ఒక ప్రేమ ... రెండు ప్రాణాలు

ఒక ప్రేమ ... రెండు ప్రాణాలు
x
Highlights

వాళ్లిద్దరూ పదో తరగతి విద్యార్థులు.. ఒకే స్కూల్‌లో చదువుతున్నారు... ఒకరికి తెలియకుండా ఒకరు వారి స్కూల్లోనే చదివే ఓ అమ్మాయిని ప్రేమించారు. కానీ...

వాళ్లిద్దరూ పదో తరగతి విద్యార్థులు.. ఒకే స్కూల్‌లో చదువుతున్నారు... ఒకరికి తెలియకుండా ఒకరు వారి స్కూల్లోనే చదివే ఓ అమ్మాయిని ప్రేమించారు. కానీ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేకపోయారు. చెబితే ఎక్కడ కాదంటుందోనని పెదవి దాటనీయలేదు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు ఎక్కడ తప్పుబడతారోనని ఎక్కడ కాదంటారోనని ఎవరికివారే మానసిక ఆవేదనకు గురయ్యారు. ఇటీవలే తాము ప్రేమించింది ఒకే అమ్మాయిని అని తెలుసుకున్నారు. అమ్మాయి లేకుండా ఉండలేమని భావించారు. చదివే వయసులో ప్రేమేంటని స్కూల్‌ యాజమాన్యం ప్రశ్నిస్తుందనుకున్నారో లేక పెద్దలు కొడతారని భయపడ్డారో తెలియదు కానీ, ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలిద్దామని నిర్ణయించుకున్నారు.

ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం నుంచి కలసి తిరిగిన ఇద్దరూ రాత్రి 7 గంటలకు ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. మైకం వచ్చిన తర్వాత మద్యంతోపాటు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. వీరిలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరో విద్యార్థిని కరీంనగర్‌ జిల్లా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించేలోపే చనిపోయాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.

జగిత్యాల పట్టణం విజయపురికాలనీకి చెందిన కూసరి రవి, లత దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మహేందర్‌ విద్యానగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. విద్యానగర్‌కు చెందిన బంటు శ్యామల కుమారుడు రవితేజ అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి మద్యం సేవించారు. అక్కడే పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు.

బాధ తట్టుకోలేక అరుపులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పూర్తిగా కాలిపోయిన మహేందర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. 85శాతం కాలిన గాయాలతో ఉన్న రవితేజను స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవితేజ చనిపోయాడు.

ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న జగిత్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడ ఓ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా?.. లేక ఇంకేమైనా ఉందా?.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు. జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్‌ చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రవితేజతోపాటు అతడి తల్లి శ్యామలను తండ్రి చిన్నప్పుడే వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో రవితేజ.. పెద్దమ్మ, పెద్దనాన్న వద్దే ఉంటూ చదువుకుంటున్నాడు. పెద్దనాన్న సుధాకర్‌ ఏఎస్‌ఐగా ఉద్యోగ విరమణ పొందారు. కొడుకే తన ప్రపంచం అని భావించి అతని కోసమే బతుకుతున్న శ్యామల.. రవితేజ పాల్పడిన అఘాయిత్యంతో తేరుకోలేని స్థితికి చేరుకుంది. అలాగే.. వ్యవసాయ కుటుంబానికి చెందిన మహేందర్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో అతని తల్లిదండ్రులు రవి, లత కన్నీరుమున్నీరవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories