తిక్కుందా? లెక్కుందా?

x
Highlights

నాక్కొంచెం తిక్కుంది...దానికో లెక్కుందని గబ్బర్‌ సింగ్‌లో డైలాగ్ చెప్పాడు పవన్ కల్యాణ్. తిక్కయితే ఉంది కానీ, లెక్కేది అని కొందరు ప్రశ్నిస్తున్నారు....

నాక్కొంచెం తిక్కుంది...దానికో లెక్కుందని గబ్బర్‌ సింగ్‌లో డైలాగ్ చెప్పాడు పవన్ కల్యాణ్. తిక్కయితే ఉంది కానీ, లెక్కేది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, ప్రశ్నిస్తాను అంటూ జనసేన స్థాపించిన పవన్ కల్యాణ‌, ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొత్త రాజకీయం పరిచయం చేస్తానంటూ, కన్‌ఫ్యూజన్‌లా మాట్లాడుతున్నాడని, కార్యర్తలు, అభిమానులే కంగాలీ అయిపోతున్నారు. ఇంతకీ పవన్‌ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడా....వ్యూహాత్మకంగా జనాలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడా....గందరగోళంగా మాట్లాడ్డమూ రాజకీయ అస్త్రమేనా....?

అజ్ణాతవాసి విడుదలైన తర్వాత, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టిపెడుతున్నట్టు ప్రకటించారు. చలోరే చలోరే చల్‌ అంటూ రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో మూడు రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో మూడురోజుల పర్యటించారు. తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం మొదలు, ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రోడ్‌ షోలు, కార్యకర్తల మీటింగ్‌లతో బిజిబిజీగా గడిపారు. అటు అనంతపురం జిల్లాలోనూ మూడు రోజులు పర్యటించిన పవన్, కరవుపై అధ్యయనం పేరుతో సమావేశాలు నిర్వహించారు. ధర్మవరంలో నేతన్నలతో మాట్లాడారు.

ప్రత్యర్థులెవరో, మిత్రులెవరో క్లారిటీ ఇచ్చారా?
రెండు రాష్ట్రాల పర్యటనలతో పవన్‌ కల్యాణ్‌ ఏం చెప్పదలిచారు ఆయన ప్రసంగాల సారాంశమేంటి ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దిశగా అడుగులేశారా పార్టీ విధానాలు చెప్పారా కార్యకర్తలను కార్మొనుఖుల్నీ చేశారా జనసేనకు ప్రత్యర్థులెవరో మిత్రులెవరో క్లారిటీ ఇచ్చారా ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందా స్పష్టతవచ్చిందా వీటికి ఆన్సరేంటని అడిగితే, అభిమానులకు, కార్యకర్తలకే అర్థంకాని పరిస్థితి ఫుల్‌ కన్‌ఫ్యూజన్‌.

ప్రశ్నిస్తానను చెప్పి ప్రశంసించడమేంటి?
పవన్ ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడతాడని అందరూ ఆశించారు. కానీ తెలంగాణలో కేసీఆర్ సర్కారును పొగడ్తలతో ముంచెత్తారు. ఒక్క సమస్యనూ లేవనెత్తలేదు. ఇటు ఏపీలో అయితే, మూడున్నరేళ్లలో అసలు ఒక్క పొరపాటు లేదన్నట్టుగా, ప్రభుత్వలోటుపాట్లను ఎత్తిచూపడం లేదు. మరి ప్రశ్నిస్తాను అంటూ పార్టీ పెట్టిన పవన్, ప్రభుత్వాలను ప్రశంసించడం ద్వారా, ఇస్తున్న సందేశమేంటి కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి అధికార పక్షాలకు మేలు చేయడానికి వచ్చాడన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబేంటి?

పాతికేళ్లపాటు రాజకీయం చేస్తూ గడిపేస్తారా?
ఎన్నికలలో అద్భుతాలు సృష్టిస్తానని తాను చెప్పడం లేదని కూడా పవన్ చెప్పారు. తన సిద్ధాంతాలు ఏమిటో చెప్పే ప్రయత్నం చేశారు, గానీ వాటిని అర్థమయ్యేలా వివరించలేకపోయారు. తాను అనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పాతికేళ్లు పడుతుందని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అంటే అధికారం లేకుండా పాతికేళ్లపాటు రాజకీయం చేస్తూ ఉంటారా సమస్యలపై అధ్యయనం పేరుతో ఊళ్లూ తిరుగుతుంటారా యువరాజ్యం నుంచి రాజకీయ తెరపై ఉన్న పవన్‌కు, 2018లో అధ్యయనం చేయడం ద్వారానే అనంతపురంలో కరవు తెలిసొస్తుందా? నేతన్నల సమస్యలు ఇప్పుడే బోధపడతాయా?

సమస్యల పరిష్కారానికి మాట సాయమైతే పార్టీ ఎందుకు?
తనది సరికొత్త రాజకీయ ఆలోచనా విధానమనీ, అధికారంలో ఉన్న పార్టీలతో ఘర్షణపడటం తన విధానం కాదనీ ఆయన చెబుతుంటారు. ఇందులో తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించడం మంచిదే. ఇదే లక్ష్యం అయ్యే పక్షంలో అందుకు రాజకీయ పార్టీ అవసరం లేదు కదా. లోక్‌సత్తా తరహా ఒక ఫ్లాట్‌ఫాంతో పోరాడితే సరిపోతుంది కదా అని రాజకీయ పండితులు చెబుతున్నారు.

అధికారం లక్ష్యంలేని పార్టీకి ప్రజలెందుకు పట్టం కడతారా?
పవన్ చెబుతున్న మరో విషయం ఏంటంటే, అధికారం తన లక్ష్యం కాదని, సీఎం పగ్గాలు చేపట్టేటంత అనుభవం, తెలివితేటలు తనకు లేవని, రాజకీయాల్లో తాను చాలా చిన్నపిల్లాడినని. ఇలాంటి మాటలు, విధానాలు ఇప్పుటి పొలిటికల్‌ ట్రెండ్‌కు అస్సలు సరిపోవు. ఏ పార్టీకైనా అధికారమే లక్ష్యం. అలా అధికారం హస్తగతం చేసుకునే అవకాశమున్న పార్టీకే జనం కూడా ఓట్లేస్తారు. కానీ పవన్‌ మాత్రం తనకు అధికారం లక్ష్యంకాదని చెప్పడం ద్వారా కార్యకర్తలను జనాలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. జగన్‌కు సీఎం అయ్యే అనుభవం, అర్హతలేదనడం ద్వారా, అది తనకూ వర్తిస్తుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. అధికారం లక్ష్యంలేని పార్టీకి ప్రజలెందుకు పట్టం కట్టాలనుకుంటారు?

మొత్తానికి పవన్ ప్రసంగాలను స్కాన్ చేస్తే, ఎవ్వరికీ అర్థంకావడం లేదన్న రిపోర్ట్ వస్తోంది. ఆయన రాజకీయ సంకల్పమూ బోధపడ్డంలేదని అర్థమవుతోంది. అంటే ఆయన కన్‌ఫ్యూజన్‌లో ఉండి కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడా క్లారిటీగానే ఉండి కన్‌ఫ్యూజన్‌ మాట్లాడుతున్నాడా? కన్‌ఫ్యూజ్‌ చెయ్యడం కూడా రాజకీయ వ్యూహమేనా నిజంగా గందరగోళం కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజే అయితే, అది ఎలాంటి అస్త్రం కల్యాణ్‌కు తిక్కుందా....లేక లెక్కుందా..

మాటలకు ఎందుకు పొంతన కుదరడం లేదు?
కోట్లాదిమంది అభిమానులు పవన్‌ బలం. జనసేనాని ఆవేశం చూస్తుంటే, సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన కనిపిస్తుంది. కానీ 2014 నుంచి నేటి వరకు పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాలు చూస్తుంటే, ఒక పట్టాన అర్థంకావడం లేదు అభిమానులకు, కార్యకర్తలకు. ఒకసారి చెప్పే మాటకు, మరోసారి చెప్పే మాటకు పొంతనకుదరడం లేదని ఆయన అభిమానులు ఫీలైపోతున్నారు. విషయం ఏదైనా స్పష్టతనివ్వకపోవడం, వాయిదా వేయడమే కనిపిస్తోంది. తాజాగా ఎన్నికల్లో పాత్తుల గురించి ప్రశ్నిస్తే.. ప్రజాభీష్టం మేరకు టీడీపీ పొత్తు విషయం ఆలోచిస్తానని చెప్పారు పవన్. ప్రజాబీష్టం అన్నది, అర్థంకాని ఒక బ్రహ్మపదార్థం. పొత్తులొక్కటే కాదు, రాజధాని భూములపై రైతులకిచ్చిన మాట, ప్రత్యేక హోదా, మెగా ఆక్వా ఫుడ్ పార్క్, చాలా అంశాల్లో మొదట చెప్పిన మాటకు, తర్వాతిరోజుల్లో చేస్తున్న కామెంట్లకు సబంధం ఉండటంలేదన్నది ఒక కన్‌ఫ్యూజన్. కానీ పవన్‌కు క్లారిటీ ఉంది. కన్‌ఫ్యూజనే పవన్‌ అస్త్రమని కొందరంటున్నారు.

క్లారిటీ ఇవ్వకుండా, ఆచితూచి వ్యవహారం
ఏ విషయమ్మీదా క్లారిటీ ఇవ్వకపోవడం కూడా వ్యూహమేనా అంటే, అదొక రాజకీయమనే వారు కూడా ఉన్నారు. ఒక విషయం మీద క్లారిటీ ఇస్తే, దానికి కట్టుబడి ఉండాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలీదని భావిస్తున్నారు పవన్. తొందరపడి తాను మాట ఇస్తే, ఇబ్బందిపడాల్సి వస్తుందన్న భావన ఆయనలో ఎక్కువని, చెబుతారు. అందుకే, ఏ అంశంలోనూ క్లారిటీ ఇవ్వకుండా, ఆచితూచి అన్నట్లు మాట్లాడుతూనే.. ఏ విషయాన్ని తేల్చకుండా విషయాన్ని కన్ఫ్యూజ్ చేయటం ద్వారా తానేం చెబుతున్నానో ప్రజలకు అర్థమై కానట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా భావించాలి.

పవన్ కన్‌ఫ్యూజన్‌ స్ట్రాటజీ ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా అర్థంకావాలంటే, ఇప్పుడు పవన్‌ ఏపీలో ప్రభుత్వంపై అనేక అంశాల్లో ప్రశ్నించొచ్చు. చంద్రబాబు సర్కారు, ఇచ్చిన మాట తప్పిందని, అవనీతిమయమైందని ప్రతిపక్షంలా ఆరోపించొచ్చు. ఊరూవాడా ఆందోళనలు చేయొచ్చు. ఆఖరి వరకు ఈ మాటలకే కట్టుబడాల్సి ఉండాలి. లేదంటే ప్రభుత్వాన్ని అహోఓహో అనాలి. కానీ ఇప్పుడు మాత్రం ఈ రెండూ గట్టిగా చెయ్యడం లేదు పవన్. ఒకవైపు ఏమీ అనను అంటూనే, మరోవైపు సమస్యల అధ్యయనం అంటూ ఊళ్లూ తిరుగుతున్నారు. ఇలా కన్‌ఫ్యూజ్‌గా మాట్లాడటం ద్వారా పవన్‌కు రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి త్వరలో క్లారిటీగా ప్రభుత్వంపై విమర్శలు కురిపించి, టీడీపీని ఓడించాలని పిలుపునివ్వొచ్చు. రెండు, ప్రజారాజ్యం విఫప్రయోగం నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేసే సత్తాలేదు కాబట్టి, ఇప్పుడు టీడీపీతో కానిచ్చేయడం. ఈ రెండు ఆప్షన్స్‌ ఓపెన్‌గా ఉండాలంటే, దేనిమీదా స్పష్టత ఉండకూడదన్నది పవన్ వ్యూహంగా చెబుతున్నారు.

కన్‌ఫ్యూజన్‌ను పక్కనపెడితే, పవన్ ఈ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్న దానిపై మరో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. చంద్రబాబు వైఫల్యాలన్నిటికీ పవన్ వివరణలు ఇచ్చుకుంటూ పోతారని.. చంద్రబాబు ప్రచారపర్వంలోకి దిగేసరికి పరిస్థితి సానుకూలంగా మార్చి జనం ప్రశ్నించకుండా, తిరగబడకుండా చేసే పనిలో ప్రస్తుతం పవన్ ఉన్నారని పలువురు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే మేనిఫెస్టో హామీలు కొన్ని సాధ్యమవుతాయి, కొన్ని కావని తాజాగా అనంత పర్యటనలో పవన్‌ అన్నారు. ప్రత్యేక హోదాపైనా సైలెంట్‌గా ఉన్నారు. మొత్తానికి పవన్‌ కన్‌ఫ్యూజన్‌లో ఉండి కన్‌ఫ్యూజన్‌గా మాట్లాడుతున్నారో, లేదంటే క్లారిటీగా ఉండి స్ట్రాటజీగా జనాలను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారో, అధికారపక్షాలకు సానుకూల బాటలేస్తూ పోతున్నారో, పవన్‌కైతే ఫుల్‌ క్లారిటీ ఉందనుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం, జనాలు మాత్రం ఓటు విషయంలో ఫుల్‌ క్లారిటీతో ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories