ప్రియుడి మోజులో పడి భర్తలను చంపుతున్న భార్యలు

x
Highlights

దాంపత్య సంబంధాలను క్షణికావేశం భగ్నం చేసేస్తోంది. వివాహేతర బంధాలు ముళ్ల కంపల్లా తగులుతున్నాయ్.. పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయ్.. అన్నెంపున్నెం...

దాంపత్య సంబంధాలను క్షణికావేశం భగ్నం చేసేస్తోంది. వివాహేతర బంధాలు ముళ్ల కంపల్లా తగులుతున్నాయ్.. పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయ్.. అన్నెంపున్నెం తెలియని పిల్లలను అనాధలను చేసేస్తున్నాయ్.. కుటుంబ బంధాలు ఎందుకు పలచనవుతున్నాయ్? అవగాహనలో లోపమా? అసహనమా?క్షణికమైన బంధాల మోజులో పడి మహిళలు సెన్సిటివిటీ మిస్ అవుతున్నారా?

ఏ బంధానికైనా నమ్మకం ముఖ్యం.. ఆ నమ్మకమే సందేహమైనప్పుడు.. ఆ బంధం వాడిపోతుంది.. వడలి పోతుంది.. వివాహేతర బంధాల మోజు హత్యలకు దారితీస్తోంది. .దాంపత్య సంబంధాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా?తెలుగు రాష్ట్రాల్లో వరుస పెట్టున జరుగుతున్న ఘటనలను చూస్తే కలుగుతున్న సందేహాలివి.

వివాహేతర సంబంధాలు కుటుంబాలను భగ్నం చేస్తున్నాయి.. హాయిగా దాంపత్య జీవితం గడపాల్సిన భార్యలు వారిని దారుణంగా, కిరాతకంగా హతమారుస్తున్నారు. నూరేళ్ల నిండుజీవితాన్ని కర్కశంగా కాటేస్తున్నారు.. విచక్షణా రహితంగా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు.

ఏ ఆడదానికైనా పెళ్లయిన తర్వాత భర్త తోడిదే లోకం.. కానీ చిత్రంగా కొందరు మహిళలు భర్తను వద్దనుకుంటున్నారు.. దాంతో భౌతికంగా అంతం చేస్తున్నారు.. తాజాగా హైదరాబాద్ శివార్లలో కార్పెంటర్ నాగరాజు హత్య, గతంలో నాగర్ కర్నూల్ లో సుధాకర్ రెడ్డి హత్య.. ఈ రెండు హత్యలూ దిగ్ర్భాంతి కలిగించాయి.. ఈ రెంటిలోనూ భార్యలే నేరస్థులు. వారి ప్రోద్బలంతోనే ప్రియుళ్లు రంగంలోకి దిగి వారిని చంపేందుకు ఓ చెయ్యి వేశారు.

ఈ హత్యలు ప్రశాంతమైన జన జీవితాన్ని ఒక్క కుదుపు కుదిపేశాయి. మహిళలు ఎందుకింత దారుణంగా తయారవుతున్నారు? నాగర్ కర్నూల్ లో ప్రియుడికోసం భర్త సుధాకర్ రెడ్డిని అత్యంత దారుణంగా హతమార్చిన స్వాతి ఇప్పుడు జైలు జీవితం గడుపుతోంది. భర్తను చంపేసిన పశ్చాత్తాపం ఆమెలో ఇసుమంతైనా లేదని.. జైలులో యోగా చేస్తూ చాలా నిబ్బరంగా ఉంటోందని తెలుస్తోంది.

కట్టుకున్న భర్తను కాదనుకుని ప్రియుడు రాజేష్ వ్యామోహంలో మునిగిపోయింది స్వాతి. భర్త లేని సమయంలో తరచుగా వచ్చి వెడుతూ స్వాతికి దగ్గరయ్యాడు రాజేష్.. వీరి వ్యవహారం తెలిసిన భర్త సుధాకర్ రెడ్డి స్వాతిని వారించాడు.. కోపంతో చేయి కూడా చేసుకున్నాడు.. దంపతులిద్దరి మధ్యా సంబంధాలు ఇలా దెబ్బతిన్నాయి. వీరిద్దరికి ముద్దులొలికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు..పిల్లలను, భర్తను సైతం కాలదన్ని ప్రియుడిపై వ్యామోహం స్వాతిలో ఎలా కలిగింది? భర్త అడ్డును తొలగించుకుని ఆ స్థానంలో ప్రియుడిని తెచ్చి అతగాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఆపై పిల్లలతో సహా పూనా చెక్కేయాలనే మెగా స్కెచ్ వేసింది స్వాతి.

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తపై రోకలితో దాడి చేసి ఒకరు.. దిండుతో ఊపిరాడకుండా మరొకరు.. ఇద్దరూ కలసి దారుణంగా చంపేశారు..ఆపై శవం కూడా దొరక్కుండా కాల్చేశారు. భర్త ప్లేస్ లోకి రాడానికి రాజేష్ ముఖాన్ని పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడు.. ఆపై ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.. రాజేష్ ను సుధాకర్ గా చెప్పి హాస్పిటల్ లో జాయిన్ చేసిన స్వాతి.. ట్రీట్ మెంట్ కూడా ఇప్పించింది.. రాజేష్ నే సుధాకర్ అనుకున్న తల్లి దండ్రులు వైద్య ఖర్చులు కూడా భరించారు..కానీ రాజేష్ భయపడుతుండటం, వైద్యంలో భాగంగా మటన్ సూప్ అందిస్తే తాగక పోడంతో తల్లి దండ్రులకు అనుమానం వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి తీగ లాగితే..అసలు గుట్టు బయటపడింది. ప్రియుడినే భర్త అని నమ్మించిన స్వాతి చివరకు జైలు ఊచలు లెక్కబెడుతోంది.

ఈ సంఘటన జరిగి పట్టుమని15 రోజులైనా గడవకముందే హైదరాబాద్ శివార్లలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కార్పెంటర్ నాగరాజు కూడా దారుణంగా హత్యకు గురయ్యాడు ఈ హత్యకు ప్లాన్ చేసింది స్వయంగా నాగరాజు భార్యేనని విచారణలో తేలింది. ఇక్కడా వివాహేతర సంబంధమే హత్యకు ప్రేరణ అయింది.

మహబూబ్ నగర్ జిల్లా రాచర్లకు చెందిన జ్యోతి నాచారంలోని మేనమామ ఇంటికి తరచుగా వెళ్లి వస్తుండేది ఈ క్రమంలోనే ఇంటి పక్కనున్న కార్తీక్ తో పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లిచేసుకోవాలనుకుంటున్న టైమ్ లో తల్లి దండ్రులు జ్యోతిని నాగరాజు అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. వీరు హైదరాబాద్ లోనే కాపురం పెట్టారు కొన్నాళ్లకు జ్యోతి మళ్లీ కార్తీక్ ను కలిసింది. అప్పటినుంచి వారి మధ్య సాన్నిహిత్యం మళ్లీ పెరిగింది. విషయం తెలిసిన నాగరాజు జ్యోతిని వారించాడు.. హెచ్చరించాడు.. దాంతో జ్యోతి మళ్లీ కొంతకాలం సైలెంట్ అయ్యింది..కానీ జ్యోతి మళ్లీ కార్తీక్ ను కలిసింది. నాగరాజు అడ్డును తొలగించుకుంటే.. తమకిక ఇబ్బందులుండవని చంపేందుకు ఇద్దరూ పక్కా స్కెచ్ వేశారు.. భర్తకు నిద్ర మాత్రలిచ్చి.. మత్తులోకి జారుకోగానే కార్తీక్ కు ఫోన్ చేసింది జ్యోతి.. ఇద్దరూ కలసి నాగరాజు ముఖంపై దిండుతో బలంగా అదిమి చంపేశారు.. ఆ తర్వాత అద్దెకు తెచ్చిన కారులో మృతదేహాన్ని నగర శివార్లలోని చౌటుప్పల్ దగ్గర పొదల్లో పడేశారు.

ఇక ఇది మరో ఘటన.. ప్రేమించిన బావను కాదని మరొకరితో పెళ్లి చేశారు తల్లి దండ్రులు.. కానీ బావతోనే జీవితం అనుకున్న శ్రీవిద్య అనే మహిళ భర్తకు పాలల్లో సైనైడ్ కలిపి తాగించింది.. ఆ భర్త క్షణాల్లో ప్రాణం విడిచాడు.. భయంకరమైన ఈ మాస్టర్ ప్లాన్ అమలుకి శ్రీవిద్యకి సొంత బావతో పాటూ మరో ఇద్దరు సహకరించారు, మరో ఇద్దరితో కలసి స్కెచ్ వేసింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

మూడు ముళ్లు.. ఏడడుగులు.. ముద్దులొలికే చిన్నారులు.. ఇవేవీ వారిని సంతృప్తి పరచలేకపోతున్నాయ్.. వివాహేతర బంధాల కోసం భర్తలను బలి తీసుకుంటున్నారు కొందరు భార్యలు ..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ జరిగిన అయిదు ఘటనలకు అక్రమ బంధాలే కారణం. క్షణికమైన సుఖాల కోసం నూరేళ్ల నిండు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు..వివాహేతర సంబంధాల మోజులో భర్తలను చంపి జైలు పాలవుతున్నారు భార్యలు..

స్వాతి, జ్యోతి ఈ రెండు కేసుల్లోనూ ఇంచుమించు ఒకే సూత్రం ఆధారంగా హత్యలు జరిగాయి. భర్తపై వ్యతిరేకత.. పరాయి పురుషుడిపై మోజు.. పెళ్లంటే నూరేళ్ల పంట. అగ్ని సాక్షిగా, వేద మంత్రాల మధ్య జరిగిన పెళ్లిళ్లను తృణప్రాయంగా భార్యలే త్యజించడం విచిత్రంగా కనిపిస్తోంది. సాధారణంగా అక్రమ సంబంధాల్లో ప్రియుడి చొరవే ఎక్కువగా కనిపిస్తుంది.. కానీ.. ఇక్కడ భర్తల అడ్డుతొలగించుకోడంలో భార్యలే మాస్టర్ స్కె,చ్ వేశారు.. కడదాకా తోడుండే భర్తను కాలదన్నుకుని చంపేసేంత కర్కశత్వం మహిళల్లో ఎందుకు కలుగుతోంది.

మహిళల్లో కలుగుతున్న ఈ మార్పును ఎలా అర్ధం చేసుకోవాలి? తాము కోరుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించాలన్న ఆలోచనలెందుకు కలుగుతున్నాయి. భర్తలపై అయిష్టత, పరపురుషునిపై వ్యామోహం సమాజాన్ని, కుటుంబాన్ని, బాధ్యతలను, అనుబంధాలనూ తెంచేసుకునేంత తెగింపు కు దారితీస్తోంది. కట్టుబాట్లు, సెంటిమెంట్లు,నైతిక బాధ్యత, సాంఘీక నియమాలు ఇవేమీ అడ్డుకట్ట వేయలేకపోతున్నాయ్.

ప్రేమించిన వ్యక్తితో జీవితం కోరుకోడం తప్పు కాదు.. కానీ అందుకు మరొకరిని బలి తీసుకోవడం ఎందుకు? విడాకులిచ్చి .. ప్రియుడినే పెళ్లి చేసుకుంటే కలిగే నష్టమేంటి? వీరి మధ్య తగాదాలకు పిల్లలు బలయిపోవాలా? తల్లి దండ్రుల మధ్య సాన్నిహిత్య బంధం లోపించడం ఎదిగే పిల్లలపై కూడా ప్రభావం కలిగిస్తుంది. స్వాతి, జ్యోతి.. ఇద్దరూ తమ భర్తలను దారుణంగా చంపేశారు.. ప్రియుల కోసమే ఈ పనిచేశారు.. స్వాతిపై టివి సీరియళ్ల ప్రభావం చాలా ఉంది. తన ప్లాన్ కు ప్రేరణ మనసు మమత అనే సీరియలే నని నిందితురాలు స్పష్టం చేసింది. చేసిన పనికి పశ్చాత్తాపం కూడా కలగనంత మూర్ఖత్వంలో ఉంది స్వాతి.

ఇక జ్యోతి.. ప్రియుడితో జీవితం కోసం భర్తనే కడతేర్చింది.. అయిష్టతతో కూడిన సంసార బంధం తెంచుకోడం తప్పు కాదు.. కానీ ప్రాణాలను తీయడం మాత్రం ముమ్మాటికీ నేరమే... అందమైన సంసారం, మమతల అనుబంధాన్ని ఆస్వాదించకుండా, బాధ్యతలను పంచుకోకుండా పర పురుషులపై మోజుతో అసలుకే ఎసరు తెచ్చుకుంటున్న వీరిలో మార్పు ఎప్పుడొస్తుంది?

ఇది అందరినీ ఉద్దేశించి చేస్తున్న కామెంట్ కాదు.. మహిళలంతా ఇలాగే ఉన్నారనీ కాదు.. ఇష్టం లేని వివాహ జీవితాన్ని తెగ తెంపులు చేసుకోడానికి విడాకులున్నాయి.. కోర్టులున్నాయి.. చట్టాలున్నాయి. కానీ మరొకరి కోసం కుటుంబ బంధాన్ని కాలదన్నేయడం, హత్యలకు పాల్పడటం ఎంత వరకూ సమంజసం? సవ్యంగా సాగుతున్న సంసారంలో చీడ పురుగులాంటి వివాహేతర బంధాలను దూరం పెట్టాలన్న ఆలోచన వీరికెప్పుడు కలుగుతుంది?

Show Full Article
Print Article
Next Story
More Stories