జైట్లీ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయి

Submitted by arun on Thu, 03/08/2018 - 10:28
babu

కేంద్రంలో ఐదేళ్లు కలిసుంటామని చేసుకున్న ఒప్పందం నాలుగేళ్లకే కాలగమనంలో కలిసిపోయింది. కేంద్ర కేబినేట్ నుంచి బయటకు రావాలని టీడీపీ నిర్ణయించింది. రాష్ట్రానికి న్యాయం జరగడం లేదు కాబట్టే.. తీవ్ర నిర్ణయం తీసుకున్నామన్న ముఖ్యమంత్రి.. ఇవాళ తమ కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి బయటికి వచ్చినప్పటికీ ఎన్డీఏలో కొనసాగుతామని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం.. కేంద్ర కేబినేట్ నుంచి వైదొలుగుతున్నట్లు.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. బుధవారం సాయంత్రం నుంచి పార్టీ ఎంపీలు, కేంద్రమంత్రులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన ఆయన.. రాత్రి పొద్దుపోయాక తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఏ లక్ష్యం కోసమైతే కేంద్రకేబినేట్ లో చేరామో.. ఆ లక్ష్యం నెరవేరలేదని.. అందుకే బయటకు వస్తున్నామని తెలిపారు. రాజీనామాల విషయాన్ని మోడీకి వివరించాలని ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు. గురువారం తమ మంత్రులు అశోకగజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామా చేస్తారని వివరించారు. మరోవైపు జైట్లీ వ్యాఖ్యలు తెలుగువారిని అవమానించినట్లుగా ఉన్నాయని చంద్రబాబు అభివర్ణించారు. 

హామీల్లో బీజేపీ భాగస్వామ్యం ఉంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో బీజేపీ కూడా భాగస్వామే అని చంద్రబాబు చెప్పారు. ఆ హామీలను అమలు చేయాలని మాత్రమే కోరామన్నారు. బలవంతంగా విభజించి.. అప్పుల కుంపటి పెట్టి వెళ్లగొట్టారని.. ఇలాంటి సమయంలో తమ న్యాయమైన కోరికను అమలు చేయనప్పుడు.. చివరి అంశంగా బయటకు వస్తున్నామని.. చంద్రబాబు వివరించారు. 

ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఇవ్వాలని అడిగాం
విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి.. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నట్లే ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని అడిగామన్నారు.. చంద్రబాబు. వెనుకబడ్డ రాష్ట్రాలకిచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకివ్వరని ప్రశ్నించారు. పరిశ్రమల ఏర్పాటు సమయంలో ఇచ్చే ప్రత్యేక ఇన్సెంటీవ్ లు ఇవ్వాలని.. 18 అంశాలతో కూడిన చిట్టాను కేంద్రానికి అందించామన్నారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని చంద్రబాబు చెప్పారు. 

వైసీపీ వ్యవహారశైలిపై ఆగ్రహం 
మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో.. ప్రతిపక్ష వైసీపీ వ్యవహారశైలిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏ ఉద్దేశ్యంతో పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు మద్దతిచ్చారో ఇప్పటివరకు బయటకు చెప్పలేదని.. చంద్రబాబు వివరించారు. 

ఎన్డీయే నుంచి ఇప్పుడే పూర్తిగా తప్పుకోవట్లేదని చంద్రబాబు చెప్పారు. మొదట కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి తెలుగు ప్రజల ప్రతిఘటనను తెలియజేస్తామని అన్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను బట్టి తర్వాతి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ముందుకు నడవాలన్నారు. లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూనే.. హక్కుల కోసం పోరాడాల్సి ఉంటుందని.. స్పష్టం చేశారు. 

English Title
two tdp ministers resign union cabinet

MORE FROM AUTHOR

RELATED ARTICLES