కేసీఆర్ ప్రభుత్వం కీలక ప్రకటన

Submitted by arun on Sat, 02/24/2018 - 11:55

ఒకవైపు మద్దతు ధర కోసం రైతుల ఆందోళనలు చేస్తుంటే, మరోవైపు వారి ఆగ్రహాన్ని చల్లార్చడానికో, వారి అనుగ్రహాన్ని పొందడానికో కేసీఆర్ ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన చేసింది. రైతు సమన్వయ సమితి పేరుతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, కర్షకులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించింది. మరి దీని విధివిధానాలు ఎలా ఉన్నాయి..రైతులకు నిజంగా ఉపయోగపడుతుందా?

తెలంగాణలో అనేక కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌ ప్రభుత్వం, రైతుల కోసం కూడా కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరుతో, ఈ సంస్థను నిర్వహంచబోతోంది. ఇప్పటికే ఎకరాకు నాలుగు వేల పెట్టుబడి ప్రకటించిన కేసీఆర్, ఇదే ఒరవడిలో తీసుకున్న మరో కీలక నిర్ణయమిది.

వ్యవసాయ అభివృద్ది చర్యలను లాభాపేక్షలేని సంస్థగా పని చేస్తుంది రైతు కార్పొరేషన్. వ్యవసాయ రంగ అభివృద్ది, రైతు సంక్షేమం కోసం సర్కారు చేపడతున్న చర్యల్ని, క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కృషి చేస్తుంది.

వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖలు
రైతు సమన్వయ సమితి ఏర్పాటులో కీలకాంశాలు చాలా ఉన్నాయి. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖలు, మార్క్‌ఫెడ్‌ తదితర ప్రభుత్వ సంస్థలు, ఉపాధి హామీ వంటి సంస్థలను, పథకాలను సమన్వయం చేసుకుంటుంది కార్పొరేషన్. వాటి ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులూ జరిపి, రైతులకు సమాచారం చేరవేస్తుంది. అంతేకాదు, రైతు నుంచి వినియోగదారుడి వరకూ ఉన్న పంపిణీ వ్యవస్థలో భాగంగా గిడ్డంగులు, శీతలగిడ్డంగులు, ప్యాకింగ్‌ హౌస్‌ వంటివాటిని పర్యవేక్షిస్తుంది.

ప్రైవేటు సంస్థలతో కలిసి చర్యలు
కేవలం రాష్ట్ర మార్కెట్‌నే కాదు, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతుల అవకాశాలను జల్లెడపడుతుంది రైతు కార్పొరేషన్. అవసరమనుకుంటే సొంతంగా ఔట్‌లెట్లనూ ఏర్పాటు చేస్తుంది. ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకుని గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, మార్కెటింగ్‌ను చూసుకుంటుంది. ఫుడ్‌ పార్కుల్లో ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేసే అంశాలనూ పరిశీలిస్తుంది. 

ప్రతి సీజన్‌లోనూ ఏ పంట వేయాలో, ఎక్కడ ఏ పంట వేస్తున్నారు వంటి సమాచార పంపిణీ ప్రతిసారి సమస్యగా మారుతోంది. రైతులందరూ ఒకే పంట పంట వేస్తుండటంతో దిగుబడులు పెరిగి, పంటకు ధర పడిపోతోంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా, రైతులను సంఘటిత పరుస్తుంది కార్పొరేషన్. పంట కోతకు ముందు, తర్వాత చేపట్టే కార్యక్రమాలకు ప్రోత్సాహమిస్తుంది. పంటలకు అవసరమైన పెట్టుబడి అవసరాలను అంచనా వేస్తుంది. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచేందుకు క్రాప్‌ కాలనీల ప్రణాళికలను వేస్తుంది. రైతులకు శిక్షణా కార్యక్రమాలూ నిర్వహిస్తుంది.

రైతు కార్పొరేషన్‌కు చైర్మన్‌, 14 మంది డైరెక్టర్లు
మొత్తానికి రైతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుండటంపై రైతుల్లో అయితే ప్రస్తుతం ఆనందం వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌కు చైర్మన్‌, 14 మంది డైరెక్టర్లు ఉంటారు. చైర్మన్‌ను ప్రభుత్వమే నామినేట్‌ చేస్తుంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించే ఛాన్సుంది. వ్యవసాయ, ఉద్యానవన శాఖల కమిషనర్లు, తెలంగాణ రాష్ట్ర రైతు వేదిక ఎండీ, ఆర్థికశాఖ నుంచి ఒక ప్రతినిధి డైరెక్టర్లుగా ఉంటారు. మిగిలిన పది స్థానాలకు రైతు ప్రతినిధులను ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలోనూ సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తారు. ఈ కార్పొరేషన్‌లో 51 శాతం బలహీనవర్గాలు, మహిళలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్.

English Title
Will New Corporation Change Telangana Farmers Fate?

MORE FROM AUTHOR

RELATED ARTICLES