మధ్యప్రదేశ్, మిజోరాంలో మొదలైన పోలింగ్

Submitted by arun on Wed, 11/28/2018 - 10:24
mp

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌, మిజోరంలో పోలింగ్‌ జరుగుతోంది. మధ్యప్రదేశ్‌‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 230  స్థానాలకు ఒకే దశలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్‌ జిల్లాలోని లంజీ, పరస్వాద, బైహర్‌ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే ఓటింగ్‌కు అనుమతిస్తారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 5 కోట్ల 4లక్షల ,95 వేల , 251 మంది ఓటర్లు ఉన్నారు. 

మధ్యప్రదేశ్‌‌లోని మొత్తం  230 అసెంబ్లీ స్థానాలకు గానూ 2 వేల 907 మంది పోటీ పడుతున్నారు. బీజేపీ అన్ని సీట్లలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్‌ 229 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. ఒక స్థానాన్ని లోక్‌ తాంత్రిక్‌ జనతాదళ్‌కు కాంగ్రెస్‌ పార్టీ కేటాయించింది. 227 చోట్ల బీఎస్పీ , 51 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ బరిలో నిలిచాయి. మధ్యప్రదేశ్‌‌లో తొలిసారి పోటీచేస్తున్న ఆమ్‌ఆద్మీ 208 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీ చేయిస్తోంది. గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్‌సింగ్ చౌహాన్ మరోసారి సేహోర్ జిల్లాలోని బుద్నీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై రైతుబిడ్డగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకుడు అరుణ్‌ యాదవ్ బరిలోకి దిగారు. 

మధ్యప్రదేశ్‌‌లో 15 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ వరుసగా నాలుగోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. రహదారులు, మెరుగైన విద్యుత్‌ సరఫరా, ఆకర్షణీయ సంక్షేమ పథకాలు బీజేపీని ఈ సారి కూడా గట్టెక్కిస్తాయని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భావిస్తుండగా ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ గెలవలేమన్న కసితో కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి ఎన్నికలను సవాల్‌గా తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మధ్యప్రదేశ్‌‌లో హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో గెలుపుపై బీజేపీ,  కాంగ్రెస్‌ రెండూ ధీమాగానే ఉన్నాయి.

English Title
Voting started in Madhya Pradesh, Mizoram

MORE FROM AUTHOR

RELATED ARTICLES