రికార్డుల రారాజు

Highlights

టీంఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఫార్మెట్ ఏదైనా సరే తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించాడు . తాజాగా శ్రీలంకతో...

టీంఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఫార్మెట్ ఏదైనా సరే తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించాడు . తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో డబుల్ సెంచరీ సాధించి చరిత్ర స్రుష్టించాడు. కెప్టెన్ గా ఆరు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా సరికొత్త రికార్డు నమోదు చేశాడు . ఇటీవలే 200 వన్డేల క్లబ్ లో చేరడంతో పాటు అత్యంత వేగంగా 8వేల పరుగులు సాధించిన విరాట్ కొహ్లీ తాజా రికార్డులపై హెచ్ఏంటీవీ స్పెషల్ ఫోకస్.

టీమిండియా కెప్టెన్ , రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులోనూ కోహ్లీ డబుల్ సెంచరీ చేసి సరి కొత్త రికార్డు నెలకొల్పాడు. 238 బంతుల్లో 201 పరుగులు చేసిన కోహ్లీ.. తన కెరీర్‌లోనే కాదు కెప్టెన్‌గా కూడా 6వ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 287 బంతుల్లో 25 బౌండరీలతో 243 పరుగులు చేసి చివరకు సండాకన్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో 1932 నుంచి 2015 వరకు జరిగిన మ్యచ్ ల్లో కేవలం నలుగురు భారత కెప్టెన్లు మాత్రమే ఒక్కో డబుల్‌ సెంచరీ సాధించారు. కానీ విరాట్‌ మాత్రం సారధిగా ముందుండి నడిపించడంలో తనకు తానే సాటిగా నిలుస్తున్నాడు. తాజాగా డిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో లంకతో జరుగుతున్న మూడో టెస్టులో కెప్టెన్ గా ఆరో డబుల్‌ సెంచరీని సాధించి బ్రియాన్‌ లారా లాంటి లెజెండ్ ఆటగాడు సాధించిన ఐదు ద్విశతకాల రికార్డును బ్రేక్ చేశాడు. గత 17 నెలల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో మరే కెప్టెన్‌ కూడా డబుల్‌ సెంచరీ నమోదు చేయకపోవడం విశేషం. దీన్ని బట్టి విరాట్‌ కొహ్లీ గోల్డెన్ ఫాంలో వున్నాడని మనకు అర్ధమౌతుంది. తన కెరీర్లోనే అత్యుత్తమ దశలో కొహ్లీ వున్నాడు.

ఇప్పటి వరకు కెప్టెన్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట 5 డబుల్ సెంచరీలతో ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. అంతేకాదు ఇండియా తరపున 6 డబుల్ సెంచరీలు చేసిన 3వ బ్యాట్స్‌మెన్‌గా కూడా కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. 17 నెలల్లోనే కోహ్లీ ఈ ఆరు డబుల్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో రెండో టెస్టులోనూ కోహ్లీ 213 పరుగులు సాధించాడు. గతంలో భారత్ తరుపున సెహ్వాగ్, సచిన్ ఆరేసి డబుల్ సెంచరీలు చేసిన రికార్డు వుంది. వరుసగా 2 టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన 5వ బ్యాట్స్‌మెన్ గా , 2వ భారతీయ ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వినోద్ కాంబ్లీ తర్వాత కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం.

శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌‌లో భాగంగా మూడు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు బాదిన తొలి అంతర్జాతీయ కెప్టెన్‌గా కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. తొలి మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 104 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లి రెండో టెస్టులో 213 పరుగులు చేశాడు. మూడో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు .

టెస్టుల్లోనే కాదు వన్డేల్లోను ఇటీవలే కొహ్లీ 31వ సెంచరీ సాధించడం విశేషం. అంతేకాదు మొదటి 200 వన్డేల్లో అత్యంతవేగంగా 8వేల 888 పరుగులు సాధించడంతో పాటు 55.55 సగటుతో కొహ్లీ వన్డే క్రికెట్ సూపర్ ఫాస్ట్ స్కోరర్ గా నిలిచాడు.

ఏబీ డివిలియర్స్, మాస్టర్ సచిన్ టెండుల్కర్ లను సైతం కొహ్లీ అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. మాస్టర్ సచిన్ 200 వన్డేల్లో 18 సెంచరీలతో కేవలం 7వేల పరుగులు మాత్రమే సాధిస్తే కొహ్లీ మాత్రం 200 వన్డేల్లోనే 31 శతకాలతో 8వేల 888 పరుగులు సాధించడం విశేషం. కొహ్లీ మొత్తం 31 శతకాలలో ముందుగా బ్యాటింగ్ చేసిన సమయంలో 12 సెంచరీలు చేజింగ్ కు దిగిన సమయంలో 19 సెంచరీలు ఉన్నాయి. చేజింగ్ లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఒకే ఒక్కడు విరాట్ కొహ్లీ మాత్రమే.

2008లో డంబుల్లా వేదికగా శ్రీలంక పై వన్డే అరంగేట్రం చేసిన కొహ్లీ ఆ తర్వాత వెనుదిరిగి చూడ లేదు. రానున్న కాలంలోనూ విరాట్ కొహ్లీ ఇదేఫాం, నిలకడ కొనసాగించగలిగితే మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న పలు ప్రపంచ రికార్డులు తెరమరుగు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి .

Show Full Article
Print Article
Next Story
More Stories