చెవిలో పాత పువ్వు

Submitted by arun on Fri, 02/09/2018 - 10:02
Arun Jaitley

ఆంధ్రా ఎంపీల ఆందోళనలతో కేంద్రం కొత్త వార్త వినిపిస్తుందేమోనని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. మూడు రోజులపాటు పార్లమెంట్లో ఒత్తిడి చేసినా.. ఏపీలో బంద్ నిర్వహించినా.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మనసు కరగలేదు. ఏపీకి సాయం అందిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని, సాయం కొనసాగుతుందంటూ పాత పొడిపొడి మాటల్నే రిపీట్ చేశారు. 

పార్లమెంట్ బయట రాజకీయ వేదికల మీద మాట్లాడిన మాటలే.. బీజేపీ నేతలు పార్లమెంట్లో వినిపించారు. ఇటీవలి బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులేమీ లేవంటూ... ఎన్డీయే మిత్రపక్షం సహా.. అన్ని ఇతర పార్టీలు కూడా 3 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రంలోని పెద్దలు మాత్రం వాటికి ప్రాధాన్యతే ఇవ్వలేదు. సభ వాయిదా వేయడానికి ముందు ఆర్థిక మంత్రి జైట్లీ ఏపీకి సాయంపై గొంతు పెకిలించారు. అయితే ఆయన ఎలాంటి నిర్దిష్ట ప్రకటనా చేయకపోవడం ఏపీ రాజకీయ నాయకుల్లోనే గాక, ప్రజలనూ నిరుత్సాహానికి గురి చేసింది. రాష్ట్ర విభజనకు మద్దతిచ్చినా ఏపీ హక్కుల కోసం చిత్తశుద్ధితో పోరాడామని, ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేశామని, మరికొన్ని అమలు దశలో ఉన్నాయన్నారు జైట్లీ. రాష్ట్రానికి పలు జాతీయ సంస్థలు కేటాయించామని, వాటికి నిధులు ఇస్తున్నామని, ఇంకా ఇస్తామనీ.. ఇలా పొడిపొడి మాటలే మరోసారి సభాముఖంగా వల్లించారు. 

అంతకుముందు అటు రోజంతా ఏపీలో పార్టీలకు అతీతంగా అన్ని ప్రజాసమూహాలు కలిసి ఏపీ బంద్ విజయవంతం చేశారు. పార్లమెంట్లో ఒత్తిడి పెంచితే ఫలితం ఉంటుందేమోనన్న ఆశాభావంతో టీడీపీ ఎంపీలతో పాటు.. విపక్ష కాంగ్రెస్, వైసీపీ ఎంపీలు కూడా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. పార్లమెంట్ బయట కూడా ప్లకార్డులతో నిరసనలు తెలిపి హోరెత్తించారు. కేంద్రం నుంచి నిర్దిష్ట ప్రకటన సాధించే ఉద్దేశంతో టీడీపీ ఎంపీలు, మంత్రి సుజనాచౌదరి అమిత్ షా తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పార్లమెంట్లో కొత్త ప్రకటన చేస్తానన్న హామీ లభించింది. దీంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే కార్యక్రమానికి ఏపీ ఎంపీలు సహకరించారు. 

ఇక సాయంత్రం సభ ముగిసేదాకా బడ్జెట్లోని అంశాలపైనే జైట్లీ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. జీఎస్టీ, డీమోనిటైజేషన్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ పాత పద్ధతిలోనే కాంగ్రెస్ మీద అటాక్ చేశారు. ఇక కాంగ్రెస్ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ మీద రక్షణ మంత్రి జవాబు చెప్పాలంటూ డిమాండ్ చేయగా.. అది భద్రతా రహస్యానికి సంబంధించిన వ్యవహారమంటూ అధికార పక్షం కొట్టిపారేసింది. కాంగ్రెస్ ఎంపీలు రాఫెల్ మీదనే పట్టుపట్టి.. జైట్లీ ప్రసంగాన్ని తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. వారి డిమాండ్ ను లైట్ తీసుకున్న జైట్లీ... ఆంధ్రా ప్యాకేజీని ఎత్తుకున్నారు. అదనపు నిధుల గురించి గానీ, విద్యాసంస్థలు, పోలవరం, రాజధానిపై కచ్చితమైన హామీ గానీ జైట్లీ నోట రాలేదు. దీంతో ఎంపీలు మరోసారి జైట్లీ ప్రసంగాన్ని అడ్డుతగిలారు. ఆ గందరగోళం నడుమ సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. 

English Title
Unhappy with finance minister Arun Jaitley's statement in Parliament

MORE FROM AUTHOR

RELATED ARTICLES