జ‌గ‌న్ క‌క్క‌లేడు..మింగ‌లేడు

Submitted by arun on Sat, 02/03/2018 - 11:01
Y.S. Jagan

అరవాలనుంది..అరవలేకున్నారు. తిట్టాలనుంది...తిట్టలేకున్నారు. పోరాడాలనుంది...పోరాడలేకున్నారు. కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది వైసీపీ పరిస్థితి. బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మిత్రపక్షం తెలుగుదేశమే నోరెత్తుతుంటే, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం నరేంద్ర మోడీ సర్కారుపై గట్టిగా గళమెత్తలేకపోతోంది. పోరాట పంథాకు శ్రీకారం చుట్టలేకపోతోంది. ఎన్నికల ముంగిట్లో అందివచ్చిన ఆయుధాన్ని, వైసీపీ ఎందుకు ప్రయోగించలేకపోతోంది..ప్రాబ్లమేంటి?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆంధ‌్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందన్న చర్చ ఘాటుఘాటుగా జరుగుతోంది. విశాఖ రైల్వేజోన్, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణం, ఇలా అనేక అంశాల్లో బీజేపీ మొండిచెయ్యిచ్చింది. ఇదే ఆఖరి పూర్తిస్తాయి బడ్జెట్‌ అని తెలిసి కూడా, ఎన్నికల ముంగిట్లో విభజన చట్టం హామీలు, వాగ్ధానాలను పక్కనపెట్టేసింది. దీనిపై బీజేపీ మిత్రపక్షం, తెలుగుదేశం కేంద్రం తీరుపై మండిపడుతోంది. మోడీతో తాడోపేడో అన్నట్టుగా కూడా కొందరు నేతలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్దమవుతున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షం వైస్ఆర్‌ కాంగ్రెస్‌ మాత్రం, బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని అంటున్నా, మోడీ సర్కారుపై గట్టిగా మాట్లాడలేకపోతోంది. 

ఏపీకి నిధులు సాధించడంలో అధికార పార్టీ విఫలం అయ్యిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులకు భయపడే జగన్ కేంద్రంపై పోరాటానికి సిద్దంగా లేరని, ఇప్పటకే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇపుడు బడ్జెట్ లో జరిగిన అన్యాయంపైనా స్పందించకపోతే ఈ ఆరోపణలకు బలం చేకూర్చినట్టు ఉంటుందని, పార్టీ నేతలు మధనపడుతున్నారు.

అయితే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, అది పార్టీకి ఇబ్బందన్న భావన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే, ఎంపీలుతో రాజీనామా చేయిస్తానని, వైసీపీ అధినేత జగన్ గతంలో ప్రకటించారు. ఎన్నికల ముంగిట్లో బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీలు రాజీనామాలు చేస్తే బావుంటుందని, ప్రజల్లో మైలేజ్‌ పెరుగుతుందని, పార్టీలో కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ కానీ, పార్టీ ఎంపీలు కానీ రాజీనామాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

మొత్తమ్మీద, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వైసీపీకి తలనొప్పులు తెచ్చి పెట్టింది. వ్యతిరేక గళమెత్తితే మోడీ నుంచి ముప్పు, లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుందో చూడాలి.

English Title
Why Is jagan Silent On Budget?

MORE FROM AUTHOR

RELATED ARTICLES