సీబీఐలో అవినీతి కలకలం

సీబీఐలో అవినీతి కలకలం
x
Highlights

నేర పరిశోధన, నేర నిరూపణల్లో తనదైన ముద్ర వేసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐ ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది. ఇప్పటికే రాజకీయ నేతల కబంధ హస్తాల్లో...

నేర పరిశోధన, నేర నిరూపణల్లో తనదైన ముద్ర వేసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐ ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది. ఇప్పటికే రాజకీయ నేతల కబంధ హస్తాల్లో పంజరంలో చిలకగా మారిన సంస్ధ ఉన్నతాధికారుల ఆధిపత్య పోరుతో వ్యక్తిగత ప్రతిష్ట కూడా మంటగలుస్తోంది. తాజాగా సంస్ధలో నెంబర్‌ టూగా ఉన్న అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దేశ చరిత్రలో మునుపెన్నడు లేని రీతిలో అత్యున్నత స్ధాయి సంస్ధలో అత్యున్నత అధికారిపై సొంత సంస్ధే అవినీతి కేసు నమోదు చేసింది.

హవాలా మార్గంలో భారీ మొత్తంలో నగదును విదేశాలకు చేరవేస్తున్నట్టు ఢిల్లీకి చెందిన మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో తన పేరు తొలగించేందుకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సాన సతీశ్‌ బాబును కలిసారు. దీంతో దుబాయికి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ మనోజ్‌ ప్రసాద్‌తో సతీష్‌బాబు చర్చలు సాగించారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్న ఆస్థానాకు చెందిన వ్యాపార లావాదేవీలను తన సోదరుడు సోమేశ్‌ ప్రసాద్‌ చూస్తున్నట్టు మనోజ్ ప్రసాద్ తెలిపాడు. తనకు ఐదు కోట్లు ఇస్తే ఖురేషీ పేరును తొలగిస్తానంటూ చెప్పాడు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులతో తనకున్న సంబంధాలను వివరించాడు. నగదు లావాదేవీలపై ఎవరికి అనుమానం రాకుండా తన సోదరుడు సోమేశ్ ప్రసాద్‌‌కు బదిలీ చేయవచ్చని మనోజ్‌ ప్రసాద్‌ సూచించాడు. దీంతో డీల్‌కు రంగం సిద్ధమైంది.

ఈ విషయాన్ని గుర్తించిన సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మ మనోజ్ ప్రసాద్ నుంచి ఆస్ధానాకు రెండు కోట్ల రూపాయల లంచం ముట్టినట్టు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. ఇదే సమయంలో లంచం సొమ్ము తీసుకునేందుకు వచ్చిన మనోజ్ ప్రసాద్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా హైదరాబాద్ వ్యాపారవేత్త సాన సతీశ్‌ బాబును ప్రశ్నించిన సీబీఐ నేర శిక్షాస్మృతిలోని 164 సెక్షన్‌ కింద వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీన్ని నేరాంగీకార ప్రకటనగా పరిగణిస్తారు. ఒకవేళ దీని నుంచి అతడు వెనక్కి తగ్గితే అతడిపై కేసు నమోదు చేసే అధికారం సీబీఐకి ఉంటుంది. ఈ వాంగ్మూలం ఆధారంగా ఆస్థానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్‌, వాట్సప్‌, నగదు బదిలీ తరువాత జరిగిన పరిణామాలపై ఆధారాలను సీబీఐ సేకరించింది.

ప్రస్తుతం సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్న ఆస్ధానా గుజరాత్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌, విజయ్‌మాల్యా కేసులను విచారిస్తున్నారు. మెయిన్ ఖురేషి వ్యవహారంలో ఈ ఏడాది ఆగస్టు 24లోనే డైరెక్టర్‌పై ఆరోపణలు చేస్తూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఆస్థానా లేఖ రాశారు. సతీష్ బాబు అనే వ్యక్తి నుంచి రెండు కోట్లు లంచం తీసుకున్నారంటూ ఆరోపించారు. ఈ లేఖపై సీవీసీ విచారణ జరుపుతండగానే ఆస్థానాపై కేసు నమోదు కావడం, ఇందుకు సతీష్ బాబే వాంగ్మూలం ఇవ్వడం పలు ఊహగానాలకు తావిస్తోంది.

ఈ వ్యవహారంలో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో భారత నిఘా సంస్థ ‘రా’కు చెందిన సమంత్‌ గోయెల్‌ పేరు కూడా చేర్చారు. ఖురేషీపై కేసును మూసేయడానికి జరిగిన ప్రయత్నాల్లో సమంత్‌ ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. త్వరలో ఈయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసే అవకాశమున్నట్టు సమాచారం. ‘రా’లో పశ్చిమాసియా వ్యవహారాలను గోయెల్‌ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గోయెల్‌ను సస్పెండ్‌ చేయాలని ‘రా’ అధిపతి ఎ.కె.ధస్మానా.. పీఎంవోకు విజ్ఞప్తి చేశారు. అయితే మొత్తం వ్యవహారంలో సీబీఐలో అవినీతి మరోసారి వెలుగు చూడగా .. సీబీఐ ప్రతిష్ట మరోసారి మసకబారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories