ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ట్రంప్‌, కిమ్ భేటీ

Submitted by arun on Tue, 06/12/2018 - 13:54
kimtrump

ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సింగపూర్‌లో ఇవాళ ఉదయం తొలిసారి సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్‌లు...గతానికి భిన్నంగా స్పందించారు. మొదటి నుంచి చివరి దాకా సమావేశం హ్యాపీగా సాగిందని ఇరుదేశాల అధ్యక్షులు ట్రంప్, కిమ్ ప్రకటించారు. 

ఉప్పునిప్పులా ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్‌‌ల మధ్య సమవేశం ముగిసింది. సింగపూర్‌లోని సెంటోసా ఐస్‌ల్యాండ్‌‌లో కెపెల్లా హోటల్‌...ఇద్దరు అగ్రనేతలు 40 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. హోటల్‌లో ఇద్దరు నేతలు కరాచలం చేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. 

ట్రంప్ చర్చలు జరిగే గది వైపు నడుస్తూ... తానే చొరవతీసుకుని ఎక్కువ సార్లు కిమ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ట్రంప్ వైపు తిరిగి తదేకంగా ఆయన చెప్పేది వింటూ ముందుకు నడిచారు కిమ్ జంగ్. తర్వాత ఏకాంతంగా చర్చలు జరిపే గ్రంధాలయం వైపు కొరియా అధ్యక్షుడిని ట్రంప్  తీసుకెళ్లారు. కిమ్ భుజంపై ట్రంప్‌ చేతులు వేసి నడుస్తూ వెళ్లారు. 

కిమ్‌‌తో భేటీ అద్భుతంగా సాగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చెప్పారు. సమావేశం తర్వాత ఊహించని పరిణామాలు జరుగుతాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. శాంతి స్థాపనకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్లు కిమ్‌ అన్నారు. ఎన్నో అడ్డంకులను అధిగమించిన తర్వాత కల సాకారమైందని ఇద్దరు నేతలు ప్రకటించారు.

రెండు దేశాల అధ్యక్షుల సమావేశం ముగిసిన తర్వాత....దౌత్యాధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనే ప్రధాన ఎజెండాగా మీటింగ్‌ జరిగింది. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే ఉత్తరకొరియా భద్రతకు హామీ ఇస్తామని అమెరికా తెలిపినట్లు సమాచారం. ఈ భేటీ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఇరు దేశాధినేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. 1950లో జరిగిన కొరియా యుద్ధం తర్వాత....అమెరికా, ఉత్తర కొరియాలు శత్రువులుగా మారిపోయాయ్. తర్వాత రెండు దేశాల ప్రతినిధులు ఒకే వేదికను పంచుకోలేదు...సమావేశం కాలేదు. తొలిసారి ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం కావడంతో...మరో చరిత్రకు నాంది పలికింది.

English Title
Trump Kim summit: US and North Korean leaders hold historic talks

MORE FROM AUTHOR

RELATED ARTICLES