సౌతాఫ్రికా జైత్రయాత్రకు బయలుదేరిన విరాట్ సేన

Submitted by arun on Thu, 12/28/2017 - 17:24
Virat

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా కొత్త సంవత్సరంలో సరికొత్త సవాలుకు సిద్ధమయ్యింది. సౌతాఫ్రికాలో రెండుమాసాల జైత్రయాత్ర కోసం సఫారీకోటలో పాగావేసింది. 2017 సీజన్లో ఇంట్లో పులిగా సత్తా చాటుకొన్న విరాట్ సేన 2018 సీజన్లో రచ్చగెలవడం ద్వారా విదేశీ గడ్డపైనా పులినేనని చాటుకోడం కోసం తహతహలాడుతోంది. టీమిండియా సఫారీవేట పై..HMTV స్పెషల్ ఫోకస్....

టీమిండియా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ టీమ్. 2017 సీజన్లో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్ ల్లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన జట్టు. సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్లో ప్రపంచ రెండోర్యాంక్ జట్టు. స్వదేశీ ఫాస్ట్, బౌన్సీ పిచ్ లపై తిరుగులేని టీమ్ అయితే ఈ రెండు సూపర్ డూపర్ జట్లు ఒకదానితో ఒకటి తలపడితే ఆ పోరు ఎంత భీకరంగా హోరాహోరీగా ఉంటుందో మరికొద్ది రోజుల్లో సఫారీగడ్డపై సౌతాఫ్రికా- టీమిండియా జట్ల తీన్మార్ టెస్ట్ సిరీస్ సమరం ద్వారా తేలిపోనుంది. ఇప్పటి వరకూ శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లను అదీ స్వదేశీ వికెట్ల పైన ఓడిస్తూ వచ్చిన విరాట్ ఆర్మీ ఇప్పుడు అసలు సిసలు పోరాటానికి సిద్ధమయ్యింది. సౌతాఫ్రికాను సౌతాఫ్రికా గడ్డపైనే చిత్తు చేయాలన్న పట్టుదలతో సఫారీగడ్డపైన అడుగుపెట్టింది.

అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా పునరాగమనం తర్వాత 1991 నుంచి భారత్ ప్రత్యర్థిగా మొత్తం 12 సిరీస్ లు, 33 టెస్టుల్లో తలపడింది. స్వదేశంలో భారత్ ప్రత్యర్థిగా ఆడిన సిరీస్ ల్లో సఫారీ టీమ్ కు ఓటమి అంటూ లేకుండా పోయింది. సౌతాఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటి వరకూ ఆడిన 17 టెస్టుల్లో రెండే విజయాలు సాధించిందంటే అక్కడి ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపై గెలుపు ఎంతకష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ పై సౌతాఫ్రికా 8 విజయాలు  సాధిస్తే మరో ఏడు టెస్టులు డ్రాల ఖాతాలో చేరిపోయాయి. అయితే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా మాత్రం ప్రస్తుత 2018 సిరీస్ ద్వారా రికార్డును తిరగరాయాలన్న పట్టుదలతో ఉంది. పవర్ ఫుల్ బ్యాటింగ్, పదునైన బౌలింగ్ ఎటాక్ తో సౌతాఫ్రికా టీమ్ ను చిత్తు చేయగలనన్న ఆత్మవిశ్వాసంతో వ్యూహాలు సిద్ధం చేసుకొంది. మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జనవరి 5 నుంచి 28 వరకూ జరుగుతుంది. 

కేప్ టౌన్ వేదికగా జనవరి 5 నుంచి 9 వరకూ తొలిటెస్ట్, సెంచూరియన్ పార్క్ స్టేడియంవేదికగా జనవరి 13 నుంచి 17 వరకూ రెండో టెస్ట్, జోహెన్స్ బర్గ్ న్యూవాండరర్స్ స్టేడియం వేదికగా జనవరి 24 నుంచి 28 వరకూ మూడోటెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక ఆరుమ్యాచ్ ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకూ డర్బన్, సెంచూరియన్, కేప్ టౌన్, జోహెన్స్ బర్గ్, పోర్ట్ ఎలిజబెత్, సెంచూరియన్ వేదికలుగా జరుగుతుంది. టూర్ ఆఖరి అంచెలో భాగంగా తీన్మార్ టీ-20 సిరీస్ ఫిబ్రవరి 18 నుంచి 24 తేదీల మధ్య నిర్వహిస్తారు. తొలి టీ-20 ఫిబ్రవరి 18న జోహెన్స్ బర్గ్, 21న సెంచూరియన్ వేదికగా రెండో టీ-20, ఫిబ్రవరి 24న కేప్ టౌన్ వేదికగా ఆఖరి టీ-20 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ సిరీస్ ద్వారానే విదేశీగడ్డపై అందునా సఫారీనేలపై విరాట్ అండ్ కో సరుకు కరుకు ఏపాటిదో తేలిపోనుంది. గత ఏడాదికాలంగా ఇంటగెలుస్తూ వచ్చిన టీమిండియా ఈ సరికొత్త ఏడాదిలో రచ్చకూడా గెలవాలని అభిమానులు కోరుకొంటున్నారు.

English Title
Virat Kohli-led Indian cricket team, along with Anushka Sharma, left for the South Africa tour

MORE FROM AUTHOR

RELATED ARTICLES