మచ్చలు మంచివే..

మచ్చలు మంచివే..
x
Highlights

ఒంటి నిండా ఆమెకు మచ్చలే. అయినా ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోని అమ్మాయిగా ఎదిగింది. అందమంటే, అందంగా కనిపించడమంటే చాలా ఆసక్తిని ప్రదర్శించే ఈమెకు...

ఒంటి నిండా ఆమెకు మచ్చలే. అయినా ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోని అమ్మాయిగా ఎదిగింది. అందమంటే, అందంగా కనిపించడమంటే చాలా ఆసక్తిని ప్రదర్శించే ఈమెకు అందాల పోటీల్లో పాల్గొనాలనే కోరిక ఉండేది. విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. కలను కూడా సాకారం చేసుకుంది. అతి పిన్న వయసులో ఆమె చూపిన తెగువను చూసిన ప్రపంచం ఆమెకు సలాం అంది.

గూగుల్‌లో సెర్చ్ కొడితే...
ఎవిటా డెల్ముండో, మీరు ఒక్కసారి ఈ పేరు గూగుల్‌లో సెర్చ్ కొట్టి చూడండి. ఎన్ని ఫోటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు, ఫీచర్లు, వార్తలు మీ కళ్లముందు కనిపిస్తాయో మీకే తెలుస్తుంది. పవర్ ఫుల్ పర్సనాలిటీల్లో ఒకరిగా నిలిచిన ఎవిటా డెల్ముండో ఆత్మవిశ్వాసం ముందు మనం చిన్నబోవడం ఖాయం.

తప్పదని.. పునర్జన్మలా భావించింది...
ముఖానికో చిన్న మొటిమ వస్తేనే ముఖం దాచుకునేవారు చాలామంది ఉన్నారు. అలాంటిది పుట్టుకతోనే వేలాది మచ్చలతో ఉన్న ఎవిటా మొదట్లో ఎలాగైనా వీటిని తొలగించుకోవాలనుకుంది. కానీ ఇది తన ప్రాణాలకే ముప్పని తెలుసుకుని.. ఇక ఆ ప్రయత్నాన్ని మానుకుంది. చివరికి టీనేజ్‌లోనే ఆ మచ్చలను ప్రేమించడం నేర్చుకుంది. ‘నా శరీరాన్ని నేనే అసహ్యించుకుంటే .. ఇక నేనెలా బతకాలి, మచ్చలైనా, లోపమైనా నా శరీరంలో భాగం.. నేను వీటితోనే బతకాలి, అందుకే వీటినే ఇష్టపడాలి అని నిర్ణయించుకోక తప్పలేదు. అంతే ఇక తనకు పునర్జన్మ ఎత్తినట్టు భావించడం మొదలుపెట్టింది. మిస్ యూనివర్స్ మలేషియా పోటీల్లో సెలెక్ట్ అవుతానా లేదా అన్న టెన్షన్‌లో ప్రస్తుతం ఈమె ఉంది.

20 ఏళ్ల వయసులోనే మనసు రాయి..
అన్నెం పున్నెం ఎరుగని వయసునుంచే తనను అందరూ అసహ్యించుకోవడం చూసి ఏం చేయాలో అర్థంకాక కుంగిపోయిన ఎవిటా, చివరికి మనసు రాయి చేసుకుంది. తన శారీరక లోపాన్ని దిగమింగేందుకు గిటార్ నేర్చుకుంది. పాడటం కూడా నేర్చుకుంది. ప్రస్తుతం ఓ లోకల్ కేఫ్‌లో పార్ట్‌టైం ఉద్యోగిగా పనిచేస్తూ సంపాదిస్తోంది.

ఒకవేళ పోటీలో ఓడిపోతే...
‘మిస్ యూనివర్స్ మలేషియా పోటీల్లో ఒకవేళ ఓటమిపాలైనా ఫర్వాలేదు.. నేను దాన్ని కూడా జీర్ణం చేసుకుంటా.. ఎందుకంటే ఇలా బ్యూటీ కాంపిటీషన్‌లో పాల్గొనాలంటే ఇంకా చాలా పోటీలున్నాయి, వేదికలు కూడా ఉన్నాయి అంటూ జవాబు చెప్పిన తీరు అందిరినీ ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం పలు సోషల్ నెట్‌వర్క్ అకౌంట్లలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఎవిటా ప్రపంచంలో ఎన్నో రకాల వైకల్యాలతో బాధపడుతున్నవారందరికీ పెద్ద రోల్ మోడల్‌గా నిలుస్తోంది.

అందం అనే మచ్చ...
అదేదో సినిమాలో ఒక రచయిత అన్నట్టు.. ఈమెకు మరక అంటంది.. అది కూడా అందం అనే మరక.. అది తుడిస్తే చెరిగిపోదు. ఆమెతో పాటు అలాగే జీవితకాలం పాటు ఉంటుంది. వీళ్లు తిట్టారని, వాళ్లు గదమాయించారని, డబ్బు సమస్య ఉందని.. ఇదని అదని ప్రతి విషయానికి ఆత్మహత్యే శరణ్యం అనేవారిని నిత్యం వేలాదిమందిని మనం చూస్తున్నాం. అలాంటి వారందరికీ ఎవిటా గట్టి జవాబు చెబుతున్నారు. సజీవ సాక్ష్యంగా నిలుస్తూ ఆత్మన్యూనతతో బాధపడుతున్నవారందరికీ పాఠాలు చెప్పేలా ధైర్యంగా నిలబడ్డారు.

ఒంటరి పోరాటమే..
చిన్నప్పటి నుంచి ఎవరూ ఎవిటాను ఇష్టపడలేదు సరికదా క్లాస్‌మేట్స్‌తో పాటు ఇరుగు పొరుగువారంతా అసహ్యించుకునేవారు. చిన్నచూపు చూసేవారు. ఎవిటాకున్నది ఏదో అంటువ్యాధి అయినట్టు బాధించేవారు. దీంతో తాను ఊహ వచ్చినప్పటినుంచీ ఒంటరి పోరాటం చేస్తున్నట్టు ఎవిటా చెప్పుకొచ్చారు. ఒంటరి ప్రయాణంలో తనకు తోడుగా నిలిచినది కేవలం కుటుంబ సభ్యులు, వైద్యులు మాత్రమేనని ఆమె వివరిస్తారు. కానీ ఎప్పుడైతే ఆమె బ్యూటీ కాంపిటీషన్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారో ఆ క్షణానే ఆమెకు అభిమానులు, స్నేహితులు, వెల్ విషర్స్ ఇలా ఒకరేమిటి, చాలామంది దేశ విదేశాలనుంచి ఆమెతో స్నేహం చేసేందుకు ముందుకు వచ్చారు.

మోల్ బ్యూటీ సెలబ్రిటీ...
ప్రస్తుతం ఎవిటా పేరు వెనకే మోల్ బ్యూటీ అన్న టైటిల్ కూడా వస్తుంది. ప్రస్తుతం సెలబ్రిటీగా చెలామణి అవుతున్న ఈ అందగత్తె, జీరో సైజ్‌తో ఆకట్టుకునే రూపం కలిగిన అందగత్తెగా పేరుగాంచారు. ఒకప్పుడు మాన్‌స్టర్ అన్నవారే ఇప్పుడు బ్యూటీ క్వీన్ అంటున్నారు. అందమైన చంద్రునికి మచ్చలు న్నట్టే ఈమెకు మచ్చలున్నాయని సపోర్ట్ చేసేవారి సంఖ్య నానాటికి పెరుగు తోందంటే.. అందానికి ఎవిటా ఇస్తున్న సరి కొత్త నిర్వచనం పరిధి విస్తృతమైనట్టే.

చాక్లెట్ చిప్ కుకీ..
ఈమెకు క్లాస్‌మేట్స్ పెట్టిన పేరు ఒకటి మాన్‌స్టర్, మరొకటి చాక్లెట్ చిప్ కుకీ కానీ ఇప్పుడు ఇది బ్యూటీ క్వీన్‌గా రూపాంతరం చెందింది. ఒకప్పుడు అలా పేర్లు పెట్టినవారే ఇప్పుడు ఆమె ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడుతున్నారు. సెల్ఫీలు తీసుకుని అందగత్తెతో ఫొటో దిగాం అని సోషల్ నెట్‌వర్క్‌లో గర్వంగా పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వంటి అకౌంట్లను ఫాలో కొడుతున్న నెటిజెన్లుగా మారిపోతున్నారు.

16 ఏళ్లకు ...
చిన్నప్పటినుంచీ తన ఒంటిపై ఆపాదమస్తకం ఉన్న మచ్చలను సర్జరీ ద్వారా తొలగించుకోవాలని కలలుకన్న ఎవిటా చివరికి 16వ ఏట తనకు జ్ఞాన నేత్రం తెరుచుకుందని చెబుతారు. అంతే తన జీవితానికి ఓ లక్ష్యం అనేది ఉండాలని, ఆ లక్ష్యం సాకారం చేసుకోవాలని ఈ దిశగా పట్టుబట్టి మరీ పోటీలకు ఒకదశ వరకూ అర్హత సాధించేసింది.

అందమంటే నిర్వచనం ?
అందమంటే కంటికి కనిపించేదేనా ? ఆత్మవిశ్వాసంతో దూసుకుపోయే నైజం కాదా.. పుట్టుకతో వచ్చిన లోపాన్ని ధైర్యంగా అంగీకరించి జీవితాన్ని ఆస్వాదించడం కాదా అని ప్రశ్నించే ఎవిటా మాటలతో అందాల పోటీల నిర్వాహకులు ఏకీభవిస్తున్నారు. అంతేకా దు ఇలా అందాల పోటీలను మొట్టమొదటిసారి ఆసక్తికరమైన మలుపులు తిప్పిన ఎవిటా సరికొత్త చరిత్రను సృష్టించారు. మానసిక వికారం లేకపోవడమే అందం, అంతేకానీ ప్లాస్టిక్ సర్జరీలతో కోట్ల రూపాయలు వెదజల్లి తెచ్చుకునే ప్లాస్టిక్ అందం అందమెలా అవుతుంది అని ప్రశ్నించే గుండెదమ్మున్న సహజమైన అందగతె్త ఈమె. కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయించకుండా తనకున్న రూపాన్ని, తనకు నచ్చిన వస్త్రాల్లో కనువిందు చేసేలా ఉన్న ఈ యంగ్ బ్యూటీ క్వీన్ రియల్ బ్యూటీ క్వీన్‌గా అందరికీ తెగనచ్చుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories