రజినీకి కలిసొచ్చేవేంటి?

Submitted by arun on Tue, 01/02/2018 - 12:08
Rajinikanth

45 ఏళ్ల వయసులో రాజకీయంగా అవకాశమొచ్చినా వదులుకున్నాను, 68 ఏళ్ల వయసులో పదవిపై ఆశ ఉంటుందా అని రజినీకాంత్ అన్నారు. మరి పాలిటిక్స్‌లోకి అప్పుడు రాని రజినీ, ఇప్పుడెందుకు వస్తున్నారు...రజినీకి కనిపిస్తున్న నాలుగు అనుకూలతలేంటి...న్యూఇయర్‌లో న్యూపార్టీ అంటున్న రజినీకి కలిసొచ్చేవేంటి?

తమిళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా?
కుక్కలు చింపి విస్తరి. ప్రస్తుత తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే మంచి మాట మరోటి లేదేమో. అమ్మ జయలలిత చనిపోయిన తర్వాత, చెన్నై పాలిటిక్స్‌ దశ దిశా లేకుండాపోయాయి. అధికార అన్నాడీఎంకే ముక్కచెక్కలైంది. పన్నీరు, పళనీ మొదట కొట్టుకుని ఒక్కటైనా, జయలలిత నెచ్చెలి శశికళ జైల్లో ఉన్నారు. మొన్న ఆర్కే నగర్‌ ఎన్నికల్లో దినకరన్ గెలిచాడు. అటు అన్నాడీఎంకే, ఇటు డీఎంఎకేను  కాదని, జనం దినకరన్‌కు ఓటేశారంటేనే అర్థమవుతోంది జనం ప్రస్తుత రాజకీయ పార్టీలపై ఎంత ఆగ్రహంతో రగిలిపోతున్నారో....అంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.

జయ మరణంతో రాజకీయ శూన్యత
జయ మరణం తర్వాత తమిళనాడులో పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. ఈ రాజకీయ శూన్యతే, రజినీని రారమ్మంటోంది. ఈ గ్యాప్‌ను ఫిలప్‌ చేయతగ్గవారిలో రజినీకి మించిన నాయకుడు ఇప్పుడు, తమిళనాడులో కనపడ్డం లేదు. అంటే, రాజకీయ శూన్యత రజినీకి రెడ్‌ కార్పెట్ పరుస్తోంది.

ఎంజీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ నటుడు
తమిళనాడు సినిమా తెరపై ఒక వెలుగు వెలిగిన నటుడు ఎంజీఆర్. తర్వాత జయలలిత. ఆ తర్వాతిస్థానం నిస్సందేహంగా రజినీకాంత్‌దే. తనకే సొంతమై మేనరిజమ్స్, డైలాగ్స్, పేద-ధనిక తారతమ్యంపై మానవీయ మాటలు, పాటలు, ప్రత్యర్థులకు దిమ్మదిరిగే పవర్‌ఫుల్ పంచెస్ ఇలా సకల కళా వల్లభుడిగా సౌతిండియన్‌ తెరను ఏలుతున్నాడు రజినీకాంత్. ఎంజీఆర్ తర్వాత తమిళనాడు ప్రజల గుండెల్లో నిలిచిన నటుడు తలైవా. భాషా, నరసింహ, బాబాతో పాటు అనేక  చిత్రాల్లో రాజకీయాలపై తనదైన డైలాగ్స్ వేసి, ఎప్పటికైనా పాలిటిక్స్‌లోకి వస్తానని హింట్స్ ఇచ్చాడు. ఇప్పుడు నిజం చేస్తున్నాడు. రజినీ సినిమా ప్రస్థానం, రాజకీయానికి రాచబాట పరుస్తోంది.

జనాలకు రజినీని మించిన ప్రత్యామ్నాయం లేదా?
రజినీకాంత్‌ గొప్ప నటుడు. మానవతావాది. ఆధ్మాత్మిక చింతనాపరుడు. ఒక్క అవినీతి మచ్చాలేదు. రీమార్క్‌ అనేది లేకుండా ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఎదిగారు. రజినీకాంత్‌ వ్యక్తిత్వమే కొండంత అండ. కబాలీనే చెప్పినట్టు, 1996లో తనకు రాజకీయ అవశామొచ్చినా వద్దనుకున్నాడు. 2014లో మోదీ స్వయంగా ఇంటికొచ్చి విన్నవించినా మద్దతు ప్రకటించలేదు. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ జయ తర్వాత, ఎవరైనా బలమైన, ప్రజాకర్షక నాయకుడు ఉన్నాడంటే, అది రజినీకాంతే. కమల్‌హాసన్‌ ఉన్నా, ఆయన పట్టణ మేధావి వర్గం మద్దతు పొందగలడు. గ్రామస్థాయిలో తలైవాకున్న ఫాలోయింగ్ వేరు. పళనీ, పన్నీరుపై జనానికి నమ్మకం లేదు. కరుణానిధి స్థానంలో స్టాలిన్‌ ఉన్నా, ప్రజాకర్షక నాయకుడు కాదు. ఎంత జల్లెడపట్టినా, రజినీని మించిన ప్రత్యామ్నాయం మరోటి లేదు తమిళ ప్రజలకు. 

రాజకీయ తెరపైనా వీరతిలకం దిద్దుతారు
సినిమా రంగాన్ని, రాజకీయాన్ని వేరుచేసి చూడలేని పరిస్థితి తమిళనాడులో. డీఎంకే అధినేత కరుణానిధి గొప్ప సినీ కథా రచయిత, ఎంజీఆర్ అజరామర నటుడు. జయలలిత, వెండితెర వీరనారి. పరిస్థితుల ప్రభావమో, కాలం కలిసిరావడమో కానీ, ముగ్గుర్నీ తమిళ ప్రజలు ఆదరించారు. ముఖ్యమంత్రులను చేశారు. వీరే కాదు, విజయకాంత్, శరత్‌ కుమార్‌తో పాటు అనేకమంది నటులు తమిళ రాజకీయాల్లో ఉన్నారు. వెండితెరమీదనే కాదు, రాజకీయ తెరమీద కూడా తాము మెచ్చిన నటులను నాయకులుగా వీరతిలకం దిద్దడానికి సిద్దంగా ఉంటారు తమిళ ప్రజలు. ఇప్పడు ఆ కోవలోకి రజినీకాంత్‌ చేరుతున్నాడు.

English Title
Who Can Be Rajinikanth's Role Model

MORE FROM AUTHOR

RELATED ARTICLES