మోగిన సమ్మె గంట మొదటికే మోసం వస్తుందా?

మోగిన సమ్మె గంట మొదటికే మోసం వస్తుందా?
x
Highlights

తెలంగాణ ఆర్టీసి మళ్లీ సమ్మె సైరెన్ మోగిస్తోంది.. జీతాలు పెంచాలనీ, సంస్థకు అదనంగా నిధులు మంజూరు చేయాలని కోరుతోంది. తమ విన్నపాలను ప్రభుత్వం...


తెలంగాణ ఆర్టీసి మళ్లీ సమ్మె సైరెన్ మోగిస్తోంది.. జీతాలు పెంచాలనీ, సంస్థకు అదనంగా నిధులు మంజూరు చేయాలని కోరుతోంది. తమ విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈనెల 11 నుంచి సమ్మె ప్రారంభిస్తామంటూ నోటీస్ కూడా ఇచ్చింది. ఆర్టీసి సమ్మె బెదిరింపుపై అటు ముఖ్యమంత్రి కూడా స్వరం పెంచారు. ఆర్టీసి చీటికి మాటికీ బెదిరింపులకు పాల్పడటం సరైనది కాదని అలా బెదిరిస్తే ఇదే ఆఖరు సమ్మె అవుతుందనీ హెచ్చరించారు.. యూనియన్ నాయకుల మాట వినిమోసపోవద్దని, అసలే సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు సమ్మెలు పరిష్కారం కాదనీ కేసిఆర్ వ్యాఖ్యానించారు..ఆర్టీసీలో సమ్మెలు నిషేధించినా ఇంకా నోటీసులివ్వడం తప్పని కార్మికులు యూనియన్ లీడర్ల బుట్టలో పడొద్దని కేసిఆర్ సూచించారు. అటు ప్రభుత్వం.. ఇటు ఆర్టీసీ సిబ్బంది మధ్య రెండు రోజులుగా నడుస్తున్న వాదోపవాదాలకు తెర దించడానికి రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.ఆర్టీసి కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలనూ ఇవ్వలేదు.

ఆర్టీసి ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున సమ్మె నిర్ణయం సంస్థకు మరింత నష్టం చేస్తుందన్నది మంత్రి మహేందర్ రెడ్డి వాదన. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్మె వాయిదా వేయాలని మంత్రి కోరారు. అయితే ఆర్టీసి కార్మిక సంఘాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.. ఆర్టీసిని లాభనష్టాలతో చూడొద్దని.. సంస్థ పది కాలాలపాటూ కొనసాగాలంటే సిబ్బంది జీతాలు పెంచాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు.ఆర్టీసిని కేసిఆర్ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని అందుకే తప్పుడు ప్రకటనలిస్తున్నారని ఆర్టీసి జేఏసి కన్వీనర్ అంటున్నారు.

తెలంగాణ ఆర్టీసిఏటా 700కోట్ల నష్టంతో నడుస్తోంది. ఈ సంస్థకు 3వేల కోట్ల అప్పులున్నాయి.. వాటిపై ఏటా 250 కోట్ల వడ్డీ భారం పడుతోంది. ఇలాటి పరిస్థితుల్లో సమ్మెకు దిగితే.. సంస్థ పూర్తిగా మునిగిపోయే ప్రమాదముంది.. సిబ్బంది సమ్మె మొదలు పెడితే ఈ నష్టాలకు తోడు రోజుకు నాలుగు కోట్ల రూపాయలు నష్టం చవిచూడాల్సి వస్తుంది. సిబ్బంది కోరినట్లు 25 శాతం ఇంటెరిమ్ రిలీఫ్, 50 శాతం ఫిట్ మెంట్ ఇస్తే సంస్థపై 1400కోట్ల అదనపు భారం పడుతుంది. అప్పుల్లో ఉన్న ఆర్టీసిపై ఇది మరింత భారం వేయడమేనని సిఎం కేసిఆర్ వాదిస్తున్నారు. నష్టాలు పూడ్చుకోడం కోసం బస్సు చార్జీలు పెంచడం సరైనది కాదని కూడా కేసిఆర్ సూచించారు.రెండేళ్ల క్రితం ఆర్టీసి విస్తృత సమావేశంలో 9డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని తేలిందని ఇవాల్టికీ పరిస్థితిలో మార్పు లేదని అన్నారు.

కేవలం ఆర్టీసీ యూనియన్ల అలసత్వం వల్లనే సంస్థ నష్టాల్లోకి చేరుతోందని కేసిఆర్ అన్నారు.. మరోవైపు సమ్మె నిర్ణయంలో వెనకడుగు లేదంటున్న సంఘాలు శనివారం మధ్యాహ్నం అత్యవసర సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నాయి. కేవలం యూనియన్ ఎన్నికల్లో గెలుపు కోసం ఆర్టీసి యూనియన్లు ఇలాటి ఆలోచనలు చేస్తున్నాయా? ఉద్యోగుల జీతాలను 44 శాతం మేరకు పెంచామన్న వాదనలో నిజం లేదా? ఆర్టీసి నష్టాలకు కారణాలేంటి? ఆర్టీసిని ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనలున్నాయా? ఆర్టీసి చరిత్రలో ఈ సమ్మె చివరి సమ్మెగా మిగులుతుందా?

Show Full Article
Print Article
Next Story
More Stories