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలా ఒకసారి జరిగింది కూడా. పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉన్నందున బిట్ కాయిన్ లతో ఎప్పటికయినా ప్రమాదమే అన్న అనుమానం రాకమానదు.

బ్యాంకులు, ప్రభుత్వాల అనుమతులు లాంటి బాదరబందీ లేకుండా డబ్బును విదేశాలకు పంపే సదుపాయాన్ని బిట్ కాయిన్ కరెన్సీ కల్పిస్తోంది. దాంతో బిట్ కాయిన్ ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ 449 డాలర్ల ధర పలుకుతోంది. అంటే పెద్ద మొత్తంలో డబ్బును సరిహద్దులు దాటించవచ్చు. ఫలితంగా సహజంగానే ఇది ఆర్ధిక నేరగాళ్లకు ఆకర్షణీయం అవుతోంది.

ఇలా బిట్‌ కాయిన్‌‌పై చాలా సందేహాలున్నాయి. అయితే పూర్తిస్థాయిలో చలామణిలోకి వస్తే గాని, దీని మంచీ, చెడూ సమగ్రంగా అర్థంకాదు. సతోషి నకటోమో తానేనంటూ క్రెగ్ రైట్ అనే ఆస్ట్రేలియన్ తెరపైకి రావడంతో బిట్‌ కాయిన్‌పై మళ్లీ చర్చ మొదలైంది. చూడాలి. బిట్‌ కాయిన్‌ కాసుగా మారుతుందో, చెల్లని కాసుగా మిగులుతుందో...

Show Full Article
Print Article
Next Story
More Stories