‘రైట్ బ్రదర్స్ ఎవరు.. విమానాన్ని కనిపెట్టింది మనోడైతేనూ’

‘రైట్ బ్రదర్స్ ఎవరు.. విమానాన్ని కనిపెట్టింది మనోడైతేనూ’
x
Highlights

న్యూఢిల్లీ: విమానాన్ని కనిపెట్టింది, రూపొందించింది ఎవరని అడిగితే రైట్ సోదరులు అని టక్కున సమాధానమొస్తుంది. అమెరికాకు చెందిన ఈ సోదరులు విమానాన్ని...

న్యూఢిల్లీ: విమానాన్ని కనిపెట్టింది, రూపొందించింది ఎవరని అడిగితే రైట్ సోదరులు అని టక్కున సమాధానమొస్తుంది. అమెరికాకు చెందిన ఈ సోదరులు విమానాన్ని తయారుచేశారని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఓ కేంద్ర మంత్రి మాత్రం రైట్ సోదరులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. విమానాన్ని కనిపెట్టింది వాళ్లు కాదని అంటున్నారు. అంతేకాదు, విమానాన్ని కనిపెట్టింది భారతీయుడేనని వాదిస్తున్నారు. ప్రాచీన భారతీయులు కనిపెట్టిన వాటిల్లో విమానం కూడా ఒకటని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు కేంద్ర మంత్రి సత్య‌పాల్ సింగ్. ఢిల్లీలో ఇంజనీరింగ్, డిప్లొమా విద్యార్థుల సమ్మేళన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైట్ సోదరుల కంటే ముందు శివ్‌కర్ బాపూజీ విమానాన్ని కనిపెట్టారని అధ్యాపకులు ఎందుకు బోధించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు.

రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టక ముందే.. వాళ్ల కంటే ఎనిమిది సంవత్సరాల ముందే ఆయన విమానాన్ని కనిపెట్టారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. అంతేకాదు రామాయణంలో వివరించిన పుష్పక విమానం గురించి విద్యార్థులకు బోధించాలని ఆయన సూచించారు. ప్రాచీన భారతీయుల ఆవిష్కృతాలకు అది స్పూర్తిగా నిలిచిందని సత్యపాల్ సింగ్ చెప్పుకొచ్చారు. రావణ రాజ్యంలో మొక్కలు నీళ్లు లేకుండా బతికేవని, చంద్రమణి అనే ఔషధాన్ని అవి కలిగి ఉండేవని, అందువల్ల నీళ్లు లేకపోయినా మొక్కలు నిక్షేపంగా ఉండేవని ఆయన తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత పీసీ చాకో ఖండించారు. మోదీ కేబినెట్‌లోని కొందరు మంత్రులు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వార్తల్లో నిలిచారు. రామ బాణాలతో ఇస్రో రాకెట్లను అభివృద్ధి చేసుకుందని ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories