అట్టుడుకుతున్న గుజరాత్‌ ...అత్యాచారంపై గుజరాతీల్లో కట్టలు తెంచుకున్న ఆవేశం

Submitted by arun on Mon, 10/08/2018 - 11:15
Gujarat

గుజరాత్‌ అట్టుడుకుతోంది. ప్రాంతీయ వాదంతో కొందరు అల్లరిమూకలు రెచ్చిపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. మైనర్ అమ్మాయిపై అత్యాచారం కేసులో ఓ బీహారీని అరెస్ట్ చేయడంతో పాటు సోషల్‌ మీడియాలో విద్వేశపూరితమైన పోస్టులతో ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. దీంతో నాన్‌ గుజరాతీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు. 

మైనర్‌ అమ్మాయిపై అత్యాచారం ఆపై జరుగుతున్న ఘటనలతో ప్రధాని మోడీ సొంతం రాష్ట్రం గుజరాత్‌లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. గత నెల 28 న అహ్మదాబాద్‌ కు 100 కిలోమీటర్ల దూరంలోని సబర్‌కాంతా జిల్లా హిమ్మత్‌నగర్‌ పట్టణంలో గుజరాతీ అమ్మాయిపై రేప్‌ జరిగింది. ఈ కేసులో బీహార్‌కు చెందిన రవీంద్ర సాహూ అనే యువకుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నాయి. దీంతో గుజరాతీల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీల కుటుంబాలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. 

రాష్ట్ర రాజధాని గాంధీనగర్, అహ్మదాబాద్, పటన్, సబర్‌కాంతా, మెహసానా ప్రాంతాల్లో వలసవచ్చిన వారిపై అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. గుజరాతీలు కానివారిని పట్టుకుని మరీ దాడి చేస్తున్నారు. వారి ఇళ్లపై విరుచుకుపడి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఈ ఘటనలను అదునుగా చేసుకొని కొన్ని సంఘ విద్రోహ శక్తులు వలస కార్మికులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో విద్వేష ప్రచారం చేయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. 

ఇక ఇదే అదునుగా ఠాకూర్‌ సేన అనే స్వచ్ఛంద సంస్థ వలస కార్మికులు వెంటనే గుజరాత్‌ విడిచివెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. లేకపోతే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చింది. అంతేకాకుండా వీరికి పని ఇవ్వరాదని దుకాణాలు, ఫ్యాక్టరీల యజమానులకు అల్టిమేటం జారీచేసింది. దీంతో వందలాదిగా వలస కూలీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సొంతరాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. 

అయితే దాడులపై ఇప్పటివరకు 342 మందిని అరెస్ట్‌ చేసినట్లు గుజరాత్‌ డీజీపీ శివానంద్‌ ఝా తెలిపారు. 42 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశామని దాడులను ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తెలిపారు. హింసాత్మక ఘటనలు జరిగే జిల్లాల్లో 17 కంపెనీల బలగాలు, ఒక ప్లాటూన్‌ రాష్ట్ర రిజర్వు పోలీసు బలగాలను మోహరింపజేసినట్లు డీజీపీ తెలిపారు. 

English Title
Workers From UP, Bihar Leave North Gujarat After Protests Over Rape

MORE FROM AUTHOR

RELATED ARTICLES