విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

Submitted by arun on Thu, 06/14/2018 - 12:35

పుణ్యం కోసం తీర్థయాత్రలకు వెళ్లారు. మరికొద్ది గంటల్లో యాత్రను ముగించుకుని ఇంటికి చేరుబోతున్నామన్న ఆనందాన్ని లారీ మృత్యురూపంలో కబళించింది. విజయనగరం జిల్లాలో జరిగిన భారీరోడ్డు ప్రమాదం... వారి కుటుంబాల్లో ఒక్క సారిగా విషాదం నింపింది. అప్పటివరకు యాత్ర విశేషాలను తోటివారితో పంచుకుంటున్న వారు ఒక్కసారిగా విగతజీవులుగా పడి ఉండటం కలచివేసింది. కాళ్లు కోల్పోయి కొందరు... చేతులు కోల్పోయి మరికొందరు... ప్రాణాప్రాయ స్థితిలో ఇంకొందరు ఘటనా స్థలంలో పడి ఉండటం అందర్నీ చలించివేసింది.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉత్తరాది పుణ్యక్షేత్రాల యాత్రను పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయిన టూరిస్టు బస్సును... ఒక డంపర్ మృత్యు రూపంలో కబళించింది. భక్తులను గమ్యస్థానాలకు చేర్చేందుకు వెళ్తున్న బస్సును... అదుపుతప్పిన డంపర్ వాహనం బలంగా బస్సు మధ్యలో ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో 40 మంది యాత్రికులు తీవ్ర గాయాలపాలై బస్సులో చిక్కుకుపోయారు. తమను రక్షించండంటూ వారు చేసిన ఆర్తనాదాలతో స్థానికులు చలించిపోయారు.

ఈనెల 2వ తేదీన విశాఖ జిల్లా యలమంచిలి, ఎస్ రాయవరం మండలాలకు చెందిన సుమారు 40 మంది భక్తులు ఉత్తరాది తీర్థయాత్రల కోసం ఓ ప్రైవేట్ బస్సులో వెళ్లారు. తమ యాత్రను పూర్తి చేసుకుని ఉదయం శ్రీకాకుళం చేరుకున్నభక్తులు అరసవెళ్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం విజయనగరం జిల్లా గోవిందపురంలో భోజనం చేసి సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తమ యాత్రను ముగించుకుందామనుకున్నారు. కానీ ఇంతలోనే కొద్ది క్షణాల్లో ఘోర ప్రమాదం జరిగింది. లారీ వారి పాలిట మృత్యువులా మారింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా, క్షతగాత్రులు విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 

English Title
vizianagaram Accident Updates

MORE FROM AUTHOR

RELATED ARTICLES