ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత.. వయసెంతంటే?

Submitted by arun on Fri, 07/27/2018 - 16:34
World's oldest person

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన 117 ఏళ్ల జపాన్ మహిళ, చియో మియాకో కన్ను మూసింది. మియాకో ఆదివారం తుది శ్వాస విడిచినట్టు కనగావా ప్రావిన్స్ అధికారులు ఇవాళ ప్రకటించారు. మియాకో మే 2, 1901లో జన్మించింది. గత ఏప్రిల్‌లో మియాకో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా చరిత్రకెక్కింది. సౌత్ జపాన్‌లోని కికాయ్ ఐలాండ్‌కు చెందిన నబి తజిమా తన 117 ఏండ్లకు మరణించడంతో మియాకో అత్యంత వృద్ధురాలుగా నిలిచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఆమెకు ఈ మేరకు ధృవీకరణ పత్రాన్ని అందజేసింది. మియాకోని ఆమె కుటుంబ సభ్యులు దేవతగా పిలుస్తారు. ప్రతి ఒక్కరితో ఎంతో దయగా, ఓర్పుతో మాట్లాడేదని వారు చెబుతున్నారు. జపాన్ సంప్రదాయ వంటకం సుషీ, ఈల్ ని మియాకో ఎంతో ఇష్టంగా తినేది. క్యాలిగ్రఫీ అంటే ఎంతో ఇష్టపడే మియాకో ఇటీవలి కాలం వరకు రాస్తుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మియాకో తర్వాత ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా క్యూషూ ద్వీపంలోని ఫుకువోకాకి చెందిన కానె తనాకా ఎంపిక కానున్నట్టు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తనాకా వయసు 115 సంవత్సరాలు. ప్రపంచంలో అత్యంత వృద్ధుడు కూడా జపాన్ కు చెందిన వ్యక్తే. హొక్కైడో ద్వీపానికి చెందిన మసాజో నొనాకా ఇటీవలే బుధవారం తన 113వ జన్మదినాన్ని జరుపుకున్నాడు.
 

English Title
World's oldest person, a Japanese woman, dies at 117

MORE FROM AUTHOR

RELATED ARTICLES