రేవంత్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న టీఆర్ఎస్ ఎంపీలు

Submitted by chandram on Thu, 11/15/2018 - 19:51

రేవంత్‌ వ్యాఖ్యలు టీఆర్ఎస్‌లో చిన్నపాటి అలజడి సృష్టించాయి. ఎన్నికల్లోపు ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌ హస్తం అందుకుంటారన్న మాటలపై గులాబీ ఎంపీలు భగ్గుమన్నారు. రేవంత్‌ మతి తప్పి మాట్లాడుతున్నారని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నట్లు రేవంత్‌ మరోసారి స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్‌ 7 లోపు ఇద్దరు గులాబీ ఎంపీలు టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తారంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చిన్నపాటి కల్లోలం సృష్టించాయి. అసలా ఇద్దరు ఎవరంటూ ఆరాలు తీశారు. అయితే గురువారం ఇద్దరు టీఆర్ఎస్‌ ఎంపీలు సీతారాం నాయక్‌, విశ్వేశ్వర్‌రెడ్డిలు ఈ విషయంపై స్పందించారు. రేవంత్‌రెడ్డి మతితప్పి మాట్లాడుతున్నారని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయిన ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తాను టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తానెప్పటికీ కేసీఆర్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఇటు సీతారాం నాయక్‌ కూడా రేవంత్‌ వ్యాఖ్యలను ఖండించారు. అయితే టీఆర్ఎస్‌ ఎంపీలు చేసిన ప్రకటనపై స్పందించిన రేవంత్‌రెడ్డి ఇప్పటికీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో 7 లోపు టీఆర్‌ఎస్‌ నుంచి రెండు వికెట్లు పడతాయన్నారు. ఆ ఇద్దరి పేర్లను చెప్పలేనన్న రేవంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ప్రచారంలో విశ్వేశ్వర్‌రెడ్డి ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి చెందిన వారే సచ్చీలురా అని ప్రశ్నిస్తున్న రేవంత్‌ మిగతావాళ్లను ఆయన ఎందుకు నమ్మడం లేదని ప్రశ్నిస్తున్నారు. తాను చెప్పిందే జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

English Title
TRS MPs Condemned Congress Leader Revanth Reddy Comments

MORE FROM AUTHOR

RELATED ARTICLES