మద్యం ధరలు పెంచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం?

Submitted by lakshman on Tue, 09/19/2017 - 19:42

హైదరాబాద్: తెలంగాణలో మద్యం ధరలు పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మందుబాబులకు ఈ నిర్ణయం చేదు బీరులా అనిపించినా మద్యం కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పేలా లేదని ఆ శాఖ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. పలు మద్యం తయారీ కంపెనీలు ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మద్యం తయారీ ఖర్చు పెరిగిందని, డిమాండ్‌కు తగ్గట్టుగా మద్యాన్ని సప్లయ్ చేయాలంటే పెంచక తప్పదని ఆయా కంపెనీలు అబ్కారీ శాఖకు స్పష్టం చేశాయి. పైగా రెండేళ్లుగా తెలంగాణలో మద్యం ధరలు పెంచలేదని సదరు కంపెనీలు గుర్తుచేశాయి. దీంతో సంబంధిత శాఖా మంత్రి, అధికారులు సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు నివేదికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే చీప్ లిక్కర్ తాగే వారికి ఈ సెగ తగలదనే చెప్పొచ్చు. మద్యం ధరలు పెంచడానికి అబ్కారీ శాఖ సిద్ధంగా ఉన్నప్పటికీ, ఉన్నత శ్రేణి మద్యం బ్రాండ్ల పైనే పెంపును వర్తింపజేయాలని యోచనలో ఉంది. దీంతో కొందరు మద్యం ప్రియులపై ఈ పెంపు భారం పడదనే చెప్పాలి. అయితే ప్రథమ శ్రేణి మద్యం బ్రాండ్ల ధరలను మాత్రం భారీగా పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దాదాపు 5 నుంచి 10శాతం వరకూ పెంచేందుకు అబ్కారీ శాఖ సిద్ధపడినట్లు సమాచారం. అయితే సీఎంతో చర్చల అనంతరం, ఆయన తీసుకునే తుది నిర్ణయంపైనే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తుందా.. లేదా అనే విషయంపై స్పష్టత రానుంది.

ఈ విషయంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారి  ఒకరు స్పందిస్తూ ఈ ప్రతిపాదన ఇవాళ కొత్తేమీ కాదని.. గత సంవత్సరం కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే అప్పుడు సీఎం మద్యం ధరలను పెంచాలన్న ప్రతిపాదనను అంగీకరించలేదన్నారు. అబ్కారీ శాఖ మాత్రం ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు మద్యం ధరలను పెంచడం వల్ల రూ.1,500కోట్ల ఆదాయం వస్తుందని అబ్కారీ శాఖ లెక్కలు కడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆదాయం 2,500 కోట్ల వరకూ వస్తుందని భావిస్తోంది. ఈ నెలాఖరు లోపు మద్యం ధరల పెంపు ప్రతిపాదనపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అబ్కారీ శాఖ ఆశిస్తోంది. అయితే ఈ ప్రతిపాదన దసరా పండగ లోపు అమల్లోకొస్తే మందుబాబుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముందని, ఈ నెలాఖరు తర్వాత సీఎం దృష్టికి ఈ ప్రతిపాదనను తీసుకెళ్లాలని మంత్రి పద్మారావు భావిస్తున్నారు.

English Title
TS government may hike liquor prices

MORE FROM AUTHOR

RELATED ARTICLES