ఆ తుపాకీ మాకొద్దు.. సామాజిక పరిణామాల అంచనాలో విఫలమవుతున్న పార్టీ

x
Highlights

ఆదర్శ సమాజం అనే అంతిమ లక్ష్యం కోసం తుపాకీ పట్టిన మావోయిస్టులు క్రమంగా పట్టు కోల్పోతున్నారు. మావోయిస్టుల్లో చిరకాలం చిత్తశుద్ధితో పనిచేసిన ఎంతోమంది...

ఆదర్శ సమాజం అనే అంతిమ లక్ష్యం కోసం తుపాకీ పట్టిన మావోయిస్టులు క్రమంగా పట్టు కోల్పోతున్నారు. మావోయిస్టుల్లో చిరకాలం చిత్తశుద్ధితో పనిచేసిన ఎంతోమంది కీలకమైన నాయకులే వరుస లొంగిపోతూ ఉండడం ఆ పార్టీ సిద్ధాంతాన్ని కూడా చర్చాంశంగా మారుస్తోంది. తాజాగా లొంగిపోయిన నరసింహారెడ్డి కూడా వ్యక్తిగత అంశాల కన్నా సైద్ధాంతిక విభేదాలకే ప్రాధాన్యతనివ్వడం విశేషం.

దాదాపు 33 ఏళ్లు మావోయిస్టు పార్టీలో పనిచేసిన జంపన్న మావోయిస్టు పార్టీలో నెలకొన్న సైద్ధాంతిక వైరుధ్యాలను చూచాయగా లోకానికి చాటారు. ఇంతకుముందు లొంగిపోయిన చాలా మంది నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. పోలీసులకు లొంగిపోయిన జంపన్న పార్టీలో కొనసాగుతున్న క్రమంలోనే మానసిక పరివర్తనకు లోనయ్యాడు. తుపాకీ భుజాన వేసుకున్నప్పటికీ మనసులో రేగుతున్న అనేక భావాలకు మావోయిజంలో జవాబు దొరకదనిపించింది. ఆయన చెప్పిన మాటల ప్రకారం తన అనుమానాలు తీర్చే నాయకత్వ పరిణతి కూడా మావోయిస్టు నేతల్లో లేదనిపించింది. అందుకే తాను పార్టీ వీడేటప్పుడు ఓ లేఖ రాసి దాన్ని అగ్రనాయకత్వానికి పంపినట్లు చెప్పారు. తన నిర్ణయం తెలుసుకున్న సీనియర్లు జంపన్న అనుమానాలేవి ఉన్నా పార్టీ వేదికల మీద చర్చించుకోవచ్చని చెప్పినా.. ఆయన కన్విన్స్ కాకపోవడం గమనార్హం. తన భావాలను చర్చించే అవకాశాన్ని కూడా జంపన్న వినియోగించుకోలేదు.

1980ల్లో ఉన్న సమాజ పోకడలు ఇప్పుడు లేవని, తాజా పరిస్థితులకు అనుగుణంగా పార్టీ లైన్ మార్చాల్సి ఉన్నా అందుకు అగ్రనాయకత్వం సుముఖంగా లేదని కూడా జంపన్న అభిప్రాయపడుతున్నారు. చర్చించి లాభం లేదనుకొని గ్రహించడం వల్లే అగ్రనాయకత్వంతో భేటీకి జంపన్న ఇష్టపడలేదు. అసలు మార్పుకు మావోయిస్టు నేతలు ఒప్పుకోరన్న అభిప్రాయమే జంపన్న వ్యక్తం చేస్తుండడం గమనించాల్సిన అంశం. అంతేకాదు ఒకవేళ మావోయిస్టులు నిజంగానే మారినా మళ్లీ అటువైపు వెళ్లనని కూడా ఆయన తేల్చి చెబుతున్నారు. అయితే కనీసం ఈ దశలోనైనా మావోయిస్టులు ఆ దిశగా ఆలోచించాలని మాత్రం కోరుతుండడం విశేషం.

60వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయి అనేక గ్రూపులుగా తయారైన లెఫ్ట్ వింగ్ విభాగాలు అనేక విభేదాలతో వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నాయి. అందరి లక్ష్యమూ ఒకటే అయినా పార్టీ మీద ఆధిపత్యం కోసం జరిగిన పెనుగులాట ఆర్థిక కారణాలు, ప్రాంతీయ విభేదాలు, సామాజిక అంశాలు కూడా కారణాలుగా ఒక దశలో విప్లవ గ్రూపు నాయకుల్లోనే పరస్పర హనననానికి పరిస్థితులు దారి తీశాయి. దీంతో పాటు సామాజిక పరిణామాలను అంచనా వేయడంలో అగ్ర నాయకత్వం ఎప్పుడూ విఫలమవుతూనే ఉందన్న అభిప్రాయాలున్నాయి. మావోయిస్టు పార్టీ పేరుకు రాజకీయ పార్టీయే అయినా దేశమంతా పార్లమెంటరీ పంథాలోనే కొనసాగుతున్నా ఒక రాజకీయ పార్టీగా చెప్పుకునే మావోయిస్టు పార్టీ అందుకు విరుద్ధమైన పోకడలకే పెద్దపీట వేస్తూ వస్తోంది. గద్దర్ లాంటి వ్యక్తులు సైతం పార్టీ నుంచి బయటికి వచ్చినా ఆ పార్టీలో ఉన్న లోపాలపై సరైన చర్చ జరగలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మావోయిస్టు పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బతీసే ఎత్తుగడల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మావోయిస్టు నేతల లొంగుబాటును ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. అయితే లొంగుబాటు ప్యాకేజీతోనైనా కుటుంబాన్ని పోషించుకుందామని జనజీవనంలోకి వచ్చిన అనేక మంది మాజీ మావోయిస్టులకు ఆయా ప్రభుత్వాలు మొండిచెయ్యే చూపాయి. వారి లక్ష్యం రికార్డుల కోసం మావోయిజాన్ని అణచివేయడమే తప్ప అటువైపు ఆకర్షితులైనవారి జీవితాల్లో వెలుగులు పూయించాలన్న చిత్తశుద్ధి లేకపోవడమే కారణం. అయితే కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చిన తరువాత పంథా పూర్తిగా మారిపోయింది. తీవ్రవాదాన్ని బహుముఖాలుగా ఎదుర్కొంటామని తుపాకిని తుపాకితో ఎదుర్కోవడమే గాక ప్రజాసంక్షేమ ఫలాలను కూడా ఆ వర్గాలకు అందజేస్తామని ప్రకటించడం విశేషం. అందులో భాగంగానే ప్రస్తుత తెలంగాణ సర్కారు కూడా మావోయిస్టుల కోసం సంక్షేమ ప్యాకేజీలను మరింత పకడ్బందీగా అమలు చేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వాలు ఇలా బహుముఖ పద్ధతుల్లో మావోయిజాన్ని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆ పార్టీలో అసలు అంతర్గత చర్చలు లేకపోవడం, ఉన్నా తూతూ మంత్రంగా ఉంటే కొత్త కేడర్ ను ఎలా ఆకర్షిస్తారు? ఉన్న కేడర్ ను ఎలా నిలుపుకుంటారు? సుదూర లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? ఇవే ప్రశ్నలు మావోయిస్టు నేతలను, ఆ పార్టీ సానుభూతిపరులను ఆలోచింపజేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories