ఎన్నికల వేళ రైతులకు వల

ఎన్నికల వేళ రైతులకు వల
x
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బడ్జెట్ ద్వారా రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధే ప్రథమ...

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బడ్జెట్ ద్వారా రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం అని ఆయన లోక్ సభలో ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్వేయమన్న జైట్లీ.. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది 11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించనున్నట్లు వివరించారు. అంతే కాదు కౌలు రైతులకు కూడా పంట రుణాలు ఇవ్వనున్నట్టు జైట్లీ ప్రకటించారు.

2018-19 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ.. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. 585 అగ్రికల్చర్ మార్కెట్లను ఈ-నామ్ కు అనుసంధానించామన్న ఆయన ఇప్పటి వరకు 470 మార్కెట్లను అనుసంధానించామన్నారు. మిగతా వాటిని వచ్చే రెండు నెలల్లో అనుసంధానిస్తామన్నారు. 22 వేల అగ్రికల్చర్ మార్కెట్లలో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు రెండు వేల కోట్లు రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.

ఎంపిక చేసిన క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్న జైట్లీ ఇందులో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ లో 8 శాతం వృద్ధి నమోదు అవుతుందన్న కేంద్ర మంత్రి.. ప్రధాన మంత్రి కృషి సంపాదన యోజన పథకం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనదని ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్న ఆయన ఇందుకోసం 1400 కోట్లు రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

టమాట, ఉల్లి, ఆలుగడ్డల ధరల్లో హెచ్చతగ్గులు ఆటు రైతుకు, ఇటు వినియోగదారునికి ఆందోళన కల్గిస్తున్నాయన్న జైట్లీ ఇందుకోసం చర్యలు చేపట్టినట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. వీటి ధరల స్థిరీకరణకు ఆపరేషన్ గ్రీన్ తీసుకువస్తున్నామన్న కేంద్ర మంత్రి ఇందుకోసం 500 కోట్లు రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పెంచుతూ అగ్రి ఎక్స్ పోర్ట్స్ పెంచేందుకు యత్నిస్తున్నామన్న జైట్లీ 42 ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

పాల ఉత్పత్తిదారులు, మత్స్య కారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామని ప్రకటించారు జైట్లీ. వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహిస్తామన్న ఆర్థిక మంత్రి ఇందుకోసం నాబార్డు నుంచి రుణాలు అందేలా చూస్తామన్నారు. మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక శాఖల అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2017-18లో వ్యవసాయ రుణాల కోసం పది వేల కోట్ల రూపాయలు కేటాయించామన్న ఆయన ఈ ఏడాది ఇందుకోసం 11 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలే అధిక ప్రాధాన్యం అని ప్రకటించిన జైట్లీ రైతుకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు కనిపించడం లేదు. మోడీ సర్కారు అధికారంలోకి రాగానే వ్యవసాయ బీమాను సంస్కరించినా క్షేత్ర స్థాయిలో అమలు అధ్వాన్నంగా ఉంది. దీని సవరణ, అమలు గురించి జైట్లీ ప్రకటన చేయకపోవడం సాగుదార్లను విస్మయానికి గురి చేసింది. రైతుకు స్థిరమైన ఆదాయం లేక నష్టాల బాట పడుతున్న రైతులను పటిష్టమైన వ్యవసాయ బీమా ప్రకటించలేకపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories