వందమంది రేపిస్టులను ఇంటర్వ్యూ చేసిన మధుమిత

వందమంది రేపిస్టులను ఇంటర్వ్యూ చేసిన మధుమిత
x
Highlights

వందమంది రేపిస్టులను ఇంటర్వ్యూ చేసిన ఆమె తెగువను చూసి అందరూ అవాక్కయ్యారు. నేరారోపణకు గురైనవారే కాదు, నేరం రుజువైనవారిని కూడా మధుమిత పాండే కలిశారు....

వందమంది రేపిస్టులను ఇంటర్వ్యూ చేసిన ఆమె తెగువను చూసి అందరూ అవాక్కయ్యారు. నేరారోపణకు గురైనవారే కాదు, నేరం రుజువైనవారిని కూడా మధుమిత పాండే కలిశారు. వీరిని నరరూప రాక్షసులుగా అందరూ ముద్ర వేస్తుంటే అసలు వీళ్లు దుర్మార్గులుగా మారడం వెనుక కారణాలను అన్వేషించడంలో బిజీ అయిన పాండే కనుగొన్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

క్రిమినాలజీలో డాక్టరేట్ కోసం..
బ్రిటన్ యూనివర్సిటీలో క్రిమినాలజీ డిపార్ట్‌మెంట్‌లో పరిశోధన కోసం ఈ సాహసానికి దిగిన మధుమిత పాండే పరిశోధన సమాజానికి కనువిప్పు కలిగించే అంశాలను వెలుగులోకి తెచ్చింది. తన ఈడువారితో పోల్చితే సమాజం పట్ల అంకితభావం కనబరిచే విద్యార్థులు తక్కువమంది కనిపిస్తారు.

చాలామంది నిరక్షరాస్యులే
తాను కలిసిన రేపిస్టుల్లో అత్యధికులు నిరక్షరాస్యులేనని మధుమిత వెల్లడించారు. స్కూల్ డ్రాపౌట్స్ కూడా వీరిలో కొందరు ఉన్నారని అయితే వారిని కలిసే వరకూ తను ఇలాంటి వారిని మృగాలుగానే భావించినట్టు మధుమిత వెల్లడించారు. కానీ అత్యంత సాధా రణమైన వీరు పైశాచిక ఆనందంకోసం రెచ్చిపో యినట్టు తేలిందని మధుమిత స్పష్టం చేస్తున్నారు.

సమర్థించుకునే వారు ఎక్కువే..
అయితే తాను కలిసిన రేపిస్టుల్లో అత్యధికులు తమ చర్యను గట్టిగా సమర్థించుకున్నారని, మరికొందరైతే అసలు అత్యాచారం జరగనేలేదని దబాయిస్తున్నట్టు మధుమిత వివరిస్తున్నారు. కేవలం ముగ్గురో నలుగురో మాత్రం తాము చాలా విచారిస్తున్నట్టు తనతో చెప్పారంటోంది. మరో కొత్త ఫెమినిస్ట్ వచ్చిందంటారు. తన పరిశోధనను మరి కొన్ని నెలల్లో పబ్లిష్ అవుతుందని మధుమిత ఆనందంగానే ఉన్నా.. ‘ఆ ఇదిగో చూడండి మరో కొత్త ఫెమినిస్ట్ వచ్చింది’ అంటూ తనను గేలిచేస్తారని, పురుషులను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నానని కామెంట్లుకూడా చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీహార్ జైలుకెళ్లి..
మధుమిత పాండే 22 ఏళ్ల ప్రాయంలోనే తీహార్ జైలుకు వెళ్లింది. అసలు అత్యాచారాలకు పాల్పడేందుకు వీరిని ప్రేరేపించిన విషయాలను తెలుసుకునే క్రమంలో నిర్భయ దాష్టీకానికి పాల్పడ్డ మానవ మృగాలను కూడా కలిసింది.

రేపిస్టులు గ్రహాంతరవాసులు కారు..
అఘాయిత్యాలకు పాల్పడ్డ వీరెవ్వరూ గ్రహాంతర వాసులు కారు.. మన సంఘంలోని సభ్యులే.. కానీ వీరిలో ఎక్కువంది ఇలాంటి పనులకు పాల్పడేందుకు ఎలాంటి ప్రణాళిక వేసుకోలేదని చాలా మంది వెల్లడించారని మధుమిత చెప్పడం విశేషం. వీరికి చాలా విషయాలపై అవగాహన లేక, అఖరుకు అవగాహన కల్పించేవారు లేకపోవడంతోనే ఈ దారుణాలకు ఒడిగట్టారు. అందుకే చిన్నతనం నుంచి లైంగిక విద్యా బోధన చాలా అవసరం, అప్పుడే ఇలాంటి దాష్టీకాలకు అడ్డుకట్ట వేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని మధుమిత అభిప్రాయపడుతున్నారు. యువకులు చెడుదారులు పట్టేందుకు తల్లిదండ్రులు కూడా వారికి అవసరమైన విజ్ఞానాన్ని అందించకపోవడం మరో ప్రధాన కారణంగా ఈమె వెల్లడించారు.

49 ఏళ్ల రేపిస్టు చెప్పినదేమిటంటే..
అవును నేను ఓ అమాయకమైన 5 ఏళ్ల అన్నంపున్నెం తెలియని చిన్నారిని రేప్ చేశాను.. ఆమె పెద్ద అయ్యాక తనను ఎవ్వరూ వివాహం చేసుకోరు.. జైలునుంచి విడుదలయ్యాక నేనే ఆమెని వివాహం చేసుకుంటా..ఇలాంటి పని చేశాను ఏమిటా అని నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది.. అంటూ 49 ఏళ్ల రేపిస్టు మధుమితతో తన నేరాన్ని అంగీకరించాడు. ఇది విన్న మధుమిత ఇంతకీ బాధిత చిన్నారి ఎక్కడుందని అన్వేషణకు దిగినట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో చిన్నారి కుటుంబాన్ని కలిసింది. అయితే అసలు ఆ దుర్మార్గుడి కి శిక్షపడి జైల్లో ఉన్నట్టు తమకు అస్సలు తెలియదని ఆ కుటుంబం వెల్లడించింది. అతనికి కేవలం 10 ఏళ్ల జైలుశిక్ష విధించారా ? అదేంటి ఉరి తీయలేదా? అంటూ ఆ కుటుంబం మధుమితను అడిగితే ఇదే సందేహం మధుమితకు కూడా వచ్చిందట. అవును నిర్భయ నిందితులను ఉరితీశారు, మరి అదే న్యాయం వీరికి కూడా జరగాలిగా అని తాను భావించానని మధుమిత చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబానికి ఇవ్వడానికి తనవద్ద సమాధానం లేదని ఈమె వాపోతున్నారు.

3 ఏళ్లలో వంద మందిని ఇంటర్వ్యూ చేసింది. 90 శాతం అఘాయిత్యాలు అస్సలు రిపోర్ట్ కానేకావు. 2015 లో 34,651 అత్యాచారాలు మనదేశంలో అధికారికంగా నమోదయ్యాయి. కానీ అనధికారికంగా ఎంతమంది ఇలాంటి బాధిత మహిళలున్నారో లెక్క తేల్చి చెప్పడం మాత్రం కష్టం అంటున్నారు మధుమిత. ఇక మన దేశంలో చిన్నారులపై జరిగే లైంగిక దాడులు లెక్కలేదు. 2015లో దేశవ్యాప్తంగా చిన్నారులపై జరిగిన లైంగిక దాడుల సంఖ్య 10,854కు పైమాటే.

ప్రజల అంతరాత్మ మారితే తప్ప మహిళలకు రక్షణ ఉండదని.. కేవలం చట్టాలు, కోర్టులు, పోలీసులు ఏమీ చేయలేరని.. వీరంతా నష్టం జరిగాక రంగంలోకి దిగుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె తేల్చడం సమాజాన్ని ఆలోచింపజేస్తోంది.
- కరణం భార్గవి

Show Full Article
Print Article
Next Story
More Stories