ఓటరన్న చైతన్యం.... తెస్తుందా మార్పు రాజకీయం!!

Submitted by santosh on Wed, 11/28/2018 - 10:18
voters awarness

ఆదిలాబాద్‌లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇలా ఓటర్లలలో చైతన్యం ఎగసిపడుతోంది. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు చెబితే, కుదరదని ఢంకా బజాయిస్తోంది. హైదరాబాద్‌తో పాటు కొన్ని నియోజకవర్గాల్లోనే ఇలానే, కొందరు కాలనీవాసులు, హామీలకు బాండ్‌ పేపర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజాప్రతినిధి ఎవరైనా ఇచ్చిన హామికి బాధ్యుడే. ఓట్లకోసం నోటికొచ్చిన హామీలిచ్చి, ఏరుదాటాక తెప్పతగలేసే బాపతు మానుకుంటే మంచిది. ఇప్పటికే తెలంగాణలో చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, ప్రజల నుంచి ఇలాంటి తిరుగుబాటే ఎదురవుతోంది. అందుకే చెప్పింది చెయ్యాలి....చేసేదే చెప్పాలి అంటున్నారు ఓ కాలనీ వాసులు. గడప గడపకూ వచ్చి ఓట్లు అడిగి,  సమస్యల పరిష్కారానికి, అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కట్టుకథలు చెప్పే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే చైతన్యంతో ప్రశ్నిస్తున్నారు.

కుత్భుల్లాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పఠాన్‌చెరు నియోజకవర్గాలలో నివాసముండే, సుమారు 200 కాలనీవాసులు, గతంలోనే, Forum To Improve Things...అనే సంస్థను ఏర్పాటు చేశారు. వీరికి ఏ సమస్య వచ్చినా, ఏకమై పోరాటం చేస్తుంటారు. ఈ మధ్యనే లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రతీ రైలు ఆగాలని, పోరాడి సాధించుకున్నారు. అదే క్రమంలో స్థానికంగా ఉన్న కెమికల్‌ కంపెనీలు వెదజల్లే కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలొస్తున్నాయని అనేక ఆందోళనలు చేశారు. అధికారులు, రాజకీయ పార్టీలను అడిగినా లాభం లేకుండాపోయింది. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో, తిరిగి అభ్యర్థులంతా ఇంటింటికీ వచ్చి ఓట్లడుగుతున్నారని, అయితే తమ సమస్యలు పరిష్కరిస్తామని, స్టాంప్‌ పేపర్‌పై సంతకం చేస్తేనే ఓట్లు వేయాలని, తీర్మానించుకున్నారు కాలనీవాసులు.

కెమికల్‌ కంపెనీలను ఇక్కడి నుంచి తరలిస్తామని హామిఇచ్చినవారికే ఓటేస్తామంటున్నారు కాలనీవాసులు. వాగ్దానం చెయ్యనివారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని, సోషల్ మీడియాలోనూ క్యాంపెయిన్‌ చేస్తామని అంటున్నారు. కాలనీవాసుల స్టాంప్‌ పేపర్‌ డిమాండ్‌పై అభ్యర్థులు వెనకా ముందు ఆడుతున్నారు. అటువైపు వెళ్లడానికి కూడా జంకుతున్నారు. ఒకవైపు ఇప్పటికే హామీలిచ్చి, విస్మరించిన నేతలను, కనీసం గ్రామాల్లోకి రానివ్వడం లేదు జనం. ఇఫ్పుడు స్టాంప్‌ పేపర్లపై సంతకాలు అడుగుతున్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందనడానికి ఈ ఘటనలే నిదర్శనం. ఇదే సమయంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించే మ్యానిఫెస్టో హామీలకు కట్టుబడి ఉండే విధంగా, ఒక చట్టం చేయాలని గతంలోనూ ఎలక్షన్‌ కమిషన్‌కు సూచనలు అందాయి. ఈసీ కూడా చర్చించింది. కానీ ఎందుకనో, ఆ విషయాన్ని పక్కనపెట్టేసింది. నిజంగా మ్యానిఫెస్టో వాగ్దానాలను తుంగలో తొక్కే పార్టీలపై చర్యలు తీసుకునేలా, లేదంటే సదరు అభ్యర్థిని భర్తరఫ్‌ చేసేలా ఒక చట్టం చెయ్యాలని ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే హామీలిచ్చేటప్పుడు పార్టీలు జాగ్రత్తగా ఉంటాయన్న వాదన వినిపిస్తున్నారు.

English Title
voters awarness

MORE FROM AUTHOR

RELATED ARTICLES