కారు టాప్‌గేర్‌... క్యాంపెన్‌లో దూకుడు

కారు టాప్‌గేర్‌... క్యాంపెన్‌లో దూకుడు
x
Highlights

క్యాంపెన్‌లో టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది కారు. ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి, యమ స్పీడ్‌తో వెళుతున్న కారు, గేర్లు మార్చుతూ గల్లీగల్లీకి...

క్యాంపెన్‌లో టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది కారు. ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి, యమ స్పీడ్‌తో వెళుతున్న కారు, గేర్లు మార్చుతూ గల్లీగల్లీకి ప్రచారాన్ని తీసుకెళుతోంది. మహాకూటమికి అందనంత దూరంలో, క్యాంపెన్‌‌లో సాగిపోతోంది. అసెంబ్లీని రద్దు చేయడం...వెనువెంటనే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం, ఆ తర్వాతి రోజే ప్రజాశీర్వాద సభతో ప్రచారాన్ని ప్రారంభించడం, అన్నీ చకచకా ప్రారంభిస్తూ, ఎన్నికల సంగ్రామానికి శంఖారావం పూరించారు కేసీఆర్. అదే స్పీడుతో అభ్యర్థులను ప్రచారపర్వంలో పరుగులు పెట్టిస్తున్నారు.

ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. వీలైనంత త్వరగా తొలి విడత ప్రచారాన్ని ముగించాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గ్రామగ్రామాన తిరుగుతూ, ప్రభుత్వ పథకాలు, తిరిగి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని గులాబీ అధినేత, అభ్యర్థులకు కర్తవ్యబోధ చేశారు. దీంతో అభ్యర్థులంతా, కాలికి బలపం కట్టుకుని గల్లీగల్లీ తిరుగుతున్నారు.

తాజామాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమతమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, వినూత్నంగా క్యాంపెన్‌ నిర్వహిస్తున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ పథకాలను వివరిస్తూనే, మరోవైపు మహాకూటమిపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. మంత్రి హరీష్‌ రావు కూడా, సిద్దిపేటలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొన్ని గ్రామాలు హరీష్‌ రావు అభ్యర్థిత్వానికి ఓటేస్తూ, తీర్మానం చేస్తున్నాయి.

ఇక మిగతా టీఆర్ఎస్‌ అభ్యర్థులు కూడా, ప్రచారాపర్వాన్ని వేడెక్కిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రచారంపైనే నిఘా బృందం దృష్టి పెట్టింది. అభ్యర్ది ప్రచార శైలి ఎలా ఉంది? ప్రభుత్వ పథకాలను, టీఆర్ఎస్ సర్కార్ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? విపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొడుతున్నారా? సామాజిక వర్గాల వారీగా అభ్యర్థికున్న ఆదరణ వంటి విషయాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తానికి ప్రకటించిన 105 మందిలో 20 మందికి టికెట్‌ తారుమారు అవుతుందన్న ఊహాగానాలు, క్యాంపెన్‌లో దూసుకుపోవాలన్న అధినేత ఆదేశాలతో, టీఆర్ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో చాలా ముందున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories